ETV Bharat / bharat

తల్లి పక్కన పడుకున్న 8 నెలల బాలుడిపై అడవి పిల్లి దాడి.. అక్కడికక్కడే మృతి

author img

By

Published : Dec 10, 2022, 4:44 PM IST

wild cat attack in Pratapgarh
అడవి పిల్లి దాడి

8 నెలల బాలుడిపై అడవి పిల్లి దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాదం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, ఐఐటీ గువహటి.. ప్రొఫెసర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రొఫెసర్​ది ఆత్మహత్యా? లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి పక్కనే నిద్రిస్తున్న ఎనిమిది నెలల బాలుడిపై అడవి పిల్లి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మరణించగా.. ఆమె తల్లి గాయపడింది. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​.. ప్రతాప్​గఢ్​లో గురువారం జరిగింది.
ఇదీ జరిగింది..
మహులికు చెందిన అజయ్​ గౌర్​కు ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నాడు. అజయ్.. రాజస్థాన్​కు కూలీ పనుల నిమిత్తం వలస వెళ్లాడు. అతడి భార్య ఉమ.. గురువారం అర్ధరాత్రి తన 8 నెలల కుమారుడు రాజ్​తో కలిసి నిద్రిస్తోంది. హఠాత్తుగా ఓ అడవి పిల్లి కిటికీలోంచి వారి గదిలోకి ప్రవేశించింది. విచక్షణారహితంగా రాజ్​ శరీరంపై గోళ్లుతో దాడి చేసింది. ఉమను కూడా గాయపరిచి.. అక్కడి నుంచి అడవి పిల్లి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గదికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో రాజ్ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మరణించాడు.

ప్రొఫెసర్​ ఆత్మహత్య..
అసోం.. గువహటిలో దారుణం జరిగింది. ఐఐటీ గువహటికి చెందిన మ్యాథ​మెటిక్స్ ప్రొఫెసర్.. క్యాంపస్​లోని క్వార్టర్స్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని సమీర్ కలాంగా గుర్తించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బస్సులో నుంచి తప్పించుకునేందుకు..
సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలను పోలీసు బస్సులో తరలిస్తుండగా ఒక ఖైదీ తప్పించుకోగా.. మరో ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన పంజాబ్​లోని లుధియానాలో జరిగింది. పరారీలో ఖైదీ ఉన్న దీపక్ కుమార్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 37 మంది ఖైదీలు బస్సులో ఉన్నారని పోలీసులు తెలిపారు.

మహిళా సెక్యూరిటీపై దాడి..
హరియాణా గురుగ్రామ్​లో దారుణం జరిగింది. సొసైటీలో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డుపై 60 ఏళ్ల వృద్ధురాలు కర్రతో దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు వాటర్​ హీటర్‌ను ఉపయోగించడాన్ని నిందితురాలు నిరాకరించింది. బాధితురాలిని సోనీ దేవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.