ETV Bharat / bharat

Narayan Rane news: 'రాణె తల తెస్తే రూ.51 లక్షలు నజరానా'

author img

By

Published : Aug 26, 2021, 4:54 PM IST

narayan rane news
నారాయణ్​ రాణె

కేంద్ర మంత్రి నారాయణ్​ రాణెకు(narayan rane news) హత్యకు సుపారీగా రూ.51 లక్షలు ఇస్తానని బహిరంగ ప్రకటన చేశారు విశ్వహిందూ సేన జాతీయ అధ్యక్షుడు అరుణ్​ పాఠక్​. మహారాష్ట్ర మఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాణె తలను ఎవరు నరికినా.. వారికి ఆ మొత్తాన్ని ఇస్తానని చెప్తున్నారు. ప్రస్తుతం పాఠక్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

కేంద్రమంత్రి నారాయణ్​ రాణెపై(narayan rane news) విశ్వహిందూ సేన జాతీయ అధ్యక్షుడు అరుణ్​ పాఠక్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి తల తెస్తే రూ. 51 లక్షలు రివార్డ్​గా ఇస్తానని ప్రకటించారు. యూపీ బెనారస్​లోని భేల్​పుర్​ ప్రాంతానికి చెందిన పాఠక్​ ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్​బుక్​, ట్విట్టర్​లో రాణెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.

"రోడ్డు పక్కన పర్స్​లు కొట్టుకుని, టికెట్లు అమ్ముకుని బతికే నారాయణ్​ రాణెకు శివసేన, బాలాసాహెబ్​ రాజకీయ భిక్ష పెట్టారు. ప్రస్తుతం ఆయన అవి మర్చిపోయి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. బాలాసాహెబ్​ కుమారుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేపైనే విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారికి శిరచ్ఛేదనం చేయాలి. ఈ పని ఎవరు చేసిన వారికి రూ. 51 లక్షలు ఇస్తాను."

- అరుణ్​ పాఠక్​, విశ్వ హిందూసేన జాతీయ అధ్యక్షుడు

నారాయణ్​ రాణె చనిపోయిన తరువాత ఆయన అస్తికలను కాశీలో కలిపేందుకు తాను ఏమాత్రం అంగీకరించనని పాఠక్​ ట్వీట్​ చేశారు. దీంతో రాణె ఆత్మ ఏళ్ల తరబడి ఇక్కడే తిరుగుతూ ఉంటుందని అన్నారు.

మంత్రి వ్యాఖ్యలతో...

దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని కేంద్రమంత్రి రాణె ఇటీవల వ్యాఖ్యానించారు. రాణె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు రాణెపై నాసిక్‌సహా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భాజపా చేపట్టిన జన్​ ఆశిర్వాద్​ కార్యక్రమం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న రాణెను రత్నగిరి ప్రాంతంలో పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం రాణేకు రాయ్‌గఢ్‌లోని మహద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ల​ను కొట్టేయాలని కోరుతూ బాంబే హైకోర్టును కేంద్ర మంత్రి రాణె ఆశ్రయించారు. ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణను సెప్టెంబర్​ 17కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: Narayan Rane news: 'ఇకపై మంచి పదాలతో విమర్శిస్తా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.