ETV Bharat / state

Challa family clashes: 'చల్లా'రని కుటుంబ విభేదాలు.. తాజాగా మరొకసారి

author img

By

Published : Jul 9, 2023, 1:48 PM IST

Differences in Challa family: దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అవుకు మండల కేంద్రంలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలే సమస్యలకు ప్రధాన కారణాలని చెబుతున్నారు.

Differences in Challa family
'చల్లా'రని కుటుంబ విభేదాలు.. తాజాగా మరొకటి

Differences in Challa family: నంద్యాల జిల్లాలో చల్లా కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి, చల్లా రాజకీయ వారసుడు చల్లా విఘ్నేశ్వరరెడ్డి మధ్య ఏడాదిగా విభేదాలు కొనసాగుతున్నాయి. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు సేకరించి, అసత్య ప్రచారాలు చేస్తూ తమ ఉనికిని దెబ్బతీస్తున్నారంటూ అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించారు. విషయం తెలుసుకున్న చల్లా అభిమానులు శ్రీలక్ష్మి వ్యవహారాన్ని తప్పుబట్టారు.

మాటలతో ప్రారంభమై దాడుల వరకు.. చల్లా శ్రీలక్ష్న్మి, విఘ్నేశ్వరరెడ్డి అభిమానుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై దాడుల వరకూ వెళ్లింది. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సకాలంలో పోలీసులు చొరవ తీసుకొని గుంపులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీ లక్ష్మి, ఆమె అనుచరులు విక్రాంత్‌రెడ్డి, సాయితేజరెడ్డి, చరణ్‌రెడ్డి,.. మరోవర్గం తరఫున చల్లా రాజశేఖర్‌రెడ్డి, డి.రవీంద్రనాథ్‌రెడ్డిలకు బనగానపల్లి సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఇరువర్గాలకు చెందిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అవమానపరుస్తున్నారు.. తమ ఉనికిని జీర్ణించుకోలేని వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కాల్‌డేటా సేకరించి అవమానకరంగా ప్రచారం చేస్తున్నారని చల్లా శ్రీలక్ష్మి ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేయాలనుకుంటే.. చల్లా కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి, చల్లా సోదరులు అడుగడుగునా అడ్డుకుంటూ అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు.

కుటుంబ పరువు తీస్తే సహించం.. రాజకీయాలతో పాటు వ్యక్తిగత విషయాల్లో దివంగత నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉందని చల్లా రాజశేఖరరెడ్డి అన్నారు. అలాంటిది చల్లా కుటుంబం పేరు, ప్రతిష్టలకు భంగం కలిగితే ఎలా భరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి, ఆమె అనుచరులు చేస్తున్న తప్పుడు ప్రచారంతో చల్లా కుటుంబం పరువుపోయి వీధికెక్కే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. చల్లా కుటుంబ పరువు పోతుంది అనే కాని మాకు శ్రీలక్ష్మిపై ఎలాంటి ద్వేషం లేదని రాజశేఖరరెడ్డి అన్నారు.

ALSO READ: నెల్లూరులో రెచ్చిపోయిన వైఎస్సార్​సీపీ నేతలు.. టీడీపీ సానుభూతిపరులపై కత్తులు, రాడ్లతో దాడి..

కారు అద్దాలు ధ్వంసం.. కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఏన్ని రోజులు గడిచినా చల్లారటం లేదు. తాజాగా చల్లా శ్రీలక్ష్మి సమీప బంధువు అయిన చల్లా శ్రీ చరణ్​ కారు అద్దాలను వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, దుగ్గిరెడ్డి రవీంద్రారెడ్డి అనుచరులే కారు అద్దాలు ధ్వంసం చేశారని శ్రీలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

'చల్లా'రని కుటుంబ విభేదాలు.. తాజాగా మరొకసారి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.