ETV Bharat / bharat

నాలుగేళ్ల కుమారుడిని చంపిన లేడీ CEO- సూట్​కేస్​లో మృతదేహంతో ట్యాక్సీలో పరారీ- చివరకు అరెస్ట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 1:12 PM IST

Updated : Jan 9, 2024, 7:15 PM IST

ceo killed son in goa
ceo killed son in goa

CEO Killed Son in Goa : నాలుగేళ్ల కుమారుడి అనుమానాస్పద మృతి కేసులో ఓ సంస్థ సీఈఓను అరెస్ట్ చేశారు పోలీసులు. చిన్నారి మృతదేహాన్ని ఓ బ్యాగులో పెట్టి గోవా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా పట్టుకున్నారు. నిందితురాలు తప్పించుకునేందుకు ప్రణాళిక రచించగా, పోలీసులు సినీ ఫక్కీలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్నారిని చంపిన తర్వాత నిందితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

CEO Killed Son in Goa : నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసింది ఓ స్టార్టప్​ కంపెనీ సీఈఓ. ఈ ఘటన గోవాలోని ఓ హోటల్​లో జరిగింది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ఓ బ్యాగులో పెట్టి బెంగళూరుకు బయలుదేరింది. రంగంలోకి దిగిన పోలీసులు సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్నారు. సుచన భర్త వెంకటరమణ జకార్తాలో ఉంటాడనీ, వీరిద్దరి మధ్య విడాకుల కేసు కూడా నడుస్తుండడం వల్లే కుమారుడిని హత్య చేసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చిన్నారిని చంపేందుకు గల సరైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.

నిందితురాలిని గోవా పోలీసులు మంగళవారం మపుసా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో నిందితురాలికి ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించింది కోర్టు. నిందితురాలు నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన తర్వాత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో చేతి మణికట్టుపై కోసుకున్నట్లు చెప్పారు. నిందితురాలు తన భర్తకు దూరంగా ఉంటుందని పేర్కొన్నారు.

"బంగాల్​కు చెందిన మహిళ బెంగళూరుకు వచ్చి మైండ్​ఫుల్ ఏఐ ల్యాబ్​ అనే సంస్థను స్థాపించింది. ఆమె భర్త కేరళకు చెందిన వారు కాగా, నిందితురాలికి దూరంగా ప్రస్తుతం ఇండోనేషియాలోని జకర్తాలో ఉంటున్నారు. మృతికి గల కారణం పోస్ట్ మార్టమ్ పరీక్షల ఫలితాల తర్వాతే తెలుస్తుంది. నిందితురాలిపై గోవా చిల్డ్రన్​ యాక్ట్​తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టాం. గోవా పోలీసుల బృందం ప్రస్తుతం చిత్రదుర్గకు వెళ్లింది. ఆమెను అరెస్ట్ చేసి గోవాకు తీసుకువచ్చి విచారిస్తాం."

--నిథిన్​ వల్సాన్​, ఎస్​పీ

ఇదీ జరిగింది
బెంగళూరుకు చెందిన సుచనా సేఠ్ అనే మహిళ ఓ స్టార్టప్​ కంపెనీ సీఈఓగా పనిచేస్తోంది. ఆమె శనివారం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి గోవాలోని ఓ హోటల్​లో దిగింది. రెండు రోజుల పాటు హోటల్​లో గడిపిన ఆమె సోమవారం ఉదయం బెంగళూరుకు వెళ్లేందుకు ట్యాక్సీ కావాలంటూ యాజమాన్యాన్ని సంప్రదించింది. అయితే, ట్యాక్సీలో వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని, విమానంలో బెంగళూరుకు వెళ్లాలని హోటల్​ సిబ్బంది సూచించారు. కానీ వారి మాటలను పట్టించుకోకుండా తనకు ట్యాక్సీ కావాలని చెప్పింది. దీంతో హోటల్​ సిబ్బంది ట్యాక్సీని ఏర్పాటు చేసి ఆమెను పంపించారు.

అనంతరం సుచనా సేఠ్​ గదిని శుభ్రం చేసేందుకు హోటల్ సిబ్బంది వెళ్లగా అందులో రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఈ క్రమంలోనే సుచనతో వచ్చిన నాలుగేళ్ల కుమారుడు కనిపించడంలేదని పోలీసులకు చెప్పారు సిబ్బంది. మరోవైపు మహిళ సైతం బరువు గల బ్యాగుతో వెళ్లడాన్ని గమనించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంటనే మహిళకు ఫోన్​ చేసి గదిలోని రక్తపు మరకలు, కుమారుడి గురించి ఆరా తీశారు. తనకు నెలసరి కావడం వల్ల రక్తం పడిందని, తన కుమారుడిని స్నేహితురాలి ఇంటికి పంపించానంటూ ఓ చిరునామాను చెప్పింది నిందితురాలు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా అది నకిలీ అని తేలింది.

తప్పించుకునేందుకు మహిళ ఆడుతున్న నాటకాన్ని గమనించిన పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. నేరుగా ట్యాక్సీ డ్రైవర్​కు ఫోన్​ చేసి జరిగిన విషయాన్ని స్థానిక కొంకణి భాషలో చెప్పారు. ఆమెను వెంటనే సమీపంలో పోలీస్ స్టేషన్​కు తీసుకు వెళ్లాలని సూచించారు. అప్పటికే ట్యాక్సీ గోవా సరిహద్దులు దాటి కర్ణాటకలోకి ప్రవేశించడం వల్ల సమీపంలోని చిత్రదుర్గ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లాడు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బ్యాగు తెరిచి చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది. చిత్రదుర్గకు చేరుకున్న గోవా పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని జకర్తాలో ఉంటున్న ఆమె భర్త వెంకట రమణకు తెలిపారు.

కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో.. అంబులెన్స్​కు డబ్బులు లేక..

Father Carried Son Dead Body On Bike : కవర్​లో కొడుకు మృతదేహం.. పోస్టుమార్టం కోసం 70కిమీ బైక్​పై తండ్రి ప్రయాణం

Last Updated :Jan 9, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.