ETV Bharat / bharat

కాంగ్రెస్​లో జీ23 గుబులు- చీలిక ఖాయమా?

author img

By

Published : Feb 28, 2021, 1:58 PM IST

సమస్యల ఊబిలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ లేఖలు రాసిన 23 మంది.. తాజాగా ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ చీలిపోవడానికి ఇది సంకేతమా? హస్తం పార్టీ రెండుగా మారడానికి జమ్ము కశ్మీర్ వేదిక అవుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Is Jammu visit a 'show of strength' for G23 leaders?
కాంగ్రెస్​ను చీల్చడమే జీ23 నేతల ఉద్దేశమా?

దాదాపు ఏడాది తర్వాత కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తన స్వస్థలమైన జమ్ము కశ్మీర్​లో పర్యటించారు. తనతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసిన 22 మందిని వెంట తీసుకెళ్లారు. ఈ పరిణామాన్ని... పార్టీ హైకమాండ్​పై తాజా తిరుగుబాటుగా పరిగణించొచ్చా?

చాలా కాలం తర్వాత జమ్ముకు వచ్చిన ఆజాద్​కు స్థానికంగా ఘన స్వాగతం లభించింది. యువత పెద్ద ఎత్తున ఆయనకు ఆహ్వానం పలికారు. పార్టీలో నాయకత్వ సమస్యపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన(జీ23 బృందం) సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, భూపిందర్ హుడా, మనీశ్ తివారీ, వివేక్ తన్ఖా.. ఆజాద్​తో పాటు ఉన్నారు.

'గాంధీ'లేరీ?

అయితే ఆజాద్​కు స్వాగతం పలికేందుకు వచ్చినవారిలో ఒక్కరు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించలేదు. అక్కడ ప్రదర్శించిన పోస్టర్లలో 'గాంధీ'ల ఫొటోలు లేవు. సభాస్థలిని సైతం జాగ్రత్తగా ఎంచుకున్నారు. అసంతృప్తులంతా అధిష్ఠానానికి గట్టి సందేశాన్ని ఇస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకే బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు.

ఇదీ చదవండి: కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!

అధికారికంగా మాట్లాడుకుంటే.. గులాం నబీ ఆజాద్ అధ్యక్షత వహించిన 'గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ' అనే ప్రభుత్వేతర సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి జీ23 సభ్యులంతా వెళ్లారు. అయితే వీరిలో ఎవరూ కూడా.. జమ్ము కశ్మీర్ పీసీసీ చీఫ్​ను ఇంతవరకు కలవలేదు. పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసుకున్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారనేందుకు ఇదో సూచన అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Is Jammu visit a 'show of strength' for G23 leaders?
జమ్ము కశ్మీర్ సమావేశంలో 'జీ23' నేతలు

లేఖ తర్వాత పరిణామాలెన్నో...

పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీరంతా ఇప్పటికే అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఆ తర్వాతా పార్టీలో పెద్దగా కదలిక లేదు. వ్యవస్థాగత ఎన్నికలు జులైలో నిర్వహిస్తామని పార్టీ నుంచి ఓ ప్రకటన వెలువడినప్పటికీ.. ఎన్నికల తర్వాత నాయకత్వంలో మార్పులు చేయడం వల్ల లాభం ఉండదని ఈ రెబల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేఖ రాసిన తర్వాత జరిగిన పరిణామాలు వీరిలో అసంతృప్త జ్వాలను మరింత పెంచినట్లు కనిపిస్తోంది.

రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసిన సమయంలో గులాం నబీ ఆజాద్​ను ఉద్దేశించి మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగం, ఆజాద్​కు కాంగ్రెస్ మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడం, ఆనంద్ శర్మను కాదని మల్లికార్జున ఖర్గేకు రాజ్యసభలో విపక్షనేత హోదా ఇవ్వడం వంటి కారణాలు జీ23 నేతల సెంటిమెంట్​ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఎగువసభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు ఈ పదవి ఇవ్వనందువల్ల ఆనంద్ శర్మ పలువురి వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధత గురించి తమను పార్టీ సంప్రదించకపోవడంపైనా ఈ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?

తమిళనాడులో సీట్ల పంపకాల విషయంలో డీఎంకేతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆజాద్​ను కాదని రణదీప్ సింగ్ సుర్జేవాలాకు బాధ్యతలు అప్పగించడంపైనా విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల రాహుల్ చేసిన 'ఉత్తర-దక్షణ భారత దేశ' వ్యాఖ్యలపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను కపిల్ సిబల్, ఆనంద్ శర్మ పరోక్షంగా తప్పుబట్టారు కూడా. అసెంబ్లీ ఎన్నికలపై వీటి ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ వైఖరి ఏంటి?

అసంతృప్తుల పర్యటనను వివాదాస్పదం చేసే ప్రయత్నాలకు కాంగ్రెస్ దూరంగా ఉంది. కశ్మీర్ సమావేశాన్ని సానుకూలంగానే స్వీకరించింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పార్టీ వైఖరిని వెల్లడించారు. జమ్ములో ఉన్న సీనియర్ నేతలందరూ గౌరవనీయులేనని స్పష్టం చేశారు. పార్టీకి వారెంతో కీలకమని చెప్పారు. పార్టీలో వారు ఉండటం తమకు గర్వకారణమని, పార్టీని చూసి వారు కూడా గర్వపడుతున్నారని భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో వారూ ఒకరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ సేవలను గుర్తు చేశారు.

"ఆజాద్ ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. కొందరు ఇస్తెమాల్(వాడుకోవడం) అనే పదాన్ని వాడుతున్నారు. ఈ పదాన్ని ఉపయోగించేవారికి సమకాలీన కాంగ్రెస్ చరిత్ర తెలియకపోవచ్చు. ఏడు దఫాలుగా కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన ఆజాద్​ను చూసి గర్విస్తున్నాం. ఆయన ఓ విజయవంతమైన ముఖ్యమంత్రి. ఇందిరాగాంధీ కాలం నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా గౌరవం అందుకున్నారు."

-అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ ప్రతినిధి

అయితే ఆజాద్ అనుభవాన్ని పార్టీ మరింతగా ఉపయోగించుకుంటే బాగుండేదని అసంతృప్త నేతల్లో ఒకరైన కపిల్ సిబల్ చెబుతున్నారు. ఆజాద్ పదవీ విరమణ చేసేందుకు పార్టీ అనుమతించాల్సింది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనంగా మారిపోతోందనే కశ్మీర్​లో సమావేశమైనట్లు చెప్పారు. ఇదే వాస్తవమని అన్నారు. గతంలోనూ ఇలా సమావేశం అయినట్లు తెలిపారు.

ఎన్నికల రాష్ట్రాల్లో పర్యటించరా?

జీ23 సభ్యులు నిర్వహించిన సమావేశంపై పార్టీ సానుకూలంగానే స్పందించినప్పటికీ.. పలువురు నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేయాల్సిన అవసరం ఏముందని పార్టీ నేత తెహ్సీన్ పూనెవాలా ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వీరు ఎందుకు ప్రచారాలు చేయడం లేదని నిలదీశారు.

ఇదీ చదవండి: ఎన్నికల సమరం: కమలం ఆరాటం.. కాంగ్రెస్​ పోరాటం

పార్టీలో చీలిక!

ఈ పరిణామాలను గమనించిన భాజపా... కాంగ్రెస్ పరిస్థితిని ఎద్దేవా చేస్తోంది. కాంగ్రెస్​లో మరో చీలిక ఏర్పడుతుందన్న రాజకీయ విశ్లేషకుల మాట నిజమవుతోందని భాజపా నేత, జమ్ము కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ నుంచే ఇది ప్రారంభమైందని అన్నారు. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం అంటూ కాంగ్రెస్​లో మిగిలిపోయిన నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 'కాంగ్రెస్​ పార్టీ నాశనం అయ్యేందుకు బయట శక్తుల ప్రమేయం అవసరం లేదు. పార్టీ నేతలే పూర్తి సమర్థతతో అందుకోసం పనిచేస్తున్నారు. ఏ విషయంలోనూ దేశానికి పనికిరాని ఈ పార్టీ నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుంది' అని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

కాంగ్రెస్ 'శబరిమల వ్యూహం' ఫలిస్తుందా?

మిత్ర పక్షాల అండతో విజయంపై 'హస్తం' ​గురి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.