ETV Bharat / state

Janasena Murthy Yadav complaint: 'అధికార పార్టీ నేతల అక్రమాలు గ్రేటర్ విశాఖ అధికారులకు పట్టవా'

author img

By

Published : Jul 28, 2023, 7:44 PM IST

Janasena Murthy Yadav complaint: మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు... అధికార పార్టీ పెద్దల విషయంలో అక్రమాలను పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. వివాదాస్పద స్థలంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విషయంలో నగరపాలక సంస్థ మొద్దు నిద్ర నటిస్తోందని తెలిపారు.

జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు
జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు

Janasena Murthy Yadav complaint: సామాన్య ప్రజలు నుంచి అన్ని రకాల పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు.. అధికార పార్టీ పెద్దలను మాత్రం వదిలేస్తున్నాయని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ గ్రీవెన్సులో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా తో జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. నగరం నడిబొడ్డున వివాదాస్పద సీబీసీఎన్​సీ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ జరుపుతూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వ్యాపారాన్ని ప్రారంభించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విషయంలో నగరపాలక సంస్థ మొద్దు నిద్ర నటిస్తోందని అన్నారు.

జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు

టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధం.. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ రెండు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మైనింగ్ జరిగినా సంబంధిత శాఖ స్పందించడం లేదని తెలిపారు. సీబీసీఎన్​సీ ఖాళీ స్థలానికి మూడు కోట్ల రూపాయల వరకు టాక్స్ భవన నిర్మాణదారు చెల్లించాల్సి ఉన్నా దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని వెల్లడించారు. 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జెస్ సుమారు 15 కోట్ల రూపాయలను ఇప్పటికీ వసూలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి విలువపై రెండు శాతం ఇంపాక్ట్ ఫీజులు ఎంవీవీ సత్యనారాయణ చెల్లించాల్సి ఉందని తెలిపారు. దానిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ఇక్కడ నిర్మిస్తున్నది హైరైజడ్ అపార్ట్​మెంట్​ అయినందున రహదారి నుంచి ఏడు మీటర్లను వదిలి అందులో రెండు లైన్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్నది టౌన్ ప్లానింగ్ నిబంధన అని వెల్లడించారు. భవన నిర్మాణంలో దానిని ఇక్కడ అమలు చేయడం లేదని, ఆ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.

కోర్టు కేసులున్నా.. స్థలానికి అక్రమంగా ఇచ్చిన 63 కోట్ల రూపాయల టీడీఆర్​ను రద్దు చేయాలన్న విషయాన్ని నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు.. పైపెచ్చు నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకున్న స్థలం చుట్టూ ఇప్పటికీ కాంపౌండ్ వాల్ నిర్మించలేదని మూర్తి యాదవ్ అన్నారు. దీనికితోడు భవన నిర్మాణదారుడు ఎంపీ కావడం వల్లే ప్రతిరోజు లక్షలాది మంది నడిచే రహదారిని నిబంధనలకు విరుద్ధంగా వాస్తు పేరిట మూసివేసి నగర ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ స్థలంపై హక్కులు ఇప్పటికీ కోర్టు వివాదాల్లో ఉన్నాయని, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని, భూ హక్కులు పరిష్కారం కాకుండా, భూమి సరిహద్దులపై స్పష్టత లేకుండా, అనుమతులు పొందకుండా బ్లాస్టింగ్ చేయడం, నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడం చట్ట విరుద్ధమని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.