ETV Bharat / bharat

సాగు చట్టాల గురించి సగం మంది రైతులకు తెలీదు!

author img

By

Published : Oct 20, 2020, 4:36 PM IST

Updated : Oct 20, 2020, 7:56 PM IST

More than half the farmers supporting or opposing farm laws have no information about them: Survey
వ్యవసాయ చట్టాల గురించి సగం మందికి తెలీదు!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏముందో రైతుల్లో 52 శాతం మందికి తెలియదని ఓ సర్వేలో తేలింది. ఈ చట్టాలను 52 శాతం మంది రైతులు వ్యతిరేకించగా.. 35 శాతం మంది సమర్థిస్తున్నట్లు వెల్లడైంది. మోదీ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని 35 శాతం మంది చెబితే.. ప్రైవేటు కంపెనీలు/కార్పొరేట్ సంస్థలకు మద్దతిస్తోందని 20 శాతం మంది రైతులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల గురించి రైతుల్లో సగానికిపైగా మందికి ఎలాంటి వివరాలు తెలియవని సర్వేలో వెల్లడైంది. 'కొత్త వ్యవసాయ చట్టాలపై భారతీయ రైతుల అవగాహన' పేరిట 'గావ్ కనెక్షన్' ఈ సర్వే నిర్వహించింది.

దేశంలోని 16 రాష్ట్రాల్లో అక్టోబర్ 3-9వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. 53 జిల్లాలో 5,022 మంది రైతులతో ముఖాముఖి సర్వే చేశారు. ఈ వివరాలను 'ది రూరల్ రిపోర్ట్:2' పేరిట విడుదల చేశారు.

ఇదీ చదవండి- కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?

మొత్తంగా 52 శాతం మంది రైతులు చట్టాలను వ్యతిరేకించగా.. 35 శాతం మంది సమర్థిస్తున్నారు. మద్దతిస్తున్నవారిలో 47 శాతం మంది.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛ లభించడం వల్లే చట్టాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు.

నూతన చట్టాల వల్ల పంటను బహిరంగ మార్కెట్​లో తక్కువ ధరకే అమ్ముకునేలా తమపై ఒత్తిడి పడుతుందని వ్యతిరేకిస్తున్నవారిలో 57 శాతం మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరను తప్పనిసరి చేస్తూ దేశంలో చట్టం తీసుకురావాలని 59 శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం అమలులోకి వస్తే.. కనీస మద్దతు ధర వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందని 33 శాతం మంది ఆందోళన చెందుతున్నారు.

అవగాహన లేదు

చట్టాలను వ్యతిరేకించిన 52 శాతం మంది రైతుల్లో 36 శాతం మంది వద్ద చట్టాలపై సమాచారం లేదని సర్వేలో తేలింది. అదేవిధంగా చట్టాలను సమర్థిస్తున్న 35 శాతం మంది రైతుల్లో 18 శాతం మంది వ్యవసాయదారులకు ఈ చట్టాల గురించి తెలియదని వెల్లడైంది.

ఐదెకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మంది ఈ చట్టాలను స్వాగతిస్తున్నారు. మధ్యస్థాయి, పెద్ద రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు.

"సగానికిపైగా(52శాతం) రైతులు నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. అందులో 36 శాతం మందికి చట్టాల గురించి తెలియదు. మోదీ ప్రభుత్వం రైతు అనుకూల ప్రభుత్వమని 44 శాతం మంది రైతులు అభిప్రాయపడగా.. 28 శాతం మంది రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పారు. మోదీ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉందని 35 శాతం మంది చెబితే.. ప్రైవేటు కంపెనీలు/కార్పొరేట్ సంస్థలకు అండగా ఉందని 20 శాతం మంది రైతులు తెలిపారు."

-సర్వే ఫలితాలు

నిరసనలపై అవగాహన

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల గురించి మూడింట రెండొంతుల మంది రైతులకు అవగాహన ఉందని సర్వే తెలిపింది. భారతదేశ వాయువ్య (పంజాబ్, హరియాణా, హిమాచల్​ప్రదేశ్) ప్రాంతంలోని రైతుల్లో 91 శాతం మందికి నిరసనల గురించి తెలుసని వెల్లడించింది. కాగా, పశ్చిమ్ బంగ, ఒడిశా, ఛత్తీస్​గఢ్​లో కనిష్ఠంగా 46 శాతం మంది రైతులకే ఆందోళనలపై అవగాహన ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- కొత్త చట్టాలతో 'మద్దతు ధర'కు ఇక మంగళమేనా?

Last Updated :Oct 20, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.