ETV Bharat / state

లంచమిస్తే చాలు.. కేసులన్నీ నీరుగారు

author img

By

Published : Jun 11, 2020, 3:38 PM IST

కర్నూలు జిల్లా పోలీసులపై ఏసీబీ దాడులు
కర్నూలు జిల్లా పోలీసులపై ఏసీబీ దాడులు

కర్నూలు జిల్లాలో కొందరు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ అధికారులు తరచూ దాడులు జరుపుతున్నా ఏమాత్రం భయపడకుండా.. లంచాలు తీసుకుంటున్నారు. నేరాలను నియంత్రించటంలో కొంతమేర సఫలీకృతమైన ఉన్నతాధికారులు తమ శాఖలో అవినీతిని నియంత్రించటంలో విఫలమవుతున్నారు.

కర్నూలు జిల్లాలో కొందరు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని జలగల్లా పీడిస్తున్నారు. ఏసీబీ అధికారులు తరచూ దాడులు జరుపుతున్నా ఏమాత్రం భయపడటం లేదు. అధికారులు మొదలుకొని సిబ్బంది వరకు ఎవరి స్థాయిలో వారు అక్రమార్జన చేస్తున్నారు. నేరస్థులకు శిక్షలు వేయించి నేరాలు నియంత్రించాల్సిన కొందరు పోలీసు అధికారులు కేసులు నీరు గార్చి నిందితులను తప్పించి డబ్బులు దండుకునే దుస్థితికి దిగజారుతున్నారు. నేరాలను నియంత్రించటంలో కొంతమేర సఫలీకృతమైన ఉన్నతాధికారులు తమ శాఖలో అవినీతిని నియంత్రించటంలో విఫలమవుతున్నారు.

ఏటా జిల్లా పోలీసు శాఖలో అవినీతి అధికారులు అనిశాకు పట్టుబడుతూనే ఉన్నారు. అనిశాకు చిక్కనివారు భారీ సంఖ్యలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పోలీసుశాఖలో 2017 నుంచి అనిశాకు చిక్కిన పోలీసుల కేసులను ఒకసారి పరిశీలిస్తే..

● గతంలో నంద్యాల డీఎస్పీగా పనిచేసిన హరినాథ్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై.. 2017, అక్టోబర్‌ 27న కర్నూలులో ఆయన అనిశా అధికారులు దాడి చేసి రూ.10 కోట్ల వరకు ఆస్తులు గుర్తించి కేసు నమోదు చేశారు.

● ఓ కేసులో ముద్దాయి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ 2018, మే 30న కర్నూలు తాలుకా సీఐ ఇస్మాయిల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యనారాయణరెడ్డి అనిశాకు చిక్కారు.

● 2019, ఆగస్టు 11న అప్పటి గోస్పాడు ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ హరినాథ్‌ రూ.30 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు దొరికిపోయారు.

● 2019, డిసెంబర్‌ 16న సీసీఎస్‌ సీఐ రామయ్యనాయుడు ఒకరి నుంచి రూ.40 వేలు లంచం తీసుకున్నట్లు అనిశా కేసు నమోదు చేసింది.

● తాజాగా దిశ పోలీసుస్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అన్నాజప్ప రూ.13 వేలు తీసుకుంటూ అనిశాకు దొరికారు.

ఇవీ చదవండి... : దారి చూపిన గిరి స్ఫూర్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.