ETV Bharat / state

'7న సీఎస్ అధ్యక్షతన సమావేశం.. పెండింగ్​ అంశాలపై అదేరోజు స్పష్టత..!'

author img

By

Published : Mar 2, 2023, 8:14 PM IST

Etv Bharat
Etv Bharat

Ministers committee meeting with Employees Unions : ఉద్యోగ సంఘాలు వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలు కోసం గవర్నర్​కు ఫిర్యాదు చేయడం, సీఎస్​కు ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తాను సీఎం జగన్ నమ్మిన బంటునని ప్రకటించుకున్నారు.

Ministers committee meeting with Employees Unions : మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి... సమావేశానికి సంబంధించి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. వాటిలో ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల రెగ్యులర్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం.. 13 వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని, పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్​పై ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

హామీలు ప్రకటించిన కమిటీ..: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో 94 ఆర్థిక, ఆర్ధికేతర అంశాలను ప్రభుత్వానికి ఇచ్చామని.., వాటిలో 24 మాత్రమే పరిష్కృతం అయ్యాయని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జలతో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. 10 ఏళ్ల సర్వీసు దాటిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వెల్లడించారు. 13 వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత..: రెండు డీఏలు పెండింగ్​లో ఉన్నాయని.. ఎన్నికల కోడ్ ముగిశాక ఒక డీఏ ఇస్తామని కమిటీ తెలిపిందని తెలిపారు. సీపీఎస్​పై కూడా త్వరలోనే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసులను కూడా మాఫీ చేసేందుకు కమిటీ అంగీకారం తెలిపిందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బదిలీలపైనా అంగీకారం తెలియజేశారన్నారు. వారికి సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్ధం చేస్తామని హామీనిచ్చారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరామని వివరించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని.. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు.

గత ప్రభుత్వం హయాంలో మూడు కులాల ఉద్యోగులనే లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడులు చేసింది. అప్పటి సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఎవరిపైనా ఏసీబీ దాడులు జరగలేదు. గతంలో 170 మంది ఉద్యోగులపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు బనాయించింది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఒక్క ఏసీబీ కేసు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి.. నేను జగన్ బంటునే. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఇదే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఉద్యోగులను కోరుతున్నా. - వెంకటరామిరెడ్డి, ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం

ఆరోజు స్పష్టత: డీఏ బకాయిలు, ఏపీ జీఎల్​ఐ బకాయిలు చెల్లింపుపై కమిటీ సభ్యులు బొత్స, సజ్జలను కోరినట్లు ఏపీ ఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. రూ.1200 కోట్లు డీఏ బకాయిలు ఉన్నాయన్నారు. 7వ తేదీన సీఎస్ అధ్యక్షతన మరో సమావేశం ఉంటుందన్నారు. అన్ని పెండింగ్ అంశాలపై ఆరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం మాకు సహకారం అందిస్తోందని.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.