ETV Bharat / bharat

'అందుకే ఆర్థిక నేరగాళ్లను భారత్​కు అప్పగించలేకపోతున్నాం'

author img

By

Published : Apr 23, 2022, 5:15 AM IST

Boris Johnson India tour: కొన్ని న్యాయపరమైన అంశాల వల్లే భారత్​కు చెందిన ఆర్థిక నేరగాళ్లు విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీని అప్పగించడం కుదరట్లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తామూ కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

Boris Johnson
బోరిస్‌ జాన్సన్‌

Boris Johnson India tour: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను రూ.వేల కోట్లు మోసగించి లండన్‌ పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ అప్పగింతపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ 'క్లిష్టతరం'గా మారిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌.. దిల్లీలో విలేకరులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ అప్పగింతపై విలేకరులు ప్రశ్నించగా.. పైవిధంగా సమాధానమిచ్చారు.

నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తామూ కోరుకుంటున్నామని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. భారత్‌ నుంచి ప్రతిభ గల వ్యక్తులు రావడానికి తామెప్పుడూ ఆహ్వానం పలుకుతామని చెప్పారు. అదే సమయంలో తమ న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని భారతీయ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించబోమన్నారు.

అంతకుముందు బోరిసన్‌ జాన్సన్‌ పర్యటన గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ ష్రింగ్లా విడుదల చేసిన ప్రకటనలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. లండన్‌ పారిపోయి తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్ల అంశం కూడా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చకు వచ్చిందని తెలిపారు. ఇది ప్రధానమైన విషయమని చెప్పడంతో దీనిపై సమీక్షిస్తానని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌ ఆందోళనపై తన వంతు ఏం చేయగలనో అది చేస్తానని బ్రిటన్‌ ప్రధాని భరోసా ఇచ్చినట్లుగా ష్రింగ్లా వివరించారు.

ఇదీ చదవండి: భారత్​-బ్రిటన్​ సరికొత్త స్నేహగీతం- 2022లోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.