ETV Bharat / bharat

'పీఎఫ్​ఐ'ని నిషేధించిన కేంద్రం.. ఉపా చట్టం కింద ఐదేళ్లు బ్యాన్​

author img

By

Published : Sep 28, 2022, 6:45 AM IST

Updated : Sep 28, 2022, 12:03 PM IST

PFI Banned In India
PFI Banned In India

06:37 September 28

'పీఎఫ్​ఐ'ని నిషేధించిన కేంద్రం.. ఉపా చట్టం కింద ఐదేళ్లు బ్యాన్​

PFI Banned In India : అతివాద సంస్థ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'(పీఎఫ్ఐ)ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలను సైతం నిషేధిత జాబితాలో చేర్చింది.

పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో చాలా మంది నిషేధిత సిమీ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని కేంద్ర హోంశాఖ తన నోటిఫికేషన్​లో పేర్కొంది. వీరికి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)తో లింకులు ఉన్నాయని తెలిపింది. ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతోనూ పీఎఫ్ఐ సభ్యులకు సంబంధం ఉందని వెల్లడించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు.. దేశంలో అభద్రతా భావాన్ని పెంచి ఓ వర్గాన్ని రెచ్చగొడుతున్నాయని పేర్కొంది.

కేంద్రం నిషేధించిన సంస్థలు

  • పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)
  • రిహాబ్ ఇండియా ఫౌండేషన్
  • క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
  • ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్
  • నేషనల్ కాన్ఫడరెషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్
  • నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్
  • జూనియర్ ఫ్రంట్
  • ఎంపవర్ ఇండియా ఫౌండేషన్
  • రిహాబ్ ఫౌండేషన్ కేరళ

నిషేధంపై స్పందన..
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు స్వాగతించారు. రాజస్థాన్​లోని అజ్మీర్ దర్గా ఇమామ్ సైతం ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. పీఎఫ్ఐపై బ్యాన్ విధించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. విపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్​లు సైతం నిషేధం విధించాలని కోరినట్లు గుర్తు చేశారు. అనేక దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పీఎఫ్ఐ హస్తం ఉందని, విదేశాల్లో వీరికి పట్టు ఉందని అన్నారు.

దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు ఈ నిషేధం అవసరమని భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో పీఎఫ్ఐ హస్తం ఉందని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని అన్నారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. విభజన అజెండా ఉన్న ఎవరితోనైనా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

'సంస్థ కన్నా దేశమే గొప్ప'
మరోవైపు, అజ్మీర్ దర్గా అధినేత జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ సైతం నిషేధంపై స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. దేశం సురక్షితంగా ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారని అన్నారు. సంస్థలు, భావజాలాల కన్నా దేశమే గొప్పదని పేర్కొన్నారు. దేశాన్ని విభజించే శక్తులకు ఇక్కడ జీవించే హక్కు లేదని స్పష్టం చేశారు. పీఎఫ్ఐపై నిషేధం విధించాలని రెండేళ్ల క్రితమే తాను డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. ఆల్ఇండియా సజ్జదనషిన్ కౌన్సిల్ ఛైర్మన్ నసీరుద్దీన్ ఖాన్, సూఫీ మతగురువు ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తీ సైతం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్​ఐ)పై ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడులు చేపట్టాయి. రెండు విడతలుగా నిర్వహించిన సోదాల్లో భాగంగా.. వందల సంఖ్యలో పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశాయి. అనేక రికార్డులను, ఆస్తులను జప్తు చేశాయి. కీలక డాక్యుమెంట్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది. 2006లో పీఎఫ్ఐ ఆవిర్భవించింది. ముస్లిం మైనారిటీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేది.

అసలు ఎందుకీ ఆపరేషన్?
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవారు, ముష్కరుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజల్ని ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్​ చేపట్టామన్నది ఎన్​ఐఏ మాట. ఇటీవల అనేక వివాదాలతో వార్తల్లో నిలిచిన పాపులర్ ఫ్రంట్​ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ కార్యాలయలాపైనే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధానంగా గురిపెట్టింది.

అసలేంటీ పీఎఫ్​ఐ?
2006లో కేరళలో ఏర్పాటైంది పీఎఫ్​ఐ. ప్రస్తుతం దిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతూ ఉంటుంది. కానీ.. దేశంలోని భద్రతా సంస్థల వాదన మాత్రం భిన్నం. అతివాద ఇస్లాంను పీఎఫ్​ఐ ప్రోత్సహిస్తోందన్నది ప్రభుత్వ వర్గాల ప్రధాన ఆరోపణ.

పీఎఫ్​ఐపై ఇంకేమైనా కేసులు ఉన్నాయా?
అవును. పీఎఫ్​ఐపై ఇంతకముందు కూడా ఇలాంటి దాడులు జరిగాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు, 2020 దిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రస్​లో దళిత బాలిక సామూహిక అత్యాచారం వ్యవహారంలో కుట్ర సహా మరికొన్ని సందర్భాల్లో.. పీఎఫ్​ఐ ఆర్థిక వనరులు సమకూర్చిందన్న ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. లఖ్​నవూలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే రెండు అభియోగ పత్రాలు కూడా దాఖలు చేసింది.

Last Updated :Sep 28, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.