ETV Bharat / bharat

విదురాశ్వత విషాద ఘటన.. స్వాతంత్య్రోద్యమానికి కొత్త దిశ

author img

By

Published : Aug 15, 2021, 6:06 AM IST

వీరోచిత పోరాటాలు. విప్లవోద్యమాలు. చెరసాలల విడిదలు. ఉరికొయ్యల ఉయ్యాలలు. ఆత్మబలిదానాలు. అనన్య త్యాగాలు. స్వాతంత్య్రోద్యమ దిశనే మార్చిన విషాద ఘట్టాలు. కాంగ్రెస్ ఆరంభించిన పతాక సత్యాగ్రహం నరమేధానికి దారితీసింది. కర్ణాటకలో తెల్లదొరల తూటాలకు 32 మంది అమరులయ్యారు. ఆ విషాద ఘటనే దక్షిణ భారత జలియన్ వాలాబాగ్​గా ప్రసిద్ధిచెందింది. ఎవరెవరు శత్రువులు? ఎవరిమీద పోరాడాలి? అనే అంశాలపై కాంగ్రెస్​కు విదురాశ్వత విషాద ఘటన మార్గం చూపింది.

Independence Day Special
విదురాశ్వత విషాద ఘటన

విదురాశ్వత విషాద ఘటన.. కర్ణాటక జలియన్​ వాలాబాగ్​

1938 సంవత్సరం

ఏప్రిల్‌ 25

కర్ణాటకలోని గౌరిబిదనూరుకు కూతవేటు దూరంలో.. నేటి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు గ్రామం విదురాశ్వత. పినాకినీ నదీతీరాన ప్రశాంతంగా ఉండే పల్లె అది. ఆరోజు అక్కడ కాంగ్రెస్ 'పతాక సత్యాగ్రహం'లో భాగంగా త్రివర్ణపతాకావిష్కరణ. జనం ఒక్కరొక్కరే అక్కడకు చేరుతున్నారు. ఇంతలో.. హఠాత్తుగా కలకలం రేగింది. చుట్టుముట్టిన బ్రిటిష్ సైనికులు ప్రవేశద్వారం మూసివేసి తూటాల వర్షం కురిపించారు. తుపాకుల మోతతో పతాకావిష్కరణ ప్రదేశం దద్దరిల్లింది. జరిపిన కాల్పులలో 32 మంది అమాయకులు అమరులయ్యారు. ఆర్తనాదాలు.. హాహాకారాలు. జనం నేలకొరుగుతున్నారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు.

ఇది యావత్ దేశాన్ని దిగ్భాంతికి గురిచేసిందిన నరమేధం. మాటలకందని విషాదం. ఈ ఘటన 'కర్ణాటక జలియన్ వాలాబాగ్'​గా చరిత్రపుటల్లో నిలిచిపోయింది.

Vidurashwatha firing
విదురాశ్వత కాల్పుల ఘటనకు చిహ్నం

ఆరోజుల్లో కాంగ్రెస్ ఎక్కడ సభ నిర్వహిస్తే అక్కడ.. మువ్వన్నెల పతాకావిష్కరణతో కార్యక్రమం ఆరంభమయ్యేది. స్వాతంత్ర్య కాంక్షకు నిదర్శనంగా , ప్రజా సమీకరణకు కాంగ్రెస్ త్రివర్ణ పతాక సత్యాగ్రహాన్ని అస్త్రంలా ఉపయోగించుకుంది. మరోవైపు మైసూరు సంస్థానమంతా కాంగ్రెస్ చేపట్టిన పతాక సత్యాగ్రహం విజయవంతమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ చేపట్టిన పతాక సత్యాగ్రహం స్వాతంత్యోద్యమానికి కొత్త దిశను నిర్దేశించిందని చరిత్రకారుడు ప్రొ. గంగాధర్ విశ్లేషిస్తున్నారు.

''మొట్టమొదటి సారి పాత మైసూరు ప్రాంతంలోని శివపురలో పతాక సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిటిషు ప్రభుత్వం నిషేధం విధించినా.. పాతమైసూరు ప్రాంత నాయకులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ విజయవంతమైంది. ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి కొత్త దశను, దిశను నిర్దేశించిందనటంలో ఏమాత్రం సందేహం లేదు.''

-ప్రొ. గంగాధర్, చరిత్రకారుడు

అయితే జలియన్‌ వాలాబాగ్​లో ఘటన జరిగి అప్పటికి 19 ఏళ్లు గడిచాయి. కర్ణాటకలో విదురాశ్వత ఉద్యానంలో కూడా ప్రవేశద్వారం ఒక ఇరుకుదారి. ఆ దారిని దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో కాల్పులతో విషాదం చోటుచేసుకుంది. అందువల్లనే విదురాశ్వత కాల్పుల ఘటనకు జలియన్ వాలాబాగ్‌ ఘటనతో సారూప్యం ఉందంటున్నారు ప్రొఫెసర్ గంగాధర్.

''పోలీసులు హాలు కిటికీల నుంచి కాల్పులు జరిపారు. దాంతో అక్కడ ఉన్న అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకే జలియన్ వాలాబాగ్ ఘటనకు విదురాశ్వత సంఘటనకు సారూప్యం ఉందని చెప్పవచ్చు. లోపల ఉన్న వారు బయటికి వచ్చే అవకాశం లేకుండాపోయింది.''

- బైట్. ప్రొ. గంగాధర్, చరిత్రకారుడు

విదురాశ్వత పోలీసు కాల్పులను ఆనాటి బీబీసీ లండన్ ప్రసారం చేసింది. ఆరోజు మహాత్మాగాంధీ ముంబయిలో ఉన్నారు. సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపలానీలను అక్కడికి పంపించారు. విదురాశ్వత పార్కులో ముందుగా బ్రిటిష్ పతాకం, తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు అంగీకారం కూడా కుదిరింది. దీన్ని మీర్జా- పటేల్ ఒప్పందం అంటారు. భారతీయులు స్వాతంత్ర్య ఆకాంక్షకు నిదర్శనంగా కాంగ్రెస్ ఈ ఉద్యమం చేపట్టింది.

''ఇది కేవలం బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటమే కాదు. దేశమంతా బ్రిటిషర్లకు తాబేదార్లుగా ఉన్న సంస్థానాధీశులకూ ఓ హెచ్చరిక.. అన్న సందేశాన్ని కాంగ్రెస్ పంపగలిగింది. ఇందులో భాగమే మైసూరు ప్రాంతంలో త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం.''

- బైట్. ప్రొ. గంగాధర్, చరిత్రకారుడు

స్వాతంత్ర్యోద్యమంలో ఒక అస్పష్ట గమనంతో, ఎవరెవరు శత్రువులో తేల్చుకోలేని కాంగ్రెస్​కు విదురాశ్వత ఒక దారిచూపింది. దిశానిర్దేశం చేసింది. కాంగ్రెస్ వ్యూహాన్నే మార్చింది. సంస్థానాలపై సానుభూతి ప్రదర్శించిన గాంధీజీ వైఖరి మారింది. బ్రిటిషర్లతో పాటు వారి తాబేదార్లయిన సంస్థానాదీశులూ శత్రువులేనని విశ్వసించారు. ఫలితం.. ఆ ఫలితమే దేశమంతా పర్యటించాలన్న గాంధీజీ నిర్ణయం.

ఇదీ చదవండి: గాంధీ 150: మహాత్ముడి గమ్యం, గమనం

ఆదర్శం.. అనుసరణీయం.. ప్రశంసనీయం.. గాంధీ మార్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.