ETV Bharat / bharat

15 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​.. నిందితుల్లో ఆ ఎమ్మెల్యే కుమారుడు!

author img

By

Published : Mar 26, 2022, 7:16 PM IST

Updated : Mar 26, 2022, 10:07 PM IST

Gang Rape Case in Dausa: పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.15లక్షల నగదు, బంగారు ఆభరణాలను కాజేశారు. నెల రోజుల కిందట రాజస్థాన్​లోని దౌసా జిల్లాలో జరిగిన ఈ సంఘటన దొంగతనం కేసుతో బయటపడింది. నిందితుల్లో పక్క నియోజకవర్గం కాంగ్రెస్​ ఎమ్మెల్యే కుమారుడు సైతం ఉండటం గమనార్హం.

Gang Rape Case
15 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్

Gang Rape Case in Dausa: దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్​లోని దౌసా జిల్లాలో ఓ పదో తరగతి విద్యార్థినిపై (15) ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దుశ్చర్యను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు సైతం ఉండటం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితుడు దీపక్​ మీనా.. అల్వార్​ జిల్లాలోని రాజ్​గఢ్​ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జోహరి లాల్​ మీణా కుమారుడిగా గుర్తించారు పోలీసులు. అత్యాచారంపై దౌసా జిల్లాలోని మండవార్​ పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ నాథు లాల్​ వివరాలు వెల్లడించారు.

"నిందితుల్లో ఒకడైన వివేక్​ శర్మ.. గ్యాంగ్​ రేప్​కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి బాధితురాలి నుంచి రూ.15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుల్లో రాజ్​గఢ్​ ఎమ్మెల్యే కుమారుడు దీపక్​ మీనా సహా మరో ఇద్దరిపై అత్యాచారం కేసు, మిగిలిన ఇద్దరిపై అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం."

- నాథు లాల్​, మండవార్​ స్టేషన్​ ఇంఛార్జ్​

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు నాథు లాల్​. ఈ సంఘటన గత నెల 24న జరిగిందని.. బాలికను మహ్వా- మండవార్​ రోడ్డులోని ఓ హోటల్​కు తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. ఆ దుశ్చర్యను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఇంట్లోంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయిన క్రమంలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం వల్ల ఈ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. తొలుత దొంగతనం కేసు నమోదు చేశారని, దర్యాప్తులో వివేక్​ శర్మ ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలోనే తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు తల్లికి తెలపటం వల్ల గ్యాంగ్​ రేప్​ విషయం తెలిసిందన్నారు.

స్టేషన్​ ఎదుట ధర్నా: నిందితులను వెంటనే అరెస్ట్​ చేయాలని కోరుతూ మండవార్​ పోలీస్​ స్టేషన్​ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు బాధితురాలి కుటుంబ సభ్యులు. వారికి వంద మందికిపైగా మద్దతు పలికారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కుమారుడితో పాటు ఈ కేసులో ఉన్నవారందరినీ అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. అరెస్ట్​ చేసే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదంటూ మొండికేశారు. అయితే, పోలీసులు హామీ ఇవ్వటంతో గొడవ సద్దుమణిగింది.

Gang Rape Case in Dausa
స్టేషన్​ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజలు

తప్పుడు ఆరోపణలు: తన కుమారుడిపై వచ్చిన అత్యాచారం ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్​ ఎమ్మెల్యే జోహరి లాల్​ మీణా. 'నా కుమారుడిపై నమోదైన అత్యాచారం కేసు తప్పుడు, నిరాధారమైనది. రాజకీయపరంగా నా పరపతిని గిట్టనివారు చేస్తున్న కుట్ర. అలాంటి వారు గతంలో నాపైనా కేసు పెట్టారు. తర్వాత అది తప్పుడు కేసుగా నిర్ధరణ అయింది. ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారు.' అని పేర్కొన్నారు.

రంగంలోకి జాతీయ మహిళా కమిషన్​: పదో తరగతి బాలికపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది జాతీయ మహిళా కమిషన్​. నిందితులను వీలైనంత తొందరగా అరెస్ట్​ చేయాలని పోలీసులకు సూచించారు ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ. బాధితురాలికి భద్రత కల్పించి.. కౌన్సిలింగ్​ ఇవ్వాలని స్పష్టం చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: రాజస్థాన్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే కొడుకు సహా మరో నలుగురిపై అత్యాచారం కేసు నమోదైన క్రమంలో స్పందించింది కాంగ్రెస్​. పదవులకు అతీతంగా నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే భాజపాపై ఆరోపణలు గుప్పించింది. అమాయకులైన రైతులను వాహనంతో తొక్కించి చంపిటం, అత్యాచారం కేసులో నిందితులను భాజపా కాపాడుకుంటుందని, తాము అలా కాదని పేర్కొన్నారు కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ఎవరైనా సరే విచారణ తర్వాత నేరస్థులుగా తేలితే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Last Updated : Mar 26, 2022, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.