ETV Bharat / state

Damaged Roads: అధ్వానంగా రహదారులు.. బటన్​ నొక్కు జగనన్నా..!

author img

By

Published : Jul 19, 2023, 8:49 AM IST

Updated : Jul 19, 2023, 8:55 AM IST

Public Trouble with Damaged Roads: ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా రాష్ట్రాల మధ్య సరిహద్దు రహదారులు అధ్వానంగా మారాయి. రహదారులపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. భారీ వాహనాలు సైతం నిత్యం ఈ గోతుల్లో పడి ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. దీంతో వాహనాదారులు గమ్యస్థానాలకు చేరుకోవటానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రహదారిని నాలుగు వరుసలు విస్తరించాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించినప్పటికీ.. అది కాగితాలకే పరిమితం అయ్యింది. వాహన చోదకుల పాలిట ప్రాణ సంకటంగా మారిన ఆంధ్ర-ఒడిశా రాష్ట్ర సరిహద్దు రహదారి దుస్థితిపై ప్రత్యేక కథనం.

Damaged Roads
అధ్వానంగా రహదారులు

అధ్వానంగా రహదారులు.. బటన్​ నొక్కు జగనన్నా..!

Andhra-Odisha Border Damaged Roads: చూశారుగా ఈ రహదారి ఎలా ఉందో.. ఇదేదో శివారు గ్రామాల్లోని రోడ్లు అనుకుంటే పొరపాటే. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా మధ్య విస్తరించిన 36వ నెంబర్‌ రాష్ట్ర రహదారి. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి ఒడిశా రాష్ట్ర సరిహద్దులోని పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం కూనేరు వరకు ఈ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గం మీదుగానే నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిలో ప్రయాణమంటే వాహనదారులకు సాహసంతో కూడుకుంది.

అర్తాం, కొమరాడ, బంగారంపేట సమీపంలో ఎక్కడికక్కడ గుంతలమయంగా మారింది. వర్షాల సమయంలో వాటిలో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. ఇదే రోడ్డులో కొమరాడ వద్ద గోతిలో లారీ దిగబడి ఆగిపోవడంతో మూడున్నర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అర్తాం వద్ద కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒరిగిపోయింది. నిత్యం వాహనాలు ఆగిపోవడం, ప్రమాదాలకు గురికావడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

పార్వతీపురం నుంచి శ్రీకాకుళం మీదుగా కళింగపట్నం వెళ్లే రహదారి అత్యంత దారుణంగా మారింది. పార్వతీపురం మండలం అడ్డాపుశిల, గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద తారు లేచి, రాళ్లు తేలి, పెద్ద పెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. దీంతో చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. రహదారిపై మధ్యలో నుంచి వెళ్తే వాహనాలు గుంతల్లో దిగిపోతున్నాయి. ఓ పక్క నుంచి వెళ్దామంటే ఏ వైపు ఒరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక రాత్రి పూట ఐతే అసలు ప్రయాణం చేయలేకపోతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్వతీపురం-కూనేరు మార్గంలో నడిచేవన్నీ దాదాపు అద్దె బస్సులే. రోడ్డు మరమ్మతుల చేయకపోవడంతో ప్రయాణ సమయంలో వాహనాలు అకస్మాత్తుగా కట్టర్లు విరిగిపోయి మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో వస్తున్న ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ అవుతోందని వాహనచోదకులు వాపోతున్నారు. వర్షం కురిసిన సమయంలో గోతులను అంచనా వేయకపోవడంతో వాహనాలు ఫుట్‌ బోర్డులు రోడ్డుకు తగిలి ప్రమాదాలు జరుగుతున్నాయని బస్సుడ్రైవర్లు చెబుతున్నారు.

రోడ్ల దారుణ పరిస్థితిపై అధికారుల్ని ప్రశ్నించగా.. రహదారుల అభివృద్ధికి 2 కోట్లు అవసరమని.. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఐతే గోతులు పడిన చోట్ల మట్టితో పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని సెలవిచ్చారు. అధ్వానంగా మారిన రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టి చూపాలని.. తాత్కాలిక మరమ్మతులతో మమ అనిపించకుండా.. శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.

Last Updated : Jul 19, 2023, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.