ETV Bharat / bharat

గన్​తో కాల్చుకుని పోలీసులకు కట్టుకథ.. చివరకు?

author img

By

Published : Oct 17, 2021, 10:59 PM IST

చేతిలో పిస్తోలు ఉంది. మద్యం మత్తులో ఉన్నాడు. పొరపాటున తనను తానే ఆ తుపాకీతో కాల్చుకున్నాడు. సాక్ష్యాలను తారుమారు చేశాడు. పోలీసులకు ఓ మాంచి కథ చెప్పాడు. చివరకు ఏమైందంటే..?

Man accidently shoots self
కాల్చుకుని కట్టుకథ

పొరపాటున తనను తానే తుపాకీతో కాల్చుకున్న ఓ యవకుడు.. పోలీసులను తప్పుదోవ పట్టించాడు. వారికి ఓ కట్టుకథ చెప్పి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. చివరకు కటకటాల పాలయ్యాడు.

అసలేం జరిగిందంటే..?

దిల్లీలోని కాపాస్​హెరా ప్రాంతంలోని ఓ గెస్ట్​హౌస్ గదిలో శివమ్(18), ఓ మైనర్ సహా తన ముగ్గురు స్నేహితులతో కలిసి శుక్రవారం రాత్రి పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలో వారంతా మద్యం సేవించారు. మైనర్​ వద్ద.. లఖ్​నవూ నుంచి అక్రమంగా తెప్పించుకున్న ఓ తుపాకీ ఉంది. శివమ్ ఆ తుపాకీని తీసి, పొరపాటున తనను తానే కాల్చుకున్నాడు. దాంతో అతని మోకాలిపై గాయమైంది. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

గది శుభ్రం చేసి..

"ఘటన జరిగిన వెంటనే శివమ్​ స్నేహితులు.. లఖ్​నవూలోని తమ సొంతూళ్లకు పరారయ్యారు. అతిథిగృహ సిబ్బంది సాయంతో రక్తం మరకలు ఉన్న గదిని శివమ్​ శుభ్రం చేశాడు. మరో స్నేహితుని సాయంతో సఫ్దార్​జంగ్​లోని ఓ ఆస్పత్రిలో చేరాడు" అని పోలీసులు తెలిపారు. ఘటన గురించి శివమ్​ను తాము ప్రశ్నించగా తప్పుదోవ పట్టించేలా సమాధానమిచ్చాడని చెప్పారు.

"ముందు తాను రోడ్డు ప్రమాదానికి గురయ్యానని శివమ్​ చెప్పాడు. కానీ, ఆ తర్వాత ఓ కట్టుకథ అల్లాడు. ఇంటికి తిరుగువెళ్తున్న సమయంలో.. బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు కాపాస్​హెరా ప్రాంతంలో తనను తుపాకీలతో బెదిరించి, డబ్బులు దోచుకునేందుకు యత్నించారని చెప్పాడు. వారిని అడ్డుకోగా... తనను కాల్చి, అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పాడు. అయితే.. ఘటనాస్థలంలోని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఈ విషయం గురించి ఆరా తీయగా.. అలాంటిది ఏదీ జరగలేదని చెప్పారు."

-పోలీసులు

"అన్ని పరిశీలించిన తర్వాత... శివమ్ అబద్ధమాడుతున్నట్లు తేలింది. వైద్య పరీక్షల్లో తనంతట తానుగానే కాల్చుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వైద్యులు తెలిపారు. మరోవైపు.. గెస్ట్​హౌస్​ సిబ్బందిని ప్రశ్నించగా... వారు కాల్పుల ఘటన గురించి అంగీకరించారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో శివమ్​కు సాయం చేసినట్లు ఒప్పుకున్నారు" అని పోలీసులు చెప్పారు.

సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు దిల్లీ నైరుతి డిప్యూటీ పోలీస్ కమిషనర్​ గౌరవ్ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను లఖ్​నవూలో అరెస్టు చేయగా.. మైనర్​ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురు నిందితులు తమ పాఠశాల విద్యను మధ్యలోనే మానేసినట్లు పేర్కొన్నారు.

కాల్పుల ఘటనపై సమాచారం ఇవ్వనందుకు, లైసెన్సు లేకుండా అక్రమంగా గెస్ట్​హౌస్​ను నడిపిస్తున్నందుకు అతిథిగృహ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించినందున వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.