ETV Bharat / bharat

పీఎఫ్ఐ ట్విట్టర్ ఖాతాలు రద్దు.. ఆఫీసులకు సీల్.. ఆ రాష్ట్రాల్లోనూ నిషేధం!

author img

By

Published : Sep 29, 2022, 12:32 PM IST

ban-on-pfi
ban-on-pfi

PFI ban: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కేంద్రం డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేశాయి. కర్ణాటకలోని ఒక్క నగరంలోనే 12 పీఎఫ్ఐ కార్యాలయాలను పోలీసులు సీల్ చేశారు.

Ban on PFI: ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సామాజిక మాధ్యమ ఖాతాలు రద్దయ్యాయి. ఇప్పటికే ఆ సంస్థపై నిషేధం పడగా.. తాజాగా పీఎఫ్ఐ ఖాతాలను దేశంలో నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. చట్టపరమైన డిమాండ్లకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిషేధిత సంస్థకు సంబంధించిన ఖాతాలను నిలిపివేయాలని అన్ని సామాజిక మాధ్యమాలకు బుధవారమే ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఈ మేరకు ట్విట్టర్, యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్ సహా ఇతర సంస్థలను ఆదేశించింది.

మరోవైపు, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సైతం పీఎఫ్ఐపై నిషేధాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాయి. సంస్థ కార్యకలాపాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు, పోలీసులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థగా నోటిఫై చేసింది. ఇక, కర్ణాటకలోని పీఎఫ్ఐ కార్యాలయాలను పోలీసులు మూసేశారు. ఒక్క మంగళూరు నగరంలోనే 12 కార్యాలయాలకు సీల్ వేశారు. ఇందులో పీఎఫ్ఐ విద్యార్థి విభాగమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం సైతం ఉందని పోలీసులు తెలిపారు.

సంస్థపై నిషేధం
ఉగ్ర ముఠాలతో సంబంధాలు కొనసాగిస్తూ దేశ భద్రతకు ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంటూ పీఎఫ్‌ఐపై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల ఈ సంస్థ కార్యలయాలు, నేతలపై 15 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించి.. వందమందికి పైగా ఆ సంస్థ కీలక నేతలను, మద్దతుదారులను అరెస్టు చేసింది. ఆ తర్వాత కేంద్రం నిషేధంపై నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ సంస్థ కూడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం చర్య నేపథ్యంలో తమ విభాగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నట్లు పీఎఫ్‌ఐ నిన్న వెల్లడించింది. అయితే నిషేధంపై ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.