ETV Bharat / bharat

'చైనా, పాక్​ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

author img

By

Published : Mar 4, 2021, 6:29 PM IST

భారత్​.. భద్రతా పరంగా అనేక సవాళ్లను ఎదుర్కుంటోందని త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ ప్రస్తుతం ఇలాంటి కఠిన పరిస్థితులు లేవన్నారు. సమాజ పరిస్థితులకు అనుగుణంగా రక్షణ వ్యవస్థలోనూ సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

CDS Bipin Rawat
'చైనా, పాక్​లను ఎదురించేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలి'

ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటుందని త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం సహా.. చైనా, పాక్​ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్మెం​ట్‌(సీడీఎం) ఏర్పాటు చేసిన వెబినార్‌లో.. 'భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు-అత్యవసర చర్యలు' అనే అంశంపై ఈ విధంగా వ్యాఖ్యానించారు రావత్​.

మారిన యుద్ధ స్వభావానికి అనుగుణంగా..

భారత సైన్యం‌ ప్రస్తుతం తీవ్ర భద్రతా, సవాళ్లతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటోందని సీడీఎస్​ రావత్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా వ్యూహాలు, రక్షణశాఖ వ్యూహాత్మక మార్గదర్శకాలు, రక్షణశాఖలో నిర్మాణాత్మక సంస్కరణలను మరోసారి నిర్వచించుకోవాలని స్పష్టం చేశారు. 20వ శతాబ్దంలో సమాచార విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో యుద్ధ స్వభావం పూర్తిగా మారిపోయిందని త్రిదళాధిపతి అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా కొత్త సాధనాలు, వ్యూహాలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఇలాంటి సమయంలో దేశ అవసరాలకు అనుగుణంగా రక్షణ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని రావత్‌ గుర్తుచేశారు.

చైనా, పాక్‌లతో ముప్పే..

'భవిష్యత్తులో.. భారత్‌ చుట్టుపక్కల, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఉత్పన్నమయ్యే సైనిక బెదిరింపులు, ముప్పులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి.' అని సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టంచేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేనివిధంగా భారత సైన్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని సీడీఎస్‌ ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.