ETV Bharat / bharat

ఆత్మాభిమానమే ముఖ్యం.. రారాజుకు నిర్మానుష్య స్వాగతమే!

author img

By

Published : Dec 19, 2021, 8:27 AM IST

azadi ka amrit mahostav
ఎడ్వర్డ్‌

ఇక్కడున్న ఆంగ్లేయ కలెక్టర్‌కే ఎక్కడలేని రాచమర్యాదలు సాగుతుంటే.. ఇక ఇంగ్లాండ్‌ నుంచి ఏకంగా రారాజే వస్తే ఎలా ఉంటుంది? ఎంత హంగామా ఉంటుంది? అలా ఊహించుకునే 1921లో భారత్‌లో అడుగుపెట్టిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌.. ఎడ్వర్డ్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. నిర్మానుష్యమైన వీధులు.. నిరసనలు, హర్తాళ్‌లు, దాడులతో కూడిన వాతావరణం ఆహ్వానం పలికింది. పర్యటనంతా అవమానకరంగా ముగిసింది.

కాలంలో బ్రిటన్‌లో ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌కున్న ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. కొన్నేళ్ల కిందట మరణించిన బ్రిటిష్‌ యువరాణి డయానాకెంత పలుకుబడి, ప్రాచుర్యం ఉండేవో.. ఆ కాలంలో ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌కూ అలా ఉండేది. భావి రాజును.. నాలుగునెలల పాటు వలసరాజ్య ప్రజలను చూసి, తమ ఆధిపత్యాన్ని ఆస్వాదించి రావాల్సిందిగా భారత్‌కు పంపించింది బ్రిటన్‌!

తొలి ప్రపంచయుద్ధం ముగిసిన కాలమది. బ్రిటన్‌కు భారత్‌ భారీగా ఆర్థిక, సైనిక సాయం చేసింది. వేలమంది భారతీయులు తమదిగాని యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ కృతజ్ఞతతోనైనా భారత్‌కు ఆంగ్లేయులు స్వయంప్రతిపత్తి ఇస్తారేమోనని ఆశించారు. కానీ అలాంటిదేమీ లేదని పాషాణ బ్రిటన్‌ స్పష్టం చేసింది. పైగా జలియన్‌ వాలాబాగ్‌ లాంటి.. దారుణానికి ఒడిగట్టింది. అలాంటి సమయంలో.. భారతీయులను సముదాయించి.. తమ ఆధిపత్యానికి వారితోనే ఆమోదముద్ర వేయించుకోవటానికి ఎడ్వర్డ్‌ ముంబయిలో అడుగుపెట్టారు.

కానీ బ్రిటిష్‌ రారాజుకు.. తమ మనసులో ఏముందో భారతీయ ప్రజానీకం స్పష్టంగా తెలియజెప్పారు. పైగా... గాంధీజీ సైతం... ఎడ్వర్డ్‌ పర్యటనను బహిష్కరించాలని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని, సహాయ నిరాకరణకు పిలుపునివ్వటంతో బహిష్కరణవాదులకు ఊపువచ్చింది. రారాజు పర్యటనను యావత్‌ భారతావని బాయ్‌కాట్‌ చేసింది.

సాధారణంగానైతే.. యావత్‌ ముంబయిలో సంబరాల వాతావరణం ఉండాల్సింది. బోసిపోయిన వీధులు, మూసిన దుకాణాలతో కూడిన బంద్‌ వాతావరణం... ఎడ్వర్డ్‌కు ఆహ్వానం పలికాయి. 35 పట్టణాలు, నగరాల్లో ఎడ్వర్డ్‌ పర్యటన ఖరారు కాగా.. అంతటా అదే పరిస్థితి. కంగారు పడ్ద స్థానిక బ్రిటిష్‌ అధికారులు తమకు జీహుజూర్‌ అనే సంస్థానాధీశులను ఆశ్రయించారు. ముంబయి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద నుంచి మొదలెడితే.. ఎక్కడికి వెళ్లినా సంస్థానాధీశులు ప్రజల్ని సమకూర్చారు. పాఠశాల పిల్లలు, ముతకా ముసలితో జనసమీకరణ చేసి.. రారాజు వచ్చిన చోటల్లా.. 'మీ సేవలో' అంటూ బ్యానర్లు రాయించి.. తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. పంజాబ్‌ పర్యటనైతే పూర్తిగా పోలీసు రక్షణలో సాగింది.

అట్టుడికిన ముంబయి..

అప్పటిదాకా హిందు, ముస్లింలను విభజించామనుకొని సంబరపడుతున్న ఆంగ్లేయులకు ఎడ్వర్డ్‌ రాకతో ముంబయిలో జరిగిన విధ్వంసం ఆశ్చర్యం కలిగించింది. పార్సీలు, యురోపియన్లు రారాజుకు స్వాగతం పలికారు. దీంతో పార్సీల దుకాణాలపై హిందు, ముస్లింల్లోని కొంతమంది దాడులు చేశారు. ఇది క్రమంగా తీవ్ర హింసారూపం దాల్చి మూడు రోజుల పాటు పరిస్థితి అదుపు తప్పింది. దాదాపు 50 మంది మరణించారు.

ఆహ్వానమా.. ఆత్మాభిమానమా..

మరోవైపు.. మద్రాసులో కూడా ఇదే పరిస్థితి. కర్ణాటక సంగీతంతో స్వాగతం పలుకుతారనుకుంటే... కర్ణకఠోరమైన నినాదాలతో ఎదురొచ్చారు ప్రజలక్కడ. "వేలమంది మనవాళ్లు జైళ్లలో మగ్గుతున్న వేళ... మద్రాసు ప్రజలు ఆంగ్ల రారాజుకు ఆహ్వానం పలుకుతారా... ఆత్మాభిమానం చాటుకుంటారో చూడాలి" అంటూ స్వదేశాభిమాన్‌ పత్రిక పెట్టిన పతాక శీర్షిక అందరినీ కదిలించింది. ఫలితంగా 1922 జనవరి 13న ఎడ్వర్డ్‌ మద్రాసుకు రాగానే... నిరసనలు ఎదురేగాయి. ఆయన్ను రూటు మార్చి... బడి పిల్లలతో స్వాగతం చెప్పించి అతిథిగృహానికి చేర్చారు. మద్రాసు వీధులన్నీ అల్లర్లతో అట్టుడికాయి. ఎడ్వర్డ్‌రాకకు మద్దతిచ్చిన జస్టిస్‌ పార్టీ నేత తంగరాజచెట్టి ఇంటిపైనా ఆందోళనకారులు దాడి చేశారు. మద్రాసు అల్లర్లలో ఇద్దరు మరణించారు. అటు ముంబయిలో, ఇటు మద్రాసులో అల్లర్లను చూసిన గాంధీజీ ఆందోళనకు గురయ్యారు. తక్షణమే వాటిని ఆపేయాలంటూ నిరాహార దీక్ష ఆరంభించారు. శాంతి నెలకొనేదాకా మంచినీళ్లు తప్ప మరేమీ ముట్టనంటూ భీష్మించారు. పరిస్థితి తర్వాత అదుపులోకివచ్చినా... ముంబయిలోనే దాదాపు 30వేల మందిని అరెస్టు చేసింది బ్రిటిష్‌ ప్రభుత్వం. మొత్తానికి ఎడ్వర్డ్‌ పర్యటన ఆంగ్లేయుల చేతిలో భారతీయుల పరిస్థితికి అద్దం పడుతూ అవమానకరంగా ముగిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.