ETV Bharat / bharat

ఆ ఆసుపత్రిలో మరో 72 మంది వైద్యులకు కరోనా

author img

By

Published : Jan 4, 2022, 12:50 PM IST

Doctors test corona positive: బిహార్​లోని నలంద వైద్య కళాశాల, ఆసుపత్రిలో మరో 72 మంది వైద్యులకు కరోనా సోకింది. నాలుగు రోజుల్లోనే మొత్తం 159 మంది వైద్యులు వైరస్​ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. పంజాబ్​, పాటియాలాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 102 మంది విద్యార్థులకు వైరస్​ సోకింది.

doctors turn Covid positive
వైద్యులకు కరోనా

Doctors test corona positive: బిహార్​లో కొవిడ్​-19 బారినపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నలంద వైద్య కళాశాల, ఆసుపత్రి(ఎన్​ఎంసీహెచ్​)లో తాజాగా మరో 72 మంది వైద్యులకు వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు మెడికల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ వినోద్​ కుమార్​ సింగ్​ తెలిపారు. జనవరి 1, 2 తేదీల మధ్య 87 మంది వైద్యులు వైరస్​బారిన పడగా.. తాజా కేసులతో ఆసుపత్రిలో నాలుగు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 159కి చేరిందన్నారు.

డిసెంబర్​ 27, 28 తేదీల్లో పట్నాలో జరిగిన భారతీయ వైద్యుల సంఘం 96వ జాతీయ వార్షిక సదస్సులో పాల్గొన్న వైద్యులకు కరోనా నిర్ధరణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సదస్సుకు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఎన్​ఎంసీహెచ్​ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్​ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు చేపట్టింది. కరోనా రెండో దశ సమయంలో.. వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్​లోనే అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలపటం గమనార్హం.

102 మంది వైద్య విద్యార్థులకు కరోనా

Medical students corona: పంజాబ్​, పాటియాలాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 102 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అధికారులతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితులను సమీక్షించారు ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు రాష్ట్ర మంత్రి డాక్టర్​ రాజ్​కుమార్​ వెర్కా. కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్​ నుంచి మెడికల్​ క్యాంప్​కు తరలించినట్లు చెప్పారు.

" పాటియాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 102 కొవిడ్​-19 కేసులు వచ్చాయి. ఒమిక్రాన్​ వేరియంట్​గా భావిస్తున్నాం. వారి నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించాం. అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని పాటియాలా పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. "

- పాటియాలా డీసీ సందీప్​ హాన్స్​

ఇదీ చూడండి: వైద్యులపై కరోనా పడగ.. 193 మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.