ETV Bharat / bharat

అసోం సీఎం ఎంపికకు భాజపా 'ఎంపీ​' ఫార్ములా!

author img

By

Published : Mar 13, 2021, 6:42 PM IST

BJP to implement MP formula in selecting Assam CM candidate
అసోం సీఎం అభ్యర్థి ఎంపికకు భాజపా 'ఎంపీ​' ఫార్ములా

రాష్ట్రానికో వ్యూహం, ప్రాంతానికో పథక రచన. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భాజపా అనుసరించే మార్గమిది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్ధుల విషయంలో ఆ పార్టీ వ్యూహం ఎప్పుడూ రహస్యమే. శాసనసభ ఎన్నికలు జరగనున్న అసోంలో సైతం ఆ పార్టీది ఇప్పుడు అదే పంధా. ముఖ్యమంత్రిగా తమ పార్టీ తరపున ప్రస్తుతం శర్వానంద సోనోవాల్‌ ఉన్నా.. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎవరు ఆ పీఠాన్ని అధిరోహిస్తారో చెప్పకుండా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది భాజపా.

ఇతర పార్టీల కంటే మాది భిన్నమైన పార్టీ. సిద్ధాంతాల గురించి భాజపా తరచూ చెప్పే మాట ఇది. సిద్ధాంతాల మాట ఎలా ఉన్నా వ్యూహరచనలోనూ ఆ పార్టీది కాసింత భిన్న పంధాయే. ముఖ్యంగా ఎన్నికల విషయంలో ఆ పార్టీ అడుగులన్నీ ఆచితూచి ఉంటాయి. మరికొన్ని రహస్యంగానూ ఉంటాయి. రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రుల అభ్యర్ధుల విషయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది భాజపా అనుసరించే ఈ వ్యూహం. ఈ నెల, వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్న బంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎక్కడా తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు భాజపా. ఆయా రాష్ట్రాల్లో అసోంలో తప్ప ఎక్కడా భాజపా అధికారంలో లేదు. మిగతా రాష్ట్రాల విషయాన్ని కాస్త పక్కన పెడితే అధికారంలో ఉన్న అసోంలో సైతం తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఫలానా వ్యక్తి అని ఎక్కడా బయటపెట్టడం లేదు భాజపా. 2016లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రిగా నియమించగా, అయిదేళ్లుగా ఆయనే కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారంలోకి వస్తే సోనోవాల్‌నే తిరిగి ముఖ్యమంత్రిగా నియమిస్తామని భాజపా ఎక్కడా చెప్పడం లేదు. ఇది భాజపా వ్యూహరచనలో భాగమే అని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత సహజం. ఆ పార్టీ ముఖ్యమంత్రికి కూడా అది వర్తిస్తుంది. ఇక్కడే భాజపా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సర్బానంద సోనోవాల్‌ పేరు ప్రకటిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, కొత్త వారి పేరు తెరమీదకు తెస్తే పార్టీలో గ్రూపు తగాదాలు చెలరేగి ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం చూపిస్తుందని భాజపా భావిస్తోంది. అందుకే అసోం శాసనసభ ఎన్నికల్లో గెలిస్తే ఫలానా వ్యక్తి సీఎం అవుతారని ఎక్కడా చెప్పడం లేదు.

రేసులో కీలక నేతలు

అసోంలో సోనోవాల్‌తో పాటు పలువురు ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం రేసులో ఉన్నారు. ముఖ్యంగా అసోం ఆరోగ్య మంత్రి, ఈశాన్య రాష్ట్రాల ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌ హిమంత బిశ్వశర్మ.. సోనోవాల్‌ తర్వాత సీఎం పదవి రేసులో ముందువరుసలో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సంక్షోభ పరిష్కారకర్తగా పేరున్న ఈయనకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టిలో చాలా మంచిపేరు ఉంది. మణిపూర్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సహా ఇటీవల జరిగిన బోడోలాండ్‌ ప్రాదేశిక ప్రాంత ఎన్నికల్లో బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌తో స్నేహాన్ని తెంచుకుని ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌తో భాజపాకు పొత్తు కుదర్చడంలో హిమంత కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా.. యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌తో పాటు అసోం గణపరిషత్‌తో కలిసి పోటీ చేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే హిమంత బిశ్వశర్మ పేరు కూడా సీఎం పదవికి భాజపా తెరమీదకు తెచ్చే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికలో భాజపా అనూహ్య నిర్ణయాలే తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌, ఇటీవల త్రిపురలో తీరథ్‌సింగ్‌ రావత్‌ అలా నియమితులైనవారే.

శివరాజ్ సింగ్​ ఇలాగేే...

గత ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు అవకాశం వచ్చిన సమయంలోనూ భాజపా ఇలాగే వ్యవహరించింది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ముందు వరుసలో ఉన్నా..... సీఎం అభ్యర్ధి పేరును చివరి వరకూ బయటకి రాకుండా జాగ్రత్త పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని రోజుల ముందు మాత్రమే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పేరును ప్రకటించింది. అసోంలో కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తోంది భాజపా. మరి అసోం ఎన్నికల్లో గెలిస్తే ప్రస్తుత సర్బానంద సోనోవాల్‌కే తిరిగి సీఎం పదవి అప్పగిస్తుందా, హిమంత బిశ్వశర్మను సీఎంను చేస్తుందా లేక ఎప్పటిలాగే అనూహ్య పేరును తెరమీదకు తెస్తుందా అన్నది ఫలితాల తర్వాతే తేలనుంది.

ఇవీ చదవండి: 'విదేశాంగ వ్యూహం'తో అసోంపై భాజపా గురి!

'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.