ETV Bharat / city

YSRCP: విశాఖలో ఎంపీ భూమాయ.. కారుచౌకగా భూములు స్వాహా

author img

By

Published : Oct 13, 2022, 7:40 AM IST

YSRCP leaders: కష్టపడి కొనుగోలు చేసి, దశాబ్దాలుగా కాపాడుకుంటున్న భూముల్ని.. వాటి యజమానులు డెవలపర్లకు కారు చౌకగా ఇచ్చేస్తున్నారు. అదీ వైకాపా నాయకులు, వారి సన్నిహితులకే ఏరికోరి మరీ కట్టబెడుతున్నారు. అందులో 30 శాతమో, 20 శాతమో వాటా ఇస్తే చాలు... అదీ కుదరదంటే కనీసం ఒక్క శాతం ఇచ్చినా సరే. అంతకంటే తక్కువ ఇచ్చినా ఏమీ అనుకోం. మా భూముల్ని, స్థలాల్ని మీరు తీసుకుంటే అదే మహద్భాగ్యం అని వేడుకుంటున్నారు. ఇది తెలిసి రాష్ట్రంలోని వైకాపా నాయకులంతా... భలే చౌకబేరం అని పాటలు పాడుకుంటూ విశాఖకు క్యూ కడుతున్నారట. అతిశయోక్తిలా అనిపించినా ఇదే వాస్తవం. ప్రపంచంలో ఎక్కడా లేని వింతలన్నీ ఇప్పుడు విశాఖలోనే జరుగుతున్నాయి మరి.

YSRCP leaders
ఫలహారంలా దశపల్లా, కూర్మన్నపాలెం

ఫలహారంలా దశపల్లా, కూర్మన్నపాలెం భూమాయా

YSRCP MP MVV: విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన 15 ఎకరాల దసపల్లా భూముల్ని.. వాటి యజమానులుగా చెప్పుకొంటున్న 64 మంది ఒకే మాట మీదికొచ్చి.. తమకు 29 శాతం వాటా చాలంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుల కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ ఒప్పందమే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తే.. దాన్ని తలదన్నేలా, వినేవాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా అధికార పార్టీకే చెందిన స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. భూయజమానులతో చేసుకున్న ఒప్పందం బయటపడింది. భూయజమానులకు కేవలం 0.96 శాతం వాటా ఇచ్చి.. తాను 99.04 శాతం వాటా తీసుకునేలా వైకాపా ఎంపీ కుదుర్చుకున్న ఒప్పందం వెలుగుచూడటం దిగ్భ్రమకు గురిచేస్తోంది. ఇలాంటి అద్భుతాలు వైకాపా ప్రజాప్రతినిధులకు, వారి సన్నిహితులకే ఎలా సాధ్యమవుతున్నాయో తెలియక దేశమంతా విస్తుపోతోంది. విశాఖలో జరుగుతున్న భూదందాలకు, వైకాపా నేతల అరాచకాలకు.. ఈ ఒప్పందం పరాకాష్ఠగా నిలిచిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ వాసులకు బిల్డర్‌గా చిరపరిచితులైన ఎంవీవీ సత్యనారాయణ.. రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలవడంతో ఆయన పేరు చాలా మందికి తెలిసింది. స్థిరాస్తి వ్యాపారిగా, ఎంపీగా ఆయనకు ఇంతవరకూ రాని గుర్తింపు.. విశాఖ కూర్మన్నపాలెంలో చేపట్టిన ఓ నిర్మాణ ప్రాజెక్టుతో వచ్చింది. బహుశా ఆయనతో వ్యాపార పాఠాలు చెప్పించడానికి.. ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లు గెస్ట్‌ ఫ్యాకల్టీగా పిలిచినా ఆశ్యర్యపడాల్సిన పని లేదేమో. ఎంపీకి చెందిన ఎంవీవీ అండ్​ ఎంకే సంస్థ.. కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల విస్తీర్ణంలో ఓ భారీ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టింది.

5 వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూములపై 11 మంది యజమానులతో.. 2018 జనవరి 8న జనరల్‌ పవరాఫ్‌ అటార్నీతో కూడిన డెవలప్‌మెంట్‌ ఎగ్రిమెంట్‌ను ఎంవీవీ రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 11 మందీ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో 15 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాక్‌లో 10 అంతస్తుల చొప్పున మొత్తం ఆరు బ్లాకుల్లో 2 వేల ఫ్లాట్లు కడుతున్నారు. అంత భారీ ప్రాజెక్టులో స్థల యజమానులు 11 మందికీ కలిపి.. కేవలం 14 వేల 400 చదరవు అడుగులే ఇస్తారట. వారిని నాలుగు గ్రూపులుగా చేసి, ఒక్కో గ్రూపునకు 3 వేల 600 చదరపు అడుగుల చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ 14 వేల 400 చదరపు అడుగులు కూడా కామన్‌ ఏరియాతో కలిపి ఇస్తారట.

జీవీఎంసీ అనుమతిచ్చిన ప్లాన్‌ ప్రకారం డెవలపర్‌కి 15 లక్షల చదరపు అడుగులకు మించి కట్టుకునే వెసులుబాటు వచ్చినా.. భూయజమానుల వాటా 14 వేల 400 చదరపు అడుగులకు మించదట. 51 వేల 159 చదరపు గజాల స్థలంలో భూయజమానులకు వచ్చే అవిభాజ్య వాటా కేవలం 490 చదరపు గజాలు. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాల్లోనే.. అక్కడ చదరపు గజం స్థలం విలువ 18 వేల రూపాయలుగా పేర్కొన్నారు. మొత్తం విలువ 92.08 కోట్లు. బహిరంగ మార్కెట్లో ఇది చాలా రెట్లు ఉంటుంది. భూమి వెలతో కలిపి మొత్తం ప్రాజెక్టు విలువను 189.50 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. స్టాంప్‌ డ్యూటీగానే 1.89 కోట్లు చెల్లించారు. అంత భారీ ప్రాజెక్టులో భూయజమానులు ఎవరైనా 0.96 శాతంతో సరిపెట్టుకుంటారా అన్నదే అంతుచిక్కని ప్రశ్న.

అంత చవగ్గా ఇచ్చేశారంటే ఆ భూములు దీర్ఘకాలంగా వివాదాల్లోనైనా ఉండాలి. లేదా యజమానులుగా చెప్పుకొంటున్నవారికి.. సంబంధిత భూములపై యాజమాన్య హక్కుల్లో లొసుగులైనా ఉండాలి. లేదా డెవలపర్‌ వారిని బెదిరించైనా ఉండాలి. అదీ కాకుంటే.. ఒప్పందం ప్రకారం వారికి అతి తక్కువ వాటా ఇస్తున్నట్లుగా చూపించి.. భారీగా నల్లధనమైనా ముట్టజెప్పి ఉండాలి. ఇవేమీ లేకుండా అంత కారుచౌకగా భూములివ్వడానికి.. ఎంవీవీ ఏమైనా వృద్ధాశ్రమమో, అనాథ శరణాలయమో కడుతున్నారా..? భూయజమానులు చేసినదేమైనా దానమా..?, ఎంపీ చేస్తున్నది పక్కా వ్యాపారమే కదా..?.

ఎవరికీ తెలియని గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ వైకాపా నాయకులు, వారి అనుయాయులకే తెలిసినట్లున్నాయి. భూముల యజమానులకు వీలైనంత తక్కువ మొత్తం ఇచ్చి, అత్యంత విలువైన భూముల్ని తీసుకునే విద్య వారికే సొంతమైనట్లుంది. దసపల్లా భూముల వ్యవహారాన్నే పరిశీలిస్తే.. వాటి యజమానులుగా చెప్పుకొంటున్న 64 మందిలో అనేక వ్యాపారాల్లో కాకలుతీరిన వారు, స్థిరాస్తి వ్యాపారంలో పండిపోయినవారు, అనేక భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టిన బిల్డర్లు ఉన్నారు. వారికి 29 శాతం ఇచ్చి, డెవలపర్‌ 71 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకోవడమంటే మాటలా..?.. ఆ ఒప్పందం చేసుకున్న డెవలపర్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులని.. వారికి సాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందిన కంపెనీ నుంచే నిధులు వెళ్లాయని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

సాయిరెడ్డి విలేకరుల సమావేశంలో దసపల్లా భూముల విషయానికి వెళ్లకుండా.. ఆ భూముల్ని 22-A నుంచి తప్పించడాన్ని తమ ప్రభుత్వ విజయగాథగా చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వం, విశాఖలో పనిచేసిన కలెక్టర్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన దసపల్లా భూముల్ని అప్పనంగా కొందరికి కట్టబెట్టేయడమే కాకుండా.. అదేదో తమ ఘనతగా చాటుకుంటున్నారంటే సాయిరెడ్డి ఎంత ఘనుడో అర్థమవుతుంది. ఆ దసపల్లా ఒప్పందమే విడ్డూరమంటే.. కూర్మన్నపాలెంలో అదే వైకాపాకు చెందిన స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేసుకున్న ఒప్పందం మరింత విడ్డూరంగా ఉంది. ఈ ఒప్పందం గురించి సాక్షాత్తు సాయిరెడ్డే బయటపెడ్డటం కొసమెరుపు.

కారుచౌకగా భూములు తీసుకోవడంలో విజయసాయిరెడ్డి బంధువులు, సన్నిహితులదే అందెవేసిన చేయి అనుకుంటే.. దానికి పరాకాష్ఠ లాంటి కూర్మన్నపాలెం ప్రాజెక్టు గురించి తెలిసి ప్రపంచమే నివ్వెరపోతోంది. ఇలాంటి ఘనత వైకాపా నాయకులకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీని లోగుట్టు కూడా సాయిరెడ్డి విప్పితే మరింత సమాచారం ఇచ్చినవారవుతారని.. ఆ పుణ్యం కూడా కట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.