Bus Fell Into Pothole on Tullur Road: రాజధాని ప్రాంతంలో గుంతలో పడిన బస్సు.. గంటపాటు శ్రమించిన స్థానికులు
Bus Fell Into Pothole on Tullur Road: అడుగుకో గొయ్యి, గజానికో గుంత, తటాకాన్ని తలపించే రహదారులు. ఎప్పుడు ఎక్కడ ప్రమాద బారిన పడతామో ఊహించలేని పరిస్థితి. పది నిమిషాల్లో గమ్యానికి చేరుకోవాల్సిన దూరానికి కూడా గంట పడుతోందని వాపోతున్న ప్రయాణికులు. ఇక వర్షాలు పడితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోందని గగ్గోలు పెడుతున్న ప్రజలు. ఇది మన రాష్ట్ర ప్రయాణికుల పరిస్థితి. జగన్ అధికారంలోకి వచ్చాక రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని ఇదే నిదర్శనం. రాజధాని ప్రాంతంలో రహదారులు గుంతలమయంగా మారిపోయాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు తుళ్లూరు వద్దకు చేరుకునే సమయంలో రహదారిపై ఏర్పడ్డ గుంతలోకి జారుకుంది. బస్సును బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. బస్సుల ప్రయాణిస్తున్న వారిని దించేసి ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసేందుకు యత్నించారు. దాదాపు గంటపాటు శ్రమించినా బస్సు బయటకు రాకపోవడంతో ప్రొక్లైయిన్‌ను తీసుకొచ్చారు. దాని సాయంతో బయటకు తీశారు. ఈ రహదారిపై ప్రయాణం తమకు కత్తిమీద సాములా మారిందని ప్రయాణికులు, బస్సు సిబ్బంది తెలిపారు.