'ఈ నెలలోనే థర్డ్​ వేవ్​.. జనవరి-ఏప్రిల్‌ మధ్య తీవ్రస్థాయికి!'

author img

By

Published : Oct 5, 2021, 7:18 AM IST

Updated : Oct 5, 2021, 11:13 AM IST

కరోనా

భారత్​లో కొవిడ్ ముప్పు తొలగిపోలేదని.. మూడో ముప్పు ప్రభావం 103 శాతం వరకు ఉండొచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పండగ సీజన్​లలో ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగితే కష్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశంలో కరోనా మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల నమోదై.. వచ్చే జనవరి-ఏప్రిల్‌ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు సందీప్‌ మండల్‌, నిమలన్‌ అరినమిన్‌పతి, బలరాం భార్గవ, శమిరణ్‌ పాండాలు రాసిన అధ్యయన పత్రం.. 'జర్నల్‌ ఆఫ్‌ ట్రావెల్‌ మెడిసిన్‌'లో ప్రచురితమైంది. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కారణాలతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం వంటివి మూడో ఉద్ధృతికి దారితీయొచ్చని అందులో పేర్కొన్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, బంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు అధికమవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

అధ్యయన పత్రంలో ఇంకా ఏం చెప్పారంటే..

  • రాష్ట్రాల స్థాయుల్లో ఆంక్షలను సరళతరం చేస్తే.. మూడో ఉద్ధృతి ముప్పు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
  • భారత్‌లో జన సాంద్రత ఎక్కువ. కాబట్టి మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103% వరకూ ఉండొచ్చు.
  • కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుంది. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
  • మనుషులు పరస్పరం దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే.. కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలుంటాయి. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంది.
  • వాస్తవానికి సమాజ జీవనం క్రమంగా సాధారణ స్థితికి రావడం వల్ల మేలే జరుగుతుంది. దేశీయ పర్యాటకం పెరిగితే.. సందర్శకులకే కాకుండా, స్థానిక వ్యాపారులకూ లబ్ధి చేకూరుతుంది. కానీ- పర్యాటకులు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుంది.

'పండగల సీజన్‌లో జాగ్రత్త..'

దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 5, 2021, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.