ETV Bharat / state

టైపింగ్‌లో అద్భుత ప్రతిభ... మెరిసిన ఉయ్యూరు చిన్నారి

author img

By

Published : Nov 5, 2020, 12:24 PM IST

Uyyuru girl inducted into the Indian Book of Records
అద్భుత ప్రతిభమెరిసిన ఉయ్యూరు చిన్నారి

ఆ చిన్నారికి ఇంకా ఆరేళ్లయినా నిండలేదు. అయితేనేం తన అభిరుచి, తపనకు తగ్గట్టుగా ఓ చక్కని ఆలోచనకు పదును పెట్టింది. కంప్యూటర్‌ కీబోర్డుపై ఏ నుంచి జెడ్‌ వరకు, అలాగే జెడ్‌ నుంచి ఏ వరకు ఆంగ్ల అక్షరాలను అతి తక్కువ సమయంలోనే టైప్‌ చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. గత ఏడు నెలల కాలంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో 16 అవార్డులు పొంది శెభాష్‌ అనిపించుకుంటోంది వినూత్న.

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన వినూత్న రెండో తరగతి చదువుతోంది. తండ్రి రామ్‌ప్రసాద్‌ పాత కార్ల వ్యాపారం చేస్తుంటారు. తల్లి నవ్య ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు కంప్యూటర్‌పై తమ పనులు చేసుకునే సమయంలో చిన్నారి వినూత్న కూడా గమనిస్తూ తానూ ఏదో ఒకటి చేయాలని భావించింది. ఆ తర్వాత కంప్యూటర్‌ కీబోర్డుపై అక్షరాలను తాకడం చేస్తుండేది. గమనించిన తండ్రి.. పాపను ప్రోత్సహిస్తూ కీబోర్డుపై అక్షరాలను టైప్‌ చేయడం నేర్పించారు. టైటిల్‌ మాస్టర్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసి దాని ద్వారా టైపింగ్‌ అంశాలను నేర్పించడంతో ఆమెలోని ప్రతిభ నెమ్మదిగా బయటపడింది. ఇలా సరదాగా టైపింగ్‌ ప్రారంభించిన వినూత్న.. ఏ నుంచి జెడ్‌ వరకు ఆంగ్ల అక్షరాలను టైప్‌ చేసింది. ఇంకా వేగంగా టైప్‌ చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే నిత్యం దాదాపు నాలుగైదు గంటలు సాధన చేసింది. 26 ఆంగ్ల అక్షరాలను ప్రారంభంలో 44 సెకన్లలో టైప్‌ చేయగా.. ప్రస్తుతం ఆ సమయాన్ని సుమారు 3.50 సెకెన్లకు కుదించుకుంది.
కళ్లకు గంతలు కట్టుకుని..
కళ్లకు గంతలు కట్టుకుని ఆ అక్షరాలను రెండు విధానాల్లో తక్కువ కాలంలో కంపోజ్‌ చేసి అబ్బుర పర్చుతోంది. ఇప్పటి వరకు 26 అక్షరాలను అంతర్జాతీయ స్థాయిలో 3.36 సెకన్లలో కంపోజ్‌ చేసి రికార్డు సాధించింది. ఇటీవల ఆయా లక్షరాలను జడ్‌ నుంచి ఏ వరకు(వెనుక నుంచి ముందుకు) 3.76 సెకండ్లలో కంపోజ్‌ చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆమె తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు నుంచి మూడు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు నుంచి మూడు అవార్డులు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ అవార్డు నుంచి రెండు, రాష్ట్ర స్థాయిలో మరిన్ని అవార్డుల్ని సాధించింది. వినూత్న గ్రాండ్‌ మాస్టర్‌ అవార్డుకు కూడా ఎంపికైందని, త్వరలో దాని అందుకోనుందని ఆమె తండ్రి రామ్‌కుమార్‌ తెలిపారు. గిన్నీస్‌ బుక్‌ గురించి తల్లితండ్రి మాట్లాడుకుంటుంటే అది పొందాలనే ఆలోచన కలుగుతోందని ఆమె చెబుతోంది. కంప్యూటర్‌ ద్వారా దాన్ని సాధిస్తానంటోంది. ఐపీఎస్‌ చదవాలనే కోరిక ఉందని చెబుతోంది వినూత్న.

ఇదీ చదవండీ...హైదరాబాద్​ మెట్రోలో పవన్​ కల్యాణ్ షూటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.