ETV Bharat / bharat

బూస్టర్ డోసు ఇవ్వాలా, వద్దా? శాస్త్రవేత్తల మాటేంటి?

author img

By

Published : Dec 12, 2021, 7:15 PM IST

booster dose
బూస్టర్ డోసు

Booster Dose in India: కరోనా కొత్త వేరియంట్​లు పుట్టుకొస్తున్న వేళ.. బూస్టర్ డోసు పంపిణీపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. వెంటనే మూడో డోసు పంపిణీ చేయాలని కొందరు.. తీసుకోకపోయినా ఫర్వాలేదని మరికొందరు అంటున్నారు. 'బూస్టర్' వల్ల యాంటీబాడీలు పెరుగుతాయని, ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్​ నుంచి రక్షణ కల్పిస్తాయని అంటున్నారు ఇంకొందరు. ఈ నేపథ్యంలో మూడో డోసు పంపిణీపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

Booster Dose Covid Vaccine: రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్లను సమర్థంగా అడ్డుకునేందుకు బూస్టర్ డోస్ అందివ్వాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్​పై.. కొవిషీల్డ్ బూస్టర్ డోస్ ప్రభావవంతంగా పనిచేస్తుందంటూ యూకే ఆరోగ్య విభాగం ఓ ప్రకటననూ చేసింది. దీనిపై స్పందించిన పలువురు వైరాలజిస్టులు, అంటువ్యాధుల నిపుణులు, శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..

INSACOG Shahid Jameel: రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోసు తీసుకుంటే యాంటీబాడీలు పెరుగుతాయని ఇన్సాకాగ్‌ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తిని సైతం సమర్థంగా అడ్డుకుంటుందన్నారు.

"కరోనా టీకా బూస్టర్ డోసు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి 70-75 శాతం రక్షణను అందిస్తుంది. పోలియో, మీజిల్స్ వంటి వ్యాక్సిన్ల బూస్టర్ డోస్‌లు తప్ప.. ఇతర టీకాల మూడో డోసు రోగనిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది. తీవ్రమైన వ్యాధి లక్షణాల నుంచి రక్షించేందుకు సహాయ పడుతుంది."

--డాక్టర్ షాహిద్ జమీల్, వైరాలజిస్ట్

Covishield Booster Dose India: కొవిషీల్డ్ ఒక డోస్ మాత్రమే పొందిన వారు 12-16 వారాలకు బదులుగా 8-12 వారాల్లోనే రెండో డోసు పొందాలని జమీల్ సూచించారు. దేశంలోని అత్యధిక మంది జనాభాకు కొవిషీల్డ్‌ అందించిన నేపథ్యంలో భారత్ ముందున్న సవాళ్లేంటి? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.

"కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్ వైరస్‌ను ఏ మేరకు అడ్డుకుంటున్నాయో సెరో సర్వే నిర్వహించాలి. బూస్టర్‌ డోసులపై పాలసీని రూపొందించాలి. ఏ వ్యాక్సిన్‌లు అందించాలి? ఎవరికి, ఎప్పుడు ఇవ్వాలి? అనే అంశాలపై ఓ స్పష్టతకు రావాలి. 14ఏళ్లు దాటిన పిల్లలకు టీకాలు ఇవ్వడం ప్రారంభించాలి."

--డాక్టర్ షాహిద్ జమీల్, వైరాలజిస్ట్

Omicron Cases in India: భారత్​లో నాలుగు వ్యాక్సిన్‌లను బూస్టర్‌ డోసులుగా ఉపయోగించొచ్చని డాక్టర్ జమీల్ అభిప్రాయపడ్డారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్, జైకొవ్-డీ, కొవావాక్స్, కార్బీవ్యాక్స్ టీకా అందిస్తే మేలని అభిప్రాయపడ్డారు. వీటిలో కొవిషీల్డ్ తీసుకున్న వారికి కొవాగ్జిన్, కొవాగ్జిన్ తీసుకున్న వారికి కొవిషీల్డ్ అందించొచ్చని తెలిపారు.

Pfizer Omicron Booster: ఒమిక్రాన్ వేరియంట్​పై ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు దాదాపు 40 రెట్లు అధిక ప్రభావం చూపుతుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ టి జాకబ్ జాన్ తెలిపారు.

"భవిష్యత్​లో తలెత్తే ఒమిక్రాన్ వంటి మహమ్మారులపై జాగ్రత్తగా ఉండేందుకు.. వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్ డోసు అందించడం మంచిది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అందించడం మేలు."

--డాక్టర్ టి జాకబ్ జాన్

Public Health Foundation of India: 'ప్రతి ఒక్కరికీ బూస్టర్‌ డోసులు అందించే అవసరం రోజురోజుకూ పెరుగుతోంది' అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ ఆర్.బాబు తెలిపారు.

"బూస్టర్ డోస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలా? వద్దా? అనేది తేల్చేందుకు తగిన సమాచారం ముఖ్యం. వాటివల్ల ఆసుపత్రిలో చేరే రేటు తగ్గడం, మరణాల నుంచి రక్షణ ఏ మేరకు ఉన్నాయన్నది విశ్లేషించాలి."

--- డాక్టర్ గిరిధర్ ఆర్.బాబు

బూస్టర్ డోసు అనేది దేశానికి ప్రాధాన్యం కాదని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా అభిప్రాయపడ్డారు. 'ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. బూస్టర్‌ డోసుపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమాచారం సేకరించడం ముఖ్యం' అని తెలిపారు.

"తీవ్రమైన వ్యాధి లక్షణాలు, ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించడం అనేవి కొవిడ్-19 టీకాల ముఖ్య లక్ష్యం. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు ఈ విధంగా పనిచేస్తున్నాయని టీకా ప్రభావంపై చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌కూ ఇది వర్తిస్తుంది."

--లహరియా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.