అడుగుకో గుంత, గజానికో గొయ్యి - ఈ రహ'దారుణాల' సంగతేంటి?: టీడీపీ, జనసేన ఆందోళన

అడుగుకో గుంత, గజానికో గొయ్యి - ఈ రహ'దారుణాల' సంగతేంటి?: టీడీపీ, జనసేన ఆందోళన
TDP and Janasena Leaders Protest on Damaged Roads: రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పరిస్థితిపై టీడీపీ, జనసేన నేతలు ఆందోళనలు చేపట్టారు. అడుగుకో గొయ్యి.. గజానికో గుంతలతో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
TDP and Janasena Leaders Protest on Damaged Roads: రాష్ట్రంలో రహదారుల దుస్థితి, గతుకుల రోడ్లపై మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పాత నాగులూరు నుంచి రెడ్డిగూడెం వరకు గతుకుల రోడ్డులో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి దేవినేని ఉమ, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు, ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
కొద్ది రోజుల క్రితం గుంతల కారణంగా.. రోడ్డు ప్రమాదంలో రంగాపురంలో మరణించిన చిట్టూరి, అదియ్య ఇళ్లా వెంకట రాజులకు నేతలు నివాళులర్పించారు. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిట్టగూడెం నుంచి పాదయాత్ర చేపట్టారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితార కూడలి సమీపంలో ఉన్న రహదారులపై గుంతల ఆంధ్ర ప్రదేశ్‌కు దారేది అంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగా ఆధ్వర్యంలో జనసేన శ్రేణులతో కలిసి సితార కూడలి నుంచి పలు వీధుల్లో అసంపూర్తిగా మిగిలి ఉన్న రహదారులను చూపుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా.. నాలుగున్నరేళ్లలో రహదారులులేక పడుతున్న వెతలను స్థానికులు తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా స్థానిక ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాసరావు రెండున్నర సంవత్సరాలు పనిచేసి తన నియోజకవర్గంలోని రోడ్లను వేయలేని దుస్థితి నెలకొందని అన్నారు. పేరుకే మంత్రి అయినప్పటికీ నియోజవర్గంలో ప్రతి పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడి.. నియోజవర్గంలోని అభివృద్ధికి కుంటుపడేలా వెల్లంపల్లి శ్రీనివాసరావు చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
ఈ రహదారులు నరకానికి దారుల్లా మారాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజీ వద్ద తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే చారిత్రక ధవళేశ్వరం బ్యారేజీపై ఉన్న రోడ్డు దుస్థితిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ రావు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వం మరిచిపోయిందని, కక్ష సాధింపులు చేయడమే పనిగా పెట్టుకుందని వారన్నారు. రోడ్ల పరిస్థితులను ప్రయాణికులకు వివరిస్తూ వంతెనపై పాదయాత్ర చేశారు.
