ETV Bharat / bharat

కేరళలో ఇప్పుడైనా భాజపా పుంజుకుంటుందా?

author img

By

Published : Feb 13, 2021, 7:09 PM IST

కేరళలో పాగా వేయాలని దశాబ్దాలుగా పరితపిస్తోంది భాజపా. ఆ రాష్ట్రంలో ఆర్​ఎస్​ఎస్​ శాఖలు గణనీయంగా 5000కు పైగా ఉన్నప్పటికీ వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక విఫలమవుతోంది. కేరళలో భాజపా రాజకీయ చరిత్రను గమనిస్తే 2006 తర్వాత ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు రాష్ట్రంలోని 140 నియోజక వర్గాల్లో సగటున 5,000 ఓట్లు లేక 10,000 ఓట్లకే పరిమితమైన కమలం పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​లకు 20 చోట్ల గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.

BJP is aiming to win 20 Assembly seats in Kerala
ఆర్​ఎస్​ఎస్​ అండతో కేరళలో భాజపా పుంజుకుంటుందా?

ఉత్తర్​ప్రదేశ్​లో తర్వాత దేశంలో అత్యధికంగా ఆర్​ఎస్​ఎస్​ శాఖలున్న రాష్ట్రం కేరళ. యూపీలో ఇప్పుడు భాజపా అధికారంలో ఉంది. కానీ కేరళలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది. అయినా.. ఆ రాష్ట్రంలో తొలిసారి ఖాతా తెరిచి చరిత్ర సృష్టించింది.

అయితే కేరళలో ఆర్​ఎస్​ఎస్​ శాఖలు గణనీయంగా 5000కు పైగా ఉన్నప్పటికీ వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక విఫలమవుతోంది కమలం పార్టీ. కాంగ్రెస్​, సీపీఎంల ఓటు బ్యాంకునూ చీల్చలేక చతికిలపడుతోంది. 2006 నుంచే కాస్త ప్రభావం చూపుతోంది.

నమ్మిన విధానంతోనే

ప్రతికూల రాజకీయ వాతావరణంలో మనుగడ సాగించాలంటే పట్టుదల వీడకుండా ముందుకు సాగాలనేదే భాజపా తొలినాళ్ల నుంచి నమ్మిన విధానం. 1980లో భారతీయ జన సంఘ్​, జనతా పార్టీల కలయికతో ఏర్పాటైన కమలం పార్టీ ప్రధానంగా హిందుత్వ భావజాలంపైనే నిలిచింది. కాలక్రమేణా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమను ప్రత్యామ్నాయ శక్తిగా సుస్థిరం చేసుకుంది. కష్టకాలాల్లోనూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

భాజపా మొదటి నుంచి నమ్మిన విధానంతోనే ఎలాంటి విభజన రాజకీయాలకు తావులేని కేరళలోనూ క్రమంగా పట్టు సాధిస్తోంది. ఎన్నో సామాజిక సంస్కరణల ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించిన ఈ రాష్ట్రంలో కాషాయం ధరించిన సాధువులు దళితుల అభ్యున్నతి గురించి మాట్లాడారు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించారు. ఈ పరిణామాలు భాజపా క్షేత్రస్థాయిలో బలపడేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఈ బలంతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కమలం పార్టీ. వీటిలో కనీసం ఐదు స్థానాల్లో గెలుపొంది కేరళలో తన పాగా వేయాలని చూస్తోంది.

ఇదీ చూడండి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్​సీపీ కీలక నిర్ణయం

2006 నుంచి మార్పు..

కేరళలో భాజపా రాజకీయ చరిత్రను గమనిస్తే 2006 తర్వాత ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు రాష్ట్రంలోని 140 నియోజక వర్గాల్లో సగటున 5,000 ఓట్లు లేక 10,000 ఓట్లకే పరిమితమైన పార్టీ.. ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్ తర్వాత భారీ వ్యత్యాసంతో మూడో స్థానంలో నిలిచేది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఆయినా ఆశలు వదులుకోవడం సహజం. ప్రత్యేకించి కేరళ వంటి రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని చూరగొనడం మరింత కష్టంతో కూడుకున్న పని. కానీ భాజపా, ఆర్​ఎస్​ఎస్ నాయకుల ప్రణాళికలు వేరేలా ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలపైనే కాకుండా చిన్న రాష్ట్రాలపైనా దృష్టి సారించడం ఎంత కీలకమో వారికి తెలిసొచ్చింది. కుల సమీకరణాలు, సామాజిక బలాలను విశ్లేషించి భాజపా తొలుత కేరళలోని రెండు నియోజకవర్గాలు.. కాసరగడ్​లోని మంజేశ్వరం, త్రివేండ్రంలోని నేమంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.

మంజేశ్వరంలో కన్నడ బ్రాహ్మణుల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటుంది. తరతరాలుగా వారు హిందూత్వ భావజాలానికి మొగ్గు చూపడం అక్కడ భాజపా ఎదుగుదలకు దోహదపడింది. మంగళూరులోని ట్రేడర్ల నుంచి పార్టీకి ఆర్థికంగా భారీ మద్దతు లభించడం కలిసొచ్చింది. ఫలితంగా కాసరగడ్​లో నియోజకవర్గంలో తలపండిన నేతలకు పోటీ ఇచ్చే స్థితికి చేరుకుంది. అయితే ఈ నియోజక వర్గంలో ఇంకా విజయం సాధించాల్సి ఉంది.

మంజేశ్వరంలో ముస్లింల జనాభా ఎక్కువ. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్​(ఐయూఎంఎల్​) వైపే వారు మొగ్గు చూపుతారు. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలో ఈ పార్టీ భాగస్వామి. వారికి ఈ స్థానం ఎంతో కీలకం. అయితే ఈ నియోజకవర్గంలో సీపీఎం క్రాస్ ఓటింగ్​కు పాల్పడి ఐయూఎంఎల్ అభ్యర్థికి మద్దతు తెలపడం వల్లే తాము గెలవలేకపోతున్నామని భాజపా ఆరోపిస్తోంది.

తొలి విజయం..

నేమం నియోజక వర్గంలో కూడా ఆర్​ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఇక్కడ హిందూ ఓట్లే ఎక్కువ కావడం వల్ల భాజపా బలోపేతం కావడానికి దోహదపడింది. కేరళ భాజపా తొలి అధ్యక్షుడు ఓ రాజగోపాలన్​ ఈ స్థానం నుంచి పలుమార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా పట్టువీడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించింది కమలం పార్టీ. వరుస పరాజయాలతో రాజగోపాలన్​పై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్​ వచ్చాయి. ఎలక్షన్ అంకుల్ అని మీమ్​లు వచ్చాయి. ఎట్టకేలకు 2016 ఎన్నికల్లో విజయం కైవసం చేసుకుని అక్కడ భాజపా తొలి ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు రాజగోపాలన్​. ఈ విజయం తర్వాత ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి మరో 20 నియోజక వర్గాలపై కమలం పార్టీ దృష్టి సారించింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రివేండ్రం. కొల్లం, పాలక్కడ్​, త్రిస్సూర్​, కాసర్​గడ్​ జిల్లాలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది.

భాజపా వైపే మొగ్గు..

భాజపా వంటి హిందుత్వ భావజాల పార్టీకి కేరళలో ఆదరణ తక్కువ. అలాంటి రాష్ట్రంలో పోటీ ఇవ్వడం ఆ పార్టీకి అంత సులభమేమీ కాదు. ఎంపీ పరమేశ్వరన్ వంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల మేధోపరమైన జోక్యం మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. కేరళలో సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఊపందుకున్నప్పుడు, అన్ని కులాలకు సమాన హక్కులు , భూ సంస్కరణలు, అందరికీ ఆలయ ప్రవేశం వంటి పోరాట సమయంలో హిందుత్వ అనుకూల సిద్ధాంతకర్తలు ఎక్కువగా ప్రతిపక్షంలోనే ఉన్నారు. 1980లో భాజపా కేరళ యూనిట్ ఏర్పడిన తరువాత కూడా, దాని రాజకీయ ఉనికి కేరళలోని ఆర్‌ఎస్‌ఎస్‌పైనే ఆధారపడి ఉంది. 1990లో బాబ్రీ మసీదు ఘటన తరువాత ఇస్లామిక్ అతివాద భావజాలం పెరగడం.. రాజకీయంగా తటస్థంగా ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడటం భాజపాకు సహాయపడింది.

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తన వైఫల్యాల కారణంగా భాజపాకు అధికారం కట్టబెడుతున్న కాంగ్రెస్​.. కేరళలోనూ కమలం పార్టీ బలోపేతం కావడానికి కారణమవుతోంది. ముస్లింలు, క్రైస్తవులు, వలస కుటుంబాల్లో కాంగ్రెస్​కు ఆదరణ ఉన్నప్పటికీ ఎక్కువ మంది సున్నితమైన హిందుత్వ భావజాలంవైపే మొగ్గుచూపుతున్నారు. సంస్కృతి, నైతిక విలువలు పాటిస్తూ తటస్థ రాజకీయ భావజాలం కలిగిన ఉన్న కాంగ్రెస్​ మద్దతుదారులందరూ ఇప్పుడు భాజపాలోకి వెళ్తున్నారు. మెజారిటీ హిందూ అనుకూల కాంగ్రెస్ మద్దతుదారులకు దూకుడైన , సంస్కరణ-ఆధారిత, మత వ్యతిరేక సీపీఎం ఎప్పటికీ ఆచరణీయమైన ప్రత్యామ్నాయం కాదు. ఈ అవకాశాలను భాజపా అందిపుచ్చుకుంటోంది. కేంద్ర నాయకత్వం కూడా ప్రాంతీయ ఎజెండాలపై దృష్టి సారిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం నిర్వహించడం కూడా కమలం పార్టీకి కలిసివస్తోంది. తమ రాజకీయ లక్ష్యాలను, భావజాలాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో భాజపా ఐటీ విభాగం అన్ని పార్టీల కంటే ముందుంది.

వచ్చే పదేళ్లలో

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్​డీఎఫ్, యూడీఎఫ్​లకు భాజపా గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రామీణ ఓటర్లపైనే ప్రత్యేక దృష్టి సారించనుంది.

ఇప్పుడు 20 స్థానాల్లోనే పోటీ ఇవ్వాలని భావిస్తున్నా కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎల్​డీఎఫ్, యూడీఎఫ్​లకు భాజపా గట్టీ పోటీ ఇచ్చేందుకు ఇంకో పదేళ్లు పట్టొచ్చు.

ఇదీ చూడండి: కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.