CM Jagan started medical college in Vizianagaram: వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు: ముఖ్యమంత్రి జగన్
CM Jagan started medical college in Vizianagaram : నాలుగేళ్లలో ప్రణాళికాబద్ధంగా వైద్య విద్యలో ముందుకు వెళ్తున్నామని.. వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయనగరంలో మెడికల్ కళాశాల (Medical College) ను ప్రారంభించిన ఆయన.. 5 కళాశాలల్లో ఈ ఏడాది మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమం నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం చేరుకున్నారు. జేఎన్టీయూ (JNTU) దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న జగన్ కు.. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైద్యం విషయంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అని తెలిపారు. ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, 17 వైద్య కళాశాలలకు గాను.. 5 కళాశాలల్లో ఈ ఏడాది మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించామని వెల్లడించారు.
వచ్చే ఏడాది మరో 5, ఆ తర్వాత మరో 5 వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని, వీటికి అదనంగా రూ.8,400కోట్లతో 17 కళాశాలలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్రంలో 2,250సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయని సీఎం వివరించారు. ప్రస్తుతం ప్రారంభించిన ఐదు కొత్త కళాశాలల్లో 750మంది వైద్య విద్యను అభ్యసించనున్నారని, దశల వారీగా ఏర్పాటు కానున్న మిగిలిన మెడికల్ కళాశాలలోనూ వైద్య సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ సీట్లే కాకుండా నర్సింగ్ విద్య (Nursing education) ని ప్రవేశపెడతామని చెప్పారు. ఆరోగ్యశ్రీ విధానాన్ని విస్తరించుకుంటూ పోతున్నామన్న సీఎం.. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా 108, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, నాలుగేళ్లలో కేవలం వైద్యశాఖలోనే 53,126పోస్టులు భర్తీ చేశామని సీఎం జగన్ వివరించారు.