ETV Bharat / bharat

మర్యాదస్తుల ఆటలోనూ వివక్షే.. ఎదురించిన నెల్లూరువాసి!

author img

By

Published : Jun 9, 2022, 8:01 AM IST

Mothavarapu Buchi Babu Naidu
Mothavarapu Buchi Babu Naidu

AZADI KA AMRIT MAHOTSAV: ఆటలోనూ ఆంగ్లేయులు వివక్ష ప్రదర్శించడాన్ని చూసి.. భారతీయుల తరఫున ఓ క్లబ్ పెట్టి వారిని ఎదురించారు దక్షిణాది క్రికెట్ పితామహుడు మోతవరపు వెంకట మహీపతి. తెల్లవారి వివక్షపై పోరాడుతూ... దక్షిణభారత్‌లో క్రికెట్‌ వేళ్లూనుకునేలా చేశారు.

Mothavarapu Buchi Babu Naidu: మర్యాదస్తుల ఆటగా క్రికెట్‌ను భారత్‌లో ప్రవేశపెట్టిన ఆంగ్లేయులు... కనీస మర్యాదలను మాత్రం పాటించేవారు కాదు. అడుగడుగునా వివక్ష ప్రదర్శించేవారు. తాము పెవిలియన్‌లో ఉంటూ... భారతీయులను చెట్ల కింద ఉంచేవారు. ఆ వివక్షకు వ్యతిరేకంగా... ఓ క్లబ్‌ పెట్టి... భారతీయులను ఆంగ్లేయుల సరసన నిలిపారో... తెలుగు వీరుడు. ఆయనే దక్షిణాది క్రికెట్‌ పితామహుడు మోతవరపు వెంకట మహీపతి... ఉరఫ్‌ బుచ్చిబాబు నాయుడు ఉరఫ్‌ బుచ్చిబాబు!

AZADI KA AMRIT
మోతవరపు వెంకట మహీపతి

బుచ్చిబాబుది నెల్లూరు జిల్లా! ఐదుగురు అన్నదమ్ముల్లో 1868లో జన్మించిన బుచ్చిబాబే పెద్దవారు. తాత మోతవరపు డేరా వెంకటస్వామి నాయుడు. బుచ్చిబాబును తాతే దత్తత తీసుకున్నారు. వీరి కుటుంబం అప్పట్లో మద్రాసులోని బ్రిటిష్‌ కంపెనీలకు, భారతీయులకు మధ్య దుబాసీలుగా/మధ్యవర్తులుగా వ్యవహరించేది. సుసంపన్న కుటుంబంగా పేరొందింది. బుచ్చిబాబు, ఆయన సోదరుల పెంపకం, చదువు... ఆంగ్లేయులకు ఏమాత్రం తగ్గకుండా జరిగింది. ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పట్టభద్రుడైన ఆయనకు ఆటలంటే విపరీతమైన ప్రేమ. అప్పటికే 1846లో యూరోపియన్లు మద్రాస్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)ను స్థాపించారు. 1865 నుంచి చెపాక్‌ మైదానంలో ఆట మొదలైంది. అయితే... కేవలం తెల్లవారిని మాత్రమే అక్కడ ఆడనిచ్చేవారు. ఎంసీసీ పూర్తిగా తెల్లవారికే పరిమితం. చెపాక్‌లో తెల్లవారు ఆడుతుంటే బుచ్చిబాబు సహా భారతీయులంతా బయటి నుంచి చూడాల్సి వచ్చేది. మైలాపుర్‌లోని తమ బంగళాకు వచ్చి బుచ్చిబాబు ప్రాక్టీస్‌ చేసేవారు. తన ఆటకు అలా పదును పెట్టుకున్న ఆయన... అనేక మంది భారతీయ ఔత్సాహికులను క్రికెట్‌ ఆడేందుకు ప్రోత్సహించారు. అందులో పేదలే ఎక్కువ. ఇంట్లోంచి ధోవతీలతో వచ్చేవారికి... ఆటకు అనువైన దుస్తులు, సామగ్రిని కొనిచ్చి బలమైన జట్టును తయారు చేశారు.

ఎలాగైనా ఆంగ్లేయులపై నెగ్గాలనే తపనతో... ఎంసీసీకి పోటీగా... మద్రాస్‌ యునైటెడ్‌ క్లబ్‌ (ఎంయూసీ)ను ఏర్పాటు చేశారు. ఎస్ల్పానెడ్‌ వద్ద 1888లోనే మైదానం తీసుకొని... క్రికెట్‌కు అనువుగా చదును చేయించారు. చెపాక్‌లో ఆంగ్లేయులు ఆడుతున్న వాటికంటే కూడా మెరుగైన ఆరు పిచ్‌లు సిద్ధం చేశారు. ఈ మైదానంలో భారతీయులు సాధన చేస్తూ, మ్యాచ్‌లు ఆడేవారు. కొద్దిరోజుల్లోనే ఎంసీసీతో మ్యాచ్‌లాడే స్థాయికి బుచ్చిబాబు మద్రాసు యునైటెడ్‌ క్లబ్‌ జట్టు తయారైంది.

ఆంగ్లేయుల ఎంసీసీతో ఎంయూసీ మ్యాచ్‌లు మొదలయ్యాయి. భారతీయులు కొన్ని ఓడితే మరికొన్ని నెగ్గేవారు. అలా... తెల్లవారికి తామేమీ తీసిపోమనే సంగతి నిరూపించారు బుచ్చిబాబు. అయినా... ఆంగ్లేయుల వివక్ష మాత్రం తగ్గలేదు. మ్యాచ్‌ మధ్యలో పెవిలియన్‌లోకి భారతీయులను అనుమతించేవారు కాదు. యూరోపియన్లు పెవిలియన్‌లో భోజనం చేస్తే... భారతీయులను చెట్లకింద కూర్చొని తినమనేవారు. ఈ వివక్షను బుచ్చిబాబు తీవ్రంగా నిరసించారు. తమకంటే మెరుగైన మైదానం... పిచ్‌లు, ప్రాక్టీస్‌ చేస్తున్న ఎంయూసీతో టోర్నమెంటు ఆడి ఓడించాలనుకున్నారు ఆంగ్లేయులు! ఎంసీసీ కెప్టెన్‌ పాట్రిడ్జ్‌ ఓ మెగా టోర్నీ ప్రతిపాదనతో ముందుకొచ్చారు.

ఇదే అదనుగా... బుచ్చిబాబు షరతు విధించారు. పెవిలియన్‌ను ఆంగ్లేయులతో పాటు భారతీయులు కూడా వాడుకునేందుకు అనుమతిస్తేనే టోర్నీకి సిద్ధమన్నారు. ఆంగ్లేయులందరితో మాట్లాడిన పాట్రిడ్జ్‌ అయిష్టంగానే అయినా... అందుకు అంగీకరించారు. అలా బుచ్చిబాబు కారణంగా భారతీయులు తలెత్తుకొని ఆడే పరిస్థితి వచ్చింది. 1908 డిసెంబరు చివర్లో మ్యాచ్‌కు రెండు జట్లూ ఎంతో ఉత్కంఠగా సిద్ధమయ్యాయి. ఆంగ్లేయులతో సమానంగా... భారతీయులు ఆడే ఆ క్షణాల కోసం ఎంతో తపించిన బుచ్చిబాబు... దురదృష్టవశాత్తు డిసెంబరు 19న కన్నుమూశారు. అంతకు ముందు భార్య, అల్లుడు మరణించటం ఆయన్ను కుంగదీసింది. దీంతో ప్రెసిడెన్సీ మ్యాచ్‌ జరగదనుకున్నారంతా! కానీ ఆయన సంస్మరణార్థం డిసెంబరు 31న మొదలెట్టారు. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ ఫలితం తేలకుండానే రద్దయింది. 1915 నుంచి ఇది వార్షిక టోర్నీగా మారింది. ఏటా సంక్రాంతి సమయంలో పొంగల్‌ మ్యాచ్‌ పేరిట నిర్వహించేవారు. టెస్టు మ్యాచ్‌లు, దేశవాళీ రంజీట్రోఫీ ఆరంభానికి ముందే... భారత్‌లో ఇదో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పేరొందింది.

బుచ్చిబాబు వారసత్వాన్ని ఆయన కుమారులు కొనసాగించారు. వెంకట్రామానుజులు (భట్‌), బాలయ్య, రామస్వామి... తండ్రి పేరు నిలబెట్టారు. ఇద్దరూ భారత్‌ తరఫున టెస్టులాడారు. బీసీసీఐ కూడా బుచ్చిబాబు పేరిట ఓ చిన్న టోర్నీ కొనసాగించింది. ఆంగ్లేయ ఆట అనే ముద్ర చెరిపేసి... తెల్లవారి వివక్షపై పోరాడుతూ... దక్షిణభారత్‌లో క్రికెట్‌ వేళ్లూనుకునేలా చేసిన బుచ్చిబాబు పేరు ఇప్పుడు పెద్దగా వినిపించకపోవటం విషాదం. ఆయన గుర్తులు లేకున్నా... ఆయన కోరుకున్నదానికంటే ఎక్కువగానే ఆట విస్తరించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.