ETV Bharat / state

Singareni Privatization : సింగరేణిని మేమెలా ప్రైవేటీకరిస్తాం?

author img

By

Published : Dec 8, 2022, 9:28 AM IST

Singareni Privatization
కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ

Central Govt Clarity on Singareni Privatization : కేంద్రం సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు చూస్తోందన్న వార్తలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందించారు. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు. సంస్థలో 51% వాటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం బొగ్గు గనుల కేటాయింపు వేలం ద్వారా మాత్రమే జరుగుతున్నట్లు.. కావాలంటే తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనవచ్చని తెలిపారు. తద్వారా వేలం ద్వారా వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు.

Central Govt Clarity on Singareni Privatization : కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఖండించారు. ఆ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా మాత్రమే ఉందని, అలాంటప్పుడు తామెలా ప్రైవేటీకరించగలుగుతామని ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో అత్యవసర ప్రజాప్రయోజన అంశం కింద కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రస్తావనపై జోషీ ఈమేరకు బదులిచ్చారు.

తొలుత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేయడం పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి ఆధీనంలో ఉన్న ఈ గనులను వేలం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సింగరేణి గనులకు ఆనుకొని ఉన్న వీటిని ఆ సంస్థకు అప్పగించకుండా వేలం వేయడం అన్నది అసంబద్ధ, హాస్యాస్పద నిర్ణయం. అందువల్ల తక్షణం వేలాన్ని రద్దుచేసి ఆ నాలుగు గనులను సింగరేణికి అప్పగించాలి. ప్రధానమంత్రి గత నెలలో తెలంగాణలో పర్యటించినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గనులను వేలానికి పెట్టి ఆ దిశగానే ముందుకెళ్తోంది. దీనిపై కేంద్రం సమాధానం ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు.

అందుకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందిస్తూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణలను ఖండించారు. ‘‘గనుల వేలం ప్రక్రియ రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. అందుకోసం అత్యంత పారదర్శకమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. దీనిపై ఇప్పటివరకూ ఎవ్వరూ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వానికి మేలుచేస్తుంది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వేలంలో పాల్గొనవచ్చు. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లలోనూ వేలం ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి ప్రభుత్వాలు అందుకు సహకరిస్తున్నాయి. వేలం ద్వారా వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ప్రభుత్వానికే వెళ్తుంది. బొగ్గు కుంభకోణంలో హస్తం ఉన్నవారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల కుంభకోణం చేసిన వారు పారదర్శక వేలం విధానాన్ని కోరుకోవడంలేదు’’ అని ధ్వజమెత్తారు.

మూడేళ్లలో సింగరేణి ఉత్పత్తి 11%మేర పెంపు: వచ్చే మూడేళ్లలో సింగరేణి ఉత్పత్తిని 11%మేర పెంచనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 69.82 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని, 2023-24లో 72.50 మి.ట., 2024-25లో 75.30 మి.ట., 2025-26లో 78.14 మిలియన్‌ టన్నులకు ఉత్పత్తిని తీసుకెళ్లాలన్నది ప్రణాళిక అని చెప్పారు. భారత భూగర్భసర్వే సంస్థ అంచనాల ప్రకారం తెలంగాణలో 23,034.20 మిలియన్‌ టన్నుల నిల్వలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలో ఆరోస్థానంలో ఉన్నట్లు తెలిపారు. సింగరేణి కాలరీస్‌ ప్రస్తుతం 82-90% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

నాలుగు బొగ్గుగనులను సింగరేణికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది: తెలంగాణలో కల్యాణ్‌ఖని బ్లాక్‌-6, కోయగూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రవణపల్లి బొగ్గుగనుల వేలాన్ని రద్దుచేసి వాటిని సింగరేణికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసినట్లు ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. టీఆర్​ఎస్ ఎంపీలు వెంకటేష్‌ నేత, రంజిత్‌రెడ్డిలు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. అయితే కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఖరారుచేసిన విధానం ప్రకారం ప్రస్తుతం బొగ్గు గనుల కేటాయింపు వేలం ద్వారా మాత్రమే జరుగుతున్నట్లు గుర్తుచేశారు. అందువల్ల సింగరేణి కాలరీస్‌తోపాటు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వేలంలో పాల్గొని నిబంధనల ప్రకారం వాటిని చేజిక్కించుకోవచ్చని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.