ETV Bharat / bharat

'పాకిస్థాన్​తో సాధారణ సంబంధాలకు అదే అడ్డు'

author img

By

Published : Oct 17, 2020, 10:10 AM IST

Jaishankar
'పాక్​తో సాధారణ సంబంధాలకు అదే అడ్డు'

పాకిస్థాన్​తో సాధారణ సంబంధాలు కొనసాగించకపోవడానికి ఉగ్రవాదమే ప్రధాన కారణమని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పాటు ఇరుదేశాల మధ్య మరికొన్ని సమస్యలున్నట్లు తెలిపారు. భారత్​తో కనీస వాణిజ్యం సైతం పాకిస్థాన్ చేయడం లేదని, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను సైతం ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు పలికే పాకిస్థాన్ విధానాల వల్ల ఆ దేశంతో సాధారణ సంబంధాలు కొనసాగించడం కష్టతరంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. శాశ్వత సమస్యలను పక్కనబెడితే.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉగ్రవాద సమస్య గురించే ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.

ఆసియా సొసైటీ నిర్వహించిన ఆన్​లైన్ సమావేశంలో మాట్లాడిన జైశంకర్... భారత్-పాకిస్థాన్ సంబంధాలపై చర్చించారు. ఉగ్రవాదం కాకుండా ఇరుదేశాల మధ్య ఎన్నో సమస్యలు ఉన్నాయని వివరించారు. భారత్​తో సాధారణ వాణిజ్యం కూడా పాకిస్థాన్ చేయడం లేదని అన్నారు. భారత్​కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్(ఎంఎఫ్ఎన్) హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య వీసా సంబంధాలు అత్యంత పరిమితంగా ఉన్నాయని తెలిపారు. అఫ్గానిస్థాన్-భారత్ మధ్య రాకపోకలను పాక్ నిషేధించిందని పేర్కొన్నారు.

"సాధారణంగా పొరుగుదేశాలు వర్తకం చేసుకుంటాయి. వీసాలు జారీ చేసుకుంటాయి. కనెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పాటించవు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు.. 'ప్రత్యేకమైన ఈ పొరుగువారితో మీకు సాధారణ సంబంధాలు ఎలా ఉన్నాయ'నే ప్రశ్న.. మా విదేశాంగ విధానానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది."

-సుబ్రహ్మణ్యం జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై జైశంకర్ స్పందించారు. భారత అంతర్గత సరిహద్దులను మాత్రమే మార్చామని స్పష్టం చేశారు.

"భారతదేశ బాహ్య సరిహద్దుల్లో ఎలాంటి మార్పు లేదు. ఐదేళ్ల క్రితం, ఇరవై ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం భారత బాహ్య సరిహద్దులు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి."

-సుబ్రహ్మణ్యం జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

దేశం లోపల సరిహద్దులు మార్చుకోవడం అంతర్గత విషయమని, బాహ్య సరిహద్దులు మార్చితేనే పొరుగుదేశాలపై ప్రభావం పడుతుందని అన్నారు జైశంకర్. ప్రాంతాల మధ్య సరిహద్దులు మార్చుకోవడం అన్ని దేశాల్లో జరిగేదేనని అన్నారు. చైనా సైతం తన ప్రావిన్సుల సరిహద్దులు మార్చిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి- నడిరేయిలో 'పృథ్వీ-2' ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.