ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్కు విశాఖ ముస్తాబు - టికెట్ల కోసం బారులు తీరిన క్రికెట్ అభిమానులు
India-Australia T20 Match in Visakha : క్రికెట్ అంటే చాలు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడి లేని ఆనందం. అదే ఆటకు మన రాష్ట్రం వేదిక అయితే..! చూడటానికి ఎన్ని ఇబ్బందులైనా లెక్కచేయడం లేదు క్రికెట్ అభిమానులు. ఈ నెల 23న (నవంబరు 23) భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ20 మ్యాచ్కు.. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికైంది. మ్యాచ్కు ఆఫ్లైన్ టికెట్ల విక్రయం ప్రారంభమైంది. ఇందుకు క్రీడాభిమానులు టికెట్ల కోసం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు.
టికెట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున యువత, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరికి 2 టికెట్లు మాత్రమే విక్రయిస్తున్నట్లు ఏపీ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000,రూ.5000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. టికెట్ల కొనుగోలు కోసం స్త్రీ, పురుషులకు వేరు వేరు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టికెట్ల కొనుగోలు విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు నగర కమిషనర్ వెల్లడించారు.