ETV Bharat / bharat

'త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు.. బలం నిరూపించుకుంటాం'

author img

By

Published : Jul 24, 2020, 12:56 PM IST

కాంగ్రెస్​ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బలం నిరూపించుంటామని స్పష్టం చేశారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కొందరు సభకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాతో భేటీ అయ్యారు సీఎం.

Rajasthan Politics
రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంటుందని వెల్లడించారు. అనంతరం కొద్ది గంటల్లోనే గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాతో భేటీ అయ్యారు గహ్లోత్​. ఈ భేటీలో శాసనసభ సమావేశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

" త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మాకు పూర్తి మెజారిటీ ఉంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంతో ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లోని కొందరు సమావేశాలకు హాజరవుతారని నమ్మకముంది. వారు లేకపోయినా.. మాకు పూర్తి మెజారిటీ ఉంటుంది. ఆ మెజారిటీతోనే సభకు వెళుతున్నాం. అక్కడే నిరూపించుకుంటాం. "

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

ఫోరెన్సిక్​కు పంపాం..

ఆడియో టేపుల విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​పై పరోక్ష విమర్శలు చేశారు ముఖ్యమంత్రి గహ్లోత్​. పేరు చెప్పకుండానే.. స్వర నమూనాలు ఇచ్చేందుకు ఆయన ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్​ పరీక్షల కోసం విదేశాలకు పంపించామని తెలిపారు. టేపులు కల్పితమైనవి అనే వాదనలను తోసిపుచ్చారు గహ్లోత్​​. వాటిని పరీక్షించేందుకు ఏ ఫోరెన్సిక్​ ల్యాబ్​కైనా పంపేందుకు సిద్ధమని సవాల్​ విసిరారు.

ఈడీ సోదాలపై విమర్శలు..

ఎరువుల ఎగుమతుల కుంభకోణం అంశంలో గహ్లోత్​ సోదరుడి ఇంటిలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సోదాలు నిర్వహించటంపై విమర్శలు చేశారు సీఎం. కేంద్ర సంస్థలు మోదీ, అమిత్​ షా ఆదేశాల మేరకు పని చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి వాటికి తాము భయపడబోమని, తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేశారు గహ్లోత్.

ఇదీ చూడండి: 'కేంద్రమంత్రే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.