ETV Bharat / bharat

పెగాసస్ వివాదంతో ప్రతిపక్షం సంఘటితం!

author img

By

Published : Jul 24, 2021, 9:11 AM IST

pegasus
పెగాసస్ విపక్షాల ఆయుధం

పెగాసస్ స్పైవేర్ వివాదం భారత్​ను అంతర్జాతీయంగా చిక్కుల్లోకి నెట్టేలా ఉంది. అమెరికా, ఐరోపా సంస్థలపై నిఘా వేశారన్న వార్తలపై ఆయా దేశాలు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. దేశంలోనూ విపక్షాలకు ఇదో బలమైన ఆయుధంగా మారింది. పెగాసస్‌ అంశాన్ని అజెండాగా చేసుకుని ఎన్​డీఏ సర్కారుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌ సహా అనేక దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదాన్ని 'భారతదేశ వాటర్‌ గేట్‌ కుంభకోణం'గా విపక్షాలు పేర్కొంటున్నాయి. అమెరికాలో రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం 1972-74 మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్‌ సంభాషణలను ఆలకించేందుకు గుప్త సాధనాలను వాడారు. ఆ విషయం బహిర్గతం కావడంతో, 1974 ఆగస్టు 8న నిక్సన్‌ రాజీనామా చేశారు. దీన్ని వాటర్‌ గేట్‌ కుంభకోణంగా పేర్కొంటారు.

భారత్‌లో బోయింగ్‌, డసో, సాబ్‌ వంటి బడా కార్పొరేట్‌ సంస్థల ఉన్నతాధికారుల ఫోన్‌ సంభాషణలను ఆలకించడానికి పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించారన్న మీడియా కథనాలు ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలకు చెందిన ఈ మూడు సంస్థలు... భారత్‌కు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు

తమ దేశీయ సంస్థల అధికారులు మాట్లాడుకునే విషయాలపై భారత ప్రభుత్వం నిఘా వేయడం ఐరోపా సమాఖ్య (ఈయూ)కు ఏమాత్రం రుచించదు. అమెరికన్‌ సంస్థ బోయింగ్‌పై నిఘా పెట్టడాన్ని జో బైడెన్‌ ప్రభుత్వం సహించదు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్భాటంగా ప్రారంభించిన 'క్వాడ్‌' పట్ల బైడెన్‌ అంత ఉత్సాహం కనబరచకపోవడం ఇప్పటికే భారత్‌ ప్రాధాన్యాన్ని నీరుగార్చుతోంది. అసలే పౌరసత్వ చట్టం (సీఏఏ), మత స్వేచ్ఛ, సైబర్‌ చట్టాల విషయంలో మనదేశ విధానాల పట్ల విముఖత ప్రదర్శిస్తున్న పాశ్చాత్య దేశాలు... పెగాసస్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించవచ్చు. ఈ కుంభకోణం భారత్‌ ప్రతిష్టను దెబ్బతీసి, మిత్రులను దూరంచేసే ప్రమాదం కనిపిస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ సృష్టించిన చిక్కుముడి నుంచి భారత్‌ను బయటపడేయడానికి ఇజ్రాయెల్‌ సహకరించే సూచనలు కూడా కనిపించడం లేదు.

ప్రతిపక్షాల చేతికి బలమైన ఆయుధం...

భారత్‌లోని ప్రతిపక్షాలు పెగాసస్‌ అంశాన్ని అజెండాగా చేసుకుని ఎన్​డీఏ సర్కారుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రానున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షం సంఘటితం కావడానికి ఈ వివాదం దోహదపడవచ్చు. ఇప్పటికే వ్యవసాయ చట్టాలపై ఆత్మరక్షణలో పడిన ఎన్​డీఏ ప్రభుత్వానికి... పెగాసస్‌ సమస్య గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ప్రస్తుత పరిణామాలు ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నాయని దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ విశ్లేషకుడు ఆచార్య కుమార్‌ సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

(సంజీవ్ బారువా- సీనియర్ పాత్రికేయులు)

ఇదీ చదవండి: Pegasus Software 'మా సాఫ్ట్​వేర్ దుర్వినియోగం నిజమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.