ETV Bharat / bharat

ఆ చాయ్ దుకాణమే 'నీట్'​ పుస్తకాల నిలయం

author img

By

Published : Oct 5, 2020, 3:08 PM IST

The library inside a tea stall in theni allinagaram
ఆ చాయ్ దుకాణమే.. పుస్తకాల నిలయం!

చాయ్ దుకాణమంటే కేవలం గరంగరం చాయ్​తో బుర్ర వేడి తగ్గించుకునే ప్రదేశమే కాదు.. హాట్ హాట్ రాజకీయ చర్చలకు సభా వేదిక. పిచ్చాపాటి కబుర్లకు అడ్డా. టీ కప్పు చేత బట్టి భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకునే చోటు. తమిళనాడులో అలాంటి ఓ చాయ్ దుకాణం ఇప్పుడు ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకుంది. పోటీ పరీక్షల పుస్తకాలతో నిండిపోయి 'చాయ్ లైబ్రరీ'గా అవతారమెత్తింది.

ఆ చాయ్ దుకాణమే.. పుస్తకాల నిలయం!

చాయ్ దుకాణంలో చాయ్ కాకుండా ఇంకేం ఉంటాయి? మహా అయితే ఓ న్యూస్ పేపర్, నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు కనిపిస్తాయి. కానీ తమిళనాడు థేని జిల్లాలో మాత్రం.. ఓ చాయ్ దుకాణంలో లైబ్రరీ దర్శనమిస్తోంది. అవును, ఆ చాయ్ స్టాల్ ఇప్పుడు చాయ్ లైబ్రరీ స్టాల్​గా మారిపోయింది. మరి ఓ చాయ్ దుకాణన్ని గ్రంథాలయంగా మార్చడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం రండి..

కుమారుడి పుస్తకాలతో...

థేని జిల్లా అల్లినగరానికి చెందిన రాజేంద్రన్ కొత్తగా 'అరువి టీ స్టాల్' తెరిచాడు. రాజేంద్రన్ కుమారుడు జయసుదర్శన్ జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమైనప్పుడు కుప్పలు తెప్పలుగా కొనుక్కున్న పుస్తకాలను భద్రంగా దాచుకున్నాడు. వాటితోనే చాయ్ దుకాణంలో 'కలాం విద్యార్థుల లైబ్రరీ'ని ప్రారంభించాడు రాజేంద్రన్. చాయ్ తాగడానికి వచ్చినప్పుడు ఆ పుస్తకాలను చదువుకునే వీలుతోపాటు ఆధార్, మొబైల్ నంబరు తీసుకొని కావాల్సిన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే సౌకర్యమూ కల్పించాడు.

మొదట్లో రాజేంద్రన్ చాయ్ దుకాణం లైబ్రరీలో నీట్, జేఈఈ, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి.. జనరల్ నాలెడ్జ్ వంటి పుస్తకాలు లేకపోయేవి. కానీ ఈ విషయం తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ కొన్ని పుస్తకాలు విరాళంగా ఇచ్చింది. పుస్తకాల సంఖ్య పెరిగేసరికి.. దుకాణానికి గిరాకీ పెరిగింది. అందుకే ఇకపై పరీక్షా పుస్తకాలే కాక, నవలలు, చిన్న కథల పుస్తకాలు పెట్టి కస్టమర్లకు పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించాలనుకుంటున్నాడు రాజేంద్రన్ తనయుడు జయసుదర్శన్.

The library inside a tea stall in theni allinagaram
చాయ్ దుకాణంలో పుస్తకాలు తిరగేస్తున్న పాఠకులు

'ఒక్కరు బాగుపడ్డా చాలు... '

చాయ్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. కానీ తమ టీ స్టాల్​లో మాత్రం.. టేస్టీ చాయ్​తో పాటు విద్యార్థులకు భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం కూడా దొరుకుతుంది అంటున్నాడు రాజేంద్రన్. తమ లైబ్రరీ ద్వారా ఒక్క విద్యార్థి భవిష్యత్తు బాగుపడినా చాలంటున్నాడు.

"మా కుమారుడి జేఈఈ, నీట్ పరీక్షల కోసం కొన్న పుస్తకాలను జాగ్రత్తగా దాచాను. వాటితోనే ఓ లైబ్రరీని ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ వాటి కోసం ప్రత్యేక స్థలం దొరక్క.. మేము కొత్తగా తెరిచిన మా చాయ్ దుకాణంలోనే పుస్తకాలు పెట్టాం. అలా ఈ 'కలాం విద్యార్థుల లైబ్రరీ'ని ఆవిష్కరించాం."

- రాజేంద్రన్, లైబ్రరీ టీ స్టాల్ యజమాని

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు వందలు, వేలు పోసి పుస్తకాలు కొనాల్సివస్తుంది. కానీ చదువుకోవాలనుకున్నవారందరి వద్ద ఆ పుస్తకాలు కొనే స్తోమత ఉండకపోవచ్చు. పోనీ లైబ్రరీలకు వెళ్లి చదువుకోవాలనుకుంటే కరోనా కాలంలో అదీ కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో రాజేంద్రన్ స్థాపించిన చాయ్ దుకాణం లైబ్రరీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతోందని అంటున్నారు స్థానికులు.

ఇదీ చదవండి: వైరల్​: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటోషూట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.