ETV Bharat / bharat

భూమి-భుక్తి కోసం బ్రిటిష్​ సైన్యాన్నే ఢీకొట్టారు

author img

By

Published : Jun 25, 2022, 7:50 AM IST

Azadi Ka Amrith Mahotsav
Azadi Ka Amrith Mahotsav

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము పేరుతో మరో పేరూ ప్రచారంలోకి వచ్చింది! అదే ఆమె తెగ సంతాల్‌! ఆంగ్లేయులపై సమరంలో ఈ తెగకో ప్రత్యేకత ఉంది. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభానికి రెండేళ్ల ముందే.. సంతాల్‌లు భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేశారు. ఆధునిక ఆయుధాల ముందు నిలువలేమని తెలిసినా.. ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడుకోవటానికి విల్లంబులతో బ్రిటిష్‌ సైన్యాన్ని ఢీకొట్టారు.

Azadi Ka Amrith Mahotsav Sannthal People: ఒడిశా, ఝార్ఖండ్‌, బెంగాల్‌, బిహార్‌లలో నివసించే ఆదివాసీ తెగ సంతాల్‌. వీరి భాష సంతాలి. ఈస్టిండియా కంపెనీ పాలన కంటే ముందు.. అడవులను రక్షించుకుంటూ, వేటాడుకుంటూ, సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ప్రతిదాంట్లో వ్యాపారం, లాభాల్ని చూసే ఆంగ్లేయుల దృష్టి వీరుండే అడవులపైనా పడింది. అడవుల్ని చదును చేసి.. వాణిజ్య పంటలు సాగుచేయాలని నిర్ణయించారు. దీనికి తోడు.. 1793లో కార్న్‌వాలిస్‌ జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. తద్వారా శిస్తు కట్టించుకుంటూ భూమిని జమీందార్ల పరం చేశాడు. ఈ క్రమంలో సంతాల్‌ల రక్షణలో ఉన్న అటవీ భూమిని కూడా వేలం వేసి.. జమీందార్లకు అప్పగించారు. ఆ విషయం సంతాల్‌లకు చెప్పలేదు. వ్యవసాయం చేసుకోవటానికి వీలుగా.. సంతాల్‌లు అందరికీ ఒకే చోట భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చి.. సంతాల్‌ పరగణా (ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది)గా ప్రత్యేక ప్రాంతాన్ని నిర్దేశించారు. అది నమ్మిన సంతాల్‌లు సంబరపడ్డారు.

ఒడిశా, బిహార్‌, బెంగాల్‌ల నుంచి తమ తెగవారందరినీ రప్పించి ఒక చోటికి చేర్చారు. కష్టపడి భూమి అంతటినీ చదును చేసి వ్యవసాయ, నివాస యోగ్యంగా మార్చారు. తీరా అంతా పూర్తయ్యాక చదువురాని ఆ ఆదివాసీలను ఆంగ్లేయులు మోసం చేశారు. ఆ భూమిని జమీందార్ల పరం చేశారు. అప్పటిదాకా తమదిగా, తమను రక్షించేదిగా ఉన్న భూమిలో సంతాల్‌లు పరాయివారయ్యారు. జమీందార్ల కింద బానిసలయ్యారు. దీనికి తోడు.. డబ్బుల వ్యవహారం కూడా వారికి కొత్త. అప్పటిదాకా తమలో తాము వస్తు మార్పిడి పద్ధతిలో జీవిస్తున్న సంతాల్‌లకు డబ్బులపై అవగాహన లేదు. దీంతో.. జమీందార్లకు శిస్తు చెల్లించటానికి రుణ దాతలు, వడ్డీవ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. క్రమంగా చాలామంది రైల్వే మార్గాల నిర్మాణానికి, నీలిమందు సాగుకు మళ్లారు. ఇలా సంతాల్‌ల జీవనం అతలాకుతలమైంది. ఆంగ్లేయ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయ్యింది. సంతాల్‌లలో అసంతృప్తి రోజురోజుకూ పెరిగింది.

ఈ నేపథ్యంలో.. తెగ పూజారులైన ముర్ము సోదరులు సిధు, కన్హు, చంద్‌, భైరవ్‌ల సారథ్యంలో అంతా ఏకమయ్యారు. తిరుగుబాటు ద్వారానే.. అణచివేత నుంచి బయట పడతామంటూ.. సిధు ముర్ము 1855 జూన్‌లో ప్రకటించి.. ఆకుల ద్వారా సంతాల్‌లు అందరికీ సందేశాలు పంపించారు. జూన్‌7న దాదాపు 10వేల మంది భోగనాదిహ్‌ గ్రామంలో సమావేశమై.. ఈస్టిండియా కంపెనీ అధికారులతోపాటు జమీందార్లకు హెచ్చరిక పంపించారు. ఎలాంటి స్పందన లేకపోవటంతో.. కలకత్తాలో గవర్నర్‌ జనరల్‌ను కలవటానికి బయల్దేరారు. కానీ మధ్యలోనే వారి తెగ పెద్దను ఆంగ్లేయ సర్కారు అరెస్టు చేసింది. ఈ విషయం తెలియగానే.. సంతాల్‌ల కోపం కట్టలు తెంచుకుంది. విల్లంబులు పైకిలేచాయి. తిరుగుబాటు దావానలంలా వ్యాపించింది. తమ ప్రాంతాల్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఈ ఆదివాసీలు.. బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ ఆంగ్లేయులపైనా, వారి ఏజెంట్లపైనా పోరాడతామని ప్రతినబూనారు.

తేలిగ్గా తీసుకున్న కంపెనీ.. కొంతమంది పోలీసులను చర్చలకు పంపించింది. వారి శవాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఉలిక్కిపడ్డ ఆంగ్లేయులు యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పటికే రాజ్‌మహల్‌ (ప్రస్తుత ఝార్ఖండ్‌లోనిది), భాగల్‌పుర్‌ (బిహార్‌), బీర్‌భూమ్‌ (బెంగాల్‌)లోని ప్రాంతాలను సంతాల్‌లు స్వాధీనం చేసుకున్నారు. జమీందార్లను, వడ్డీ వ్యాపారులను తరిమివేయసాగారు. వారికి అండగా వచ్చిన బ్రిటిష్‌ పోలీసులు కూడా పారిపోయారు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్న ఆంగ్లేయులు బెంగాల్‌ నుంచి ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. సంతాల్‌లు సంప్రదాయ విల్లు, బాణాలతో ఎదురు తిరిగారు. దాదాపు ఏడాదిపాటు ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టారు. కానీ ఆధునిక ఆయుధాల ముందు ఆగలేకపోయారు. సిధు, కన్హు ముర్ములు సహా దాదాపు 20వేల మంది సంతాల్‌లను బ్రిటిష్‌ సైన్యం పొట్టనబెట్టుకుంది. 1856కల్లా తిరుగుబాటు ముగిసినా.. 1857దాకా అక్కడ గెరిల్లా తరహా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీల తిరుగుబాటును విజయవంతంగా అణచివేసినప్పటికీ.. ఆంగ్లేయులు తమ తప్పును సవరించుకున్నారు. సంతాల్‌ల భూమిని ఇతరులు దోచుకోకుండా సంతాల్‌ పరగణ కౌలు చట్టం తీసుకొచ్చారు. వీరి ప్రాంతాల్లో శాంతి భద్రతలను పోలీసులకు కాకుండా గ్రామపెద్దలకు అప్పగించారు.

ఇదీ చదవండి: మాతృభక్తి.. తల్లి మాట తప్ప ఎవరి ఆదేశాలను లెక్కచేయని వీరుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.