ETV Bharat / bharat

అటారీ సరిహద్దు ద్వారా భారత్​కు 200 మంది పాక్​ హిందువులు

author img

By

Published : Feb 4, 2020, 5:10 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

Attari-Wagah border
అత్తారీ-వాఘా సరిహద్దు గుండా భారత్​లోకి 200 మంది పాక్​ హిందువులు!

భారత ఆశ్రయం కోరి సరిహద్దులు దాటుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సోమవారం ఒక్కనాడే.. అటారీ-వాఘా సరిహద్దు గుండా భారత్​లోకి 200 మంది పాకిస్థాన్​ హిందువులు వచ్చారు. తమ దేశంలో సురక్షితంగా లేమని.. భారత ఆశ్రయం కోరి వచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల తీసుకొచ్చిన పౌర చట్టం కారణంగా దేశంలోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) నేపథ్యంలో పాకిస్థాన్​ నుంచి భారత్​లోకి వలసలు పెరిగాయి. సోమవారం ఒక్కరోజునే అటారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్​లోకి 200 మంది పాకిస్థానీ హిందువులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పర్యటక వీసాతో భారత్​కు వచ్చిన కొందరు తిరిగివెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు అందుతున్న సమాచారం మధ్య ఈ వలసలు పెరుగుతున్నట్లు తెలిపారు.

కరాచీ, సింధు ప్రాంతం నుంచే అధికంగా..

సోమవారం భారత్​లోకి వస్తున్న వారిలో అధికంగా సింధు, కరాచీ ప్రాంతం నుంచి వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. అందులో చాలా మంది లగేజీ సర్దుకొని వచ్చారని, వారంతా భారత్​లో ఆశ్రయం కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

'పాకిస్థాన్​లో సురక్షితంగా లేము'

పాకిస్థాన్​లో తమపై హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని, అక్కడ తాము సురక్షితంగా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారత్​లోకి వచ్చిన పాకిస్థానీలు.

"పాకిస్థాన్​లో మేము సురక్షితంగా లేము. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న క్రమంలో మా బాలికలు ఎప్పుడైనా కిడ్నాప్​కు గురవుతామనే భయంతో ఉన్నారు. వాయువ్య పాకిస్థాన్​లో మా బాలికలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు."

- పాకిస్థానీ మహిళ

పాకిస్థాన్​లో హిందూ బాలికల కిడ్నాప్​లు సాధారణమైపోయాయని మరో ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క కుటుంబం కూడా ఫిర్యాదు చేసేందుకు సాహసం చేయలేకపోతోందని తెలిపారు.

సరిహద్దులో అకాలీ నాయకుడు..

మరోవైపు.. అకాలీ నాయకుడు, దిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మంజిందర్​ సింగ్​ సిర్సా మాత్రం మతపరమైన హింసతో.. పాకిస్థాన్​కు పారిపోయిన నాలుగు కుటుంబాలను తీసుకువెళ్లేందుకు వచ్చినట్లు చెబుతున్నారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను కలిసి వారికి భారత పౌరసత్వం ఇవ్వాలని కోరనున్నట్లు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

పౌర చట్టంతో పెరిగిన సంఖ్య..

2014 డిసెంబర్​ 31కి ముందు దేశంలోకి పాకిస్థాన్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైన, పార్సీ, క్రిస్టియన్​ మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పించేందుకు చట్ట సవరణ చేసింది కేంద్రం.

ఈ నేపథ్యంలో.. భారత పౌరసత్వం వస్తుందనే ఆశతోనే పాక్​, అఫ్గాన్​లోని హిందువులు, సిక్కులు సరిహద్దు దాటుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భారత్​లోకి వచ్చిన వారిలో చాలా మంది రాజస్థాన్​లోని తమ బంధువులను కలిసేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

Intro:Body:Conclusion:
Last Updated :Feb 29, 2020, 2:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.