ETV Bharat / international

బూస్టర్‌ డోసు వేసుకున్నా వదలని 'ఒమిక్రాన్‌'!

author img

By

Published : Dec 12, 2021, 12:40 AM IST

Omicron in vaccinated people: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ఆ దేశంలో కొత్తగా 43 మందికి ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. వారిలో 34మంది వ్యాక్సినేషన్ పూర్తయినవారే ఉన్నారు. అందులో 14 మందికి బూస్టర్‌ డోసు కూడా పూర్తయినా ఈ వేరియంట్​ బారిన పడటం గమనార్హం. మరోవైపు.. తైవాన్​లో తొలిసారి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది.

Omicron in vaccinated people
అమెరికాలో ఒమిక్రాన్ కేసులు, బూస్టర్ డోసు తీసుకున్నవారికి ఒమిక్రాన్

Omicron in vaccinated people: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌-19 సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక మంది ఈ మహమ్మారి కాటుకు బలైపోయారు. అయినా, కొవిడ్‌ మహమ్మారి అమెరికాను ఇంకా వెంటాడుతూనే ఉంది. గతంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈ మధ్యకాలంలో మళ్లీ రోజుకు సగటున లక్షకు పైగా కొవిడ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికితోడు దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు కూడా క్రమంగా పెరుగుతుండటం కలకలం రేపుతోంది.

America omicron cases: ఇప్పటివరకు అమెరికాలోని 22 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్‌ వ్యాపించినట్టు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో 43 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ సోకిన వారిలో 34మంది వ్యాక్సినేషన్‌ పూర్తయినవారే ఉన్నారు. వీరిలో 14 మందికి బూస్టర్‌ డోసు కూడా పూర్తయినా ఒమిక్రాన్‌ బారిన పడటం గమనార్హం.

Omicron symptoms: అగ్రరాజ్యంలో ఒమిక్రాన్‌ సోకిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా.. ఇప్పటివరకు ఎక్కడా ఈ కొత్త వేరియంట్‌ కారణంగా మరణాలు నమోదు కాలేదు. దీని బారినపడినవారిలో దగ్గు, అలసట, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలే గుర్తించారు. దేశ, విదేశాలకు ప్రయాణాలు, పెద్ద ఎత్తున గుమిగూడటం వల్ల ఈ వేరియంట్‌ ప్రబలినట్టు సీడీసీ గుర్తించింది. వ్యాక్సినేషన్‌, విధిగా మాస్క్‌ ధరించడం, వెంటిలేషన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, అనుమానం వస్తే పరీక్షలు చేసుకోవడం, క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వంటి చర్యలే ఏ వేరియంట్‌ నుంచైనా కాపాడతాయని సీడీసీ సూచించింది. అమెరికాలో తొలిసారి డిసెంబర్‌ 1న ఒమిక్రాన్‌ కేసు వెలుగుచూసింది.

ఇదీ చూడండి: చాపకింద నీరులా కరోనా- 'ఒమిక్రాన్​'తో ఆంక్షల్లోకి దేశాలు!

పెరిగిన ఇన్​ఫెక్షన్ ఉద్ధృతి..

America covid cases: కొవిడ్‌ 19 కేసులు అమెరికాను ఇంకా వణికిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో ఇన్ఫెక్షన్‌ ఉద్ధృతి పెరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వారంలో అమెరికాలో రోజుకు సగటున 1,20,000 కేసులు బయటపడగా.. గత వారంతో పోలిస్తే ఇది దాదాపు 40శాతం అధికం కావడం గమనార్హం. కరోనా మళ్లీ విజృంభిస్తుండటం వల్ల గత వారంతో పోలిస్తే ఆస్పత్రుల్లో చేరేవారి శాతం 40శాతం మేర పెరిగింది. రోజుకు దాదాపు 7500 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అమెరికాలో శుక్రవారం వరకు 200 మిలియన్ల మందికి పైగా (60.6శాతం) పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేసుకోగా.. 51.7 మిలియన్ల మందికి బూస్టర్ డోసులు కూడా పూర్తయింది. అమెరికాలో ఇప్పటివరకు 4,98,33,432 కొవిడ్‌- 19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. దీని ప్రభావంతో 7,96,749మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కొవిడ్‌ కేసులు, మరణాలు అమెరికాలోనే అధికం.

ఇదీ చూడండి: అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే 'పాస్​పోర్ట్​'

తైవాన్​లో తొలి ఒమిక్రాన్ కేసు..

Taiwan omicron variant: దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్​ వేరియంట్​.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా.. తైవాన్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఆఫ్రికా దేశం ఎస్వాతీనీ నుంచి వచ్చిన ఓ మహిళకు ఈ వేరియంట్​ సోకినట్లు నిర్ధరణ అయిందని తైవాన్​ ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు.

సదరు తైవాన్ మహిళ డిసెంబరు 8న ఎస్వాతీని నుంచి తైవాన్​కు వచ్చారని తైవాన్​ సెంట్రల్ ఎపిడెమిక్ కమాండ్ సెంటర్​ ​తెలిపింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్​లో ఉన్నారని పేర్కొంది. విమానంలో ఆమె పక్కన కూర్చుని ప్రయాణించినవారికి కరోనా నెగెటివ్​గానే తేలిందని స్పష్టం చేసింది.

Taiwan coronavirus: తైవాన్​లో శనివారం 10 మందికి కొత్తగా కరోనా సోకినట్లు తేలింది. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. విదేశాల నుంచి వచ్చినవారికి రెండు వారాలపాటు క్వారంటైన్​ ఉండాలనే నిబంధనను తైవాన్ అధికారులు అమలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: టీకా నిల్వలతోనే కరోనా కొనసాగింపు.. డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.