ETV Bharat / bharat

భారత 'తేజస్'​పై ప్రపంచ దేశాల ఆసక్తి

author img

By

Published : Jan 25, 2021, 8:46 AM IST

తేజస్​ యుద్ధ విమానాల కొనుగోలుపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని హెచ్​ఏఎల్ ఛైర్మన్ ఆర్.మాధవన్​ అన్నారు. సాంకేతికత పరంగా చైనాకు చెందిన జేఎఫ్​-17 కన్నా తేజస్​కు పైచేయి ఉంటుందని తెలిపారు. తేజస్ సరఫరా కోసం ఫిబ్రవరి 5న జరిగే ఏరో ఇండియా ప్రదర్శనలో హెచ్​ఏఎల్​కు, వైమానిక దళానికి ఒప్పందం కుదురుతుందన్నారు.

tejas aircraft
తేజస్​పై ప్రపంచ దేశాలపై ఆసక్తి

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్​ మార్క్-1ఏ యుద్ధవిమానాలను భారత వైమానిక దళానికి అందించే ప్రక్రియను 2024 మార్చి నుంచి ప్రారంభిస్తామని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​ (హెచ్​ఏఎల్​) ఛైర్మన్ ఆర్​.మాధవన్​ తెలిపారు. ఏటా 16 యుద్ధవిమానాలను ఉత్పత్తి చేస్తామని 'పీటీఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తేజస్ కొనుగోలు కోసం అనేక దేశాలు ఆసక్తి చూపాయని చెప్పారు. మొదటి ఎగుమతి ఆర్డర్ రెండేళ్లలో ఖరారు కావొచ్చన్నారు. అయితే దేశీయ అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అవసరాన్ని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు.

మన విమానానికి తిరుగులేదు

చైనాకు చెందిన జేఎఫ్-17 కన్న తేజస్ మార్క్-1ఏ చాలా మెరుగైందని మాధవన్ చెప్పారు. మన యుద్ధవిమానంలో సమర్థ ఇంజిన్, రాడార్​, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ ఉన్నాయన్నారు. టెక్నాలజీపరంగా జేఎఫ్​-17 కన్నా తేజస్​కు పైచేయి ఉంటుందని చెప్పారు. "మన యుద్ధవిమానానికి గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం ఉంది. ప్రత్యర్థి విమానానికి ఆ సత్తా లేదు" అని పేర్కొన్నారు. తేజస్ మార్క్-1ఏలో ఏఈఎస్​ఏ రాడార్, దృశ్యపరిధి ఆవలి లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉంటాయన్నారు.

వచ్చే నెలలో ఒప్పందం

తేజస్ సరఫరా కోసం వచ్చే నెల 5న జరిగే "ఏరో ఇండియా ప్రదర్శన"లో హెచ్​ఏఎల్​కు, వైమానిక దళానికి మధ్య ఒప్పందం కుదురుతుందని మాధవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ పాల్గొంటారని తెలిపారు. తొలుత ఏటా నాలుగు విమానాలను అందిస్తామని , 2025 నుంచి ఆ సంఖ్యను 16కు పెంచుతామని చెప్పారు.

దేశీయ పరిశ్రమలకు ఊతం

తేజస్​ ప్రాజెక్టు వల్ల దేశ ఏరోస్పేస్ రంగానికి ఊతం లభిస్తుందని మాధవన్​ తెలిపారు. ఇందులో ప్రస్తుతం 563 దేశీయ పరిశ్రమలు పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. వాటి సంఖ్య 650కి పెరిగే అవకాశం ఉందన్నారు.

ప్రాజెక్టు ఖర్చులివీ

రూ.48వేల కోట్లతో 83 తేజస్​ మార్క్-1ఏ జెట్​లను కొనుగోలు చేయడానికి భద్రతా వ్యవహారాల క్యాబినెట్​ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో యుద్ధవిమానాల ధర రూ.25వేల కోట్లు ఉంటుందని మాధవన్​ చెప్పారు. రూ.11వేల కోట్లతో వైమానిక స్థావరాల్లో సాధన సంపత్తి, ఇతర మౌలిక వసతులను సమకూరుస్తామన్నారు. కస్టమ్స్ సుంకం, జీఎస్​టీ కింద రూ. 7వేల కోట్లు ఉంటాయని చెప్పారు. రూ.2500 కోట్లను డిజైన్ ఖర్చుల కింద ఏరోనాటికల్ డెవలెప్​మెంట్​ ఏజెన్సీ (ఏడీఏ)కి ఇస్తామన్నారు. విదేశీ మారకద్రవ్య విలువల్లో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేయడానికి రూ.2250 కోట్లను ప్రత్యేకించామని తెలిపారు.

ఇదీ చదవండి : సివిల్స్ అభ్యర్థులకు మరో ఛాన్స్​పై సుప్రీం విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.