ETV Bharat / bharat

లాయర్ లేకుండానే 15 ఏళ్లు న్యాయపోరాటం.. నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు

author img

By

Published : Jan 9, 2023, 6:39 PM IST

delhi high court
దిల్లీ హైకోర్ట్

ట్రయల్ కోర్టు 15ఏళ్ల పాటు విచారించిన ఓ కేసులో నిందితుడికి న్యాయ సహాయం అందలేదనే కారణంతో దిల్లీ హైకోర్టు ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. పేదవారికి న్యాయ సహాయం అందించడం కోర్టుల తప్పని సరి విధని హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు తమ విధులను మరచింది. అందుకే నిందితుడిపై కొన్ని అభియోగాలున్నా సరే.. దాన్ని కోర్టు తప్పిందంగా భావిస్తూ నిందితుడిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్ట్​.

దోపిడీ కేసులో న్యాయవాది లేకుండానే 15 ఏళ్లపాటు విచారణ ఎదుర్కొని, ట్రయల్ కోర్టులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని.. దిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పునిచ్చింది. నిష్పాక్షిక విచారణ.. ప్రాథమిక హక్కు అని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

"నిందితుడు సునీల్ 15 సంవత్సరాల నుంచి కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ విచారణలో సునీల్ తరపున న్యాయస్థానంలో వాదించడానికి న్యాయవాది లేరు. దీంతో కొన్ని సార్లు సునీల్​ వాదనలను వినకుండానే కోర్టు తన విచారణను పూర్తి చేసింది. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో విచారణకు రాగా.. నిందితుడి తరఫున ట్రయల్​ కోర్టులో వాదించడానికి న్యాయవాది లేరని తేలింది. అంటే.. ట్రయల్ కోర్టులో వాదనలు ఏకపక్షంగా మారాయి. ట్రయల్​ కోర్టు విచారణలో చాలా లోపాలు ఉన్నాయి. ఈ సుదీర్ఘ విచారణలో న్యాయవాది సహకారం నిందితుడికి లభించలేదు. అందుకే ఆ కేసును మళ్లీ ట్రయల్​ కోర్టుకు విచారించడానికి అనుమతి లేదు. నిందితుడిపై కొన్ని అభియోగాలు ఉన్నా సరే.. అతడ్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నాం" అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు.

"తనను తాను రక్షించుకోలేని వ్యక్తికి సమర్థమైన న్యాయ సహాయం అందించడం ట్రయల్ కోర్టు విధి. ఈ విషయాన్ని కోర్టు గుర్తించాలి. న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛకు సంరక్షకులుగా పనిచేస్తూ.. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాయి. న్యాయస్థానాలు నిందితుడికి న్యాయమైన విచారణను అందించడంలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. ఇది భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. అందుకే ప్రభుత్వం లీగల్ ఎయిడ్ సెంటర్లు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీల ఏర్పాటు చేసి.. వాటికి పెద్ద మొత్తంలో డబ్బు పంపిణీ చేస్తోంది. మానవ హక్కులు అమలు చేయడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. పేదలకు న్యాయాన్ని అందించడంలో 'పెద్ద సవాలు'ను ఎదుర్కోవలసి ఉంటుంది. క్రిమినల్​ కేసు విచారణల్లో ఇరువైపులా న్యాయవాది ఉండి తీరాల్సిందే".
-- జస్టిస్ స్వర్ణకాంత శర్మ

అసలేంటా కేసు..?
2007లో సునీల్​తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సునీల్​ నుంచి 5 నల్లటి మాస్క్‌లు, ఓ దేశీయ రివాల్వర్, మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దిల్లీ ట్రయల్ కోర్టు 2009లో విచారించింది. సునీల్​ను దోషిగా తేల్చింది. అయితే 2008లో నిందితుడు తన తరపున కోర్టులో వాధించడానికి న్యాయవాది కావాలని ట్రయల్​ కోర్టును కోరగా.. ప్రభుత్వ ఖర్చులతో ఓ అమికస్ క్యూరీని నియమించింది. కానీ ఆ న్యాయవాది ఆ ఒక్క విచారణకు తప్ప.. ఆ తర్వాత జరిగిన ఏ విచారణకు హాజరుకాలేదు. దీంతో నిందితుడు తన తరపున కోర్టులో వాదించడానికి న్యాయవాది లేకుండానే విచారణకు హాజరయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.