ETV Bharat / bharat

'స్పీకర్​ అధికారాల్ని ప్రశ్నించటం ఆందోళనకరం'

author img

By

Published : Jul 26, 2020, 1:43 PM IST

రాజస్థాన్​లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు స్పీకర్​ అధికారాలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్​లో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్​ అనర్హత నోటీసులు జారీ చేశారు. దానిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది కోర్టు. ఈ విషయంపై స్పందిస్తూ.. అనర్హత నోటీసుల జారీపై స్పీకర్​ అధికారాన్ని ప్రశ్నించటం ఆందోళన కలిగిస్తోందన్నారు లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్​ పీడీటీ ఆచారీ. 1992లోనే సుప్రీం కోర్టు ఈ అంశంపై స్పష్టతనిచ్చినట్లు గుర్తు చేశారు. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు.

PDT Achary
'ఆ విషయంలో స్పీకర్​ అధికారాల్ని ప్రశ్నించటం ఆందోళనకరం'

రాజస్థాన్​ రాజకీయల్లో జరుగుతున్న పరిణామాలు స్పీకర్​ అధికారాలపైనే పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనర్హత నోటీసులపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేలకు ఇటీవల సుప్రీం కోర్టు, రాజస్థాన్​ హైకోర్టు అనుమతించింది. అనర్హత నోటీసులపై 28 ఏళ్ల క్రితమే సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టత నిచ్చిన నేపథ్యంలో.. మళ్లీ స్పీకర్​ అధికారాల్ని ప్రశ్నించటం ఆందోళన కలిగిస్త్తోందని పేర్కొన్నారు లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్​ పీడీటీ ఆచారీ. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో ఆయన కీలక విషయాలు పంచుకున్నారు.

" స్పీకర్​ నిబంధనల ప్రకారమే నోటీసులు ఇస్తారు. ఈ నిబంధనలు 10వ షెడ్యూల్​ ప్రకారం రూపొందించారు. వాటికి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పిటిషనర్​ సరైన కారణంతో సంతృప్తి పరచాలి. కిహోటో హోలోహన్​ కేసులో 1992లోనే సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు​ నోటీసులు ఇవ్వటంలో స్పీకర్​ అధికారాలపై సుదీర్ఘ చర్చ చేపట్టింది. స్పీకర్​ తుది నిర్ణయం తర్వాతే న్యాయ సమీక్ష జరగాలని, అంతకు ముందు కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది."

-పీడీటీ ఆచారీ, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్​

సచిన్​ పైలట్​ వర్గానికి ఊరట కలిగిస్తూ.. ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించటం, కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పార్టీగా చేర్చటానికీ అనుమతించటం.. స్పీకర్​ నోటీసును సవాలు చేయటం చూస్తే నోటీసుల రాజ్యాంగ బద్ధతనూ ప్రశ్నించవచ్చనే అర్థమవుతున్నట్లు తెలిపారు ఆచారీ.

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత నోటీసులు రెండు సందర్భాల్లో ఇవ్వొచ్చన్నారు. పార్టీ విప్​ను ధిక్కరించటం, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న సందర్భాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే అనర్హత ఫిర్యాదులు అందిన క్రమంలో స్పీకర్​ నోటీసులు జారీ చేసి.. వివరణ తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఇదీ చూడండి: గహ్లోత్​ సర్కార్​కు షాక్​- పైలట్​ వర్గానికి ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.