ETV Bharat / sports

IPL 2022: సీఎస్కే.. ఈ సారి వేలంలో రూటు మార్చిందిగా!

author img

By

Published : Feb 14, 2022, 6:21 PM IST

IPL 2022 Mega auction CSK: చెన్నైసూపర్​ కింగ్స్​లో గతసీజన్​ వరకు సీనియర్​ ప్లేయర్లే ఉండేవాళ్లు. కానీ ఈ సారి ఆ ఫ్రాంఛైజీ మెగావేలంలో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇంతకీ ఆ ప్లేయర్స్​ ఎవరు? అసలు సీఎస్కే మొత్తంగా ఎవరెవరిని కొనుగోలు చేసింది? వంటి విషయాలను తెలుసుకుందాం..

IPL 2022 Mega auction CSK
ఐపీఎల్ మెగావేలం సీఎస్కే

IPL 2022 Mega auction CSK: ఐపీఎల్​లో 'డాడీస్‌ ఆర్మీ'గా పేరొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఈ మెగాలీగ్​ చరిత్రలోనే అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌తోపాటు ఫైనల్‌కు చేరిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. గత సీజన్‌ వరకు సీఎస్‌కేలో సీనియర్‌ ప్లేయర్లు అధికంగా ఉండేవాళ్లు. అందుకే సీఎస్‌కే ఫ్రాంచైజీని ‘డాడీస్‌ ఆర్మీ’ అని పిలిచేవారూ ఉన్నారు. ఈ మెగా వేలంలో యువకులకు ఎక్కువగా అవకాశం కల్పించింది. సీఎస్‌కే ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌ను అట్టి పెట్టుకుంది. మరి సీఎస్‌కే జట్టులో ఎవరున్నారు.. వయస్సులో ఎవరు పెద్ద ఆటగాడో చూద్దాం..

వయసులో సీనియర్లు ఎవరంటే..?

డాడీస్ ఆర్మీగా పేరున్న సీఎస్‌కే జట్టులో ప్రస్తుతం ఉన్నవారిలో వయసుపరంగా ధోనీ (40) అందరికంటే పెద్దవాడు. ఇక ధోనీ తర్వాత డ్వేన్ బ్రావో (39), అంబటి రాయుడు (36), రాబిన్‌ ఉతప్ప (36), మొయిన్ అలీ (34), రవీంద్ర జడేజా (33), క్రిస్‌ జొర్డాన్ (33), ప్రిటోరియస్‌ (32) మాత్రమే ముప్పైవ పడి దాటిన వారు. అయితే ధోనీ, బ్రావో మినహా మిగతావారు మరో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా కలిగినవారే. నలుగురిని రిటెయిన్‌ చేసుకోగా.. వేలంలో 21 మంది ఆటగాళ్ల కోసం దాదాపు రూ. 45.05 కోట్లను ఖర్చు చేసింది. ఇంకా సీఎస్‌కే వద్ద రూ. 2.95 కోట్లు మిగులు ఉండటం విశేషం. అంటే మొత్తం 25 మందిలో ఎనిమిది మంది తప్పితే మిగతా అంతా 30వ ఏడాదిలోపు వారే కావడం విశేషం. అందుకే ఇక నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ‘డాడీస్‌ ఆర్మీ’ అని సంబోధించడం ఆగిపోతుందేమో చూడాలి..

మిగిలిన వారిలో ఎవరి వయసెంత..? వారి ధర...?

  1. దీపక్‌ చాహర్ : టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న దీపక్‌ చాహర్‌ వయసు 29 ఏళ్లే. ధోనీ కంటే అత్యధిక ధరను దక్కించుకోవడం గమనార్హం. ధోనీని రిటెయిన్‌ చేసుకుని రూ. 12 కోట్లను చెల్లిస్తుండగా.. దీపక్‌ రూ. 14 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. ఫామ్‌ను కొనసాగిస్తే.. ధోనీ తర్వాత సీఎస్‌కేకు సారథ్యం వహించే అవకాశమూ తలుపు తట్టొచ్చు.
  2. రుతురాజ్‌ గైక్వాడ్‌: గత సీజన్‌ టాప్ స్కోరర్‌ అయిన రుతురాజ్‌ గైక్వాడ్‌ 25 ఏళ్ల యువ క్రికెటర్‌. ఆరెంజ్‌ క్యాప్‌ను నెగ్గి సీఎస్‌కే టైటిల్‌ను కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి అతడికి రూ.6 కోట్లు చెల్లించి మరీ రిటెయిన్ చేసుకుంది. గత మూడేళ్లుగా సీఎస్‌కే అతడికి కేవలం రూ. 20 లక్షలను మాత్రమే ఫీజుగా చెల్లించింది.
  3. శివమ్‌ దూబే: పొడగరి. ఆల్‌రౌండర్‌. మీడియం పేస్‌తోపాటు బ్యాటింగ్‌లో భారీ షాట్లు ఆడగలిగే సమర్థుడు. ఇవన్నీ శివమ్‌ దూబే గురించి. ఇతడి వయస్సు 28 సంవత్సరాలు. శివమ్‌ కోసం సీఎస్‌కే రూ. 4 కోట్లను ఖర్చు చేసింది.
  4. డేవన్‌ కాన్వే, మిచెల్‌ సాంట్నర్, ఆడమ్‌ మిల్నే (ఓవర్సీస్‌) : న్యూజిలాండ్‌కు చెందిన వీరిద్దరూ 30 ఏళ్లు కలిగినవారే. సాంట్నర్‌ కోసం సీఎస్‌కే రూ. 1.90 కోట్లను ఖర్చు చేయగా.. కాన్వేను కోటి రూపాయలకే దక్కించుకుంది. కాన్వే బ్యాటర్‌ కాగా.. సాంట్నర్‌ ఆల్‌రౌండర్‌గా అక్కరకొస్తాడు. కివీస్‌ ఫాస్ట్ బౌలర్‌ ఆడమ్ మిల్నే టీ20ల్లో తక్కువ ఎకానమీతో బౌలింగ్‌ చేస్తాడు. ఇతడి వయస్సు 29 ఏళ్లు. ఆడమ్‌కోసం రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది. ఓపెనింగ్‌ స్పెల్‌లో దీపక్‌ చాహర్‌తోపాటు ఆడమ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కఠిన సవాలే.
  5. రాజ్‌వర్థన్‌ హంగార్గేకర్‌ : అండర్‌-19 క్రికెటర్‌ అయిన రాజ్‌వర్థన్‌ జాక్‌పాట్‌ కొట్టేసినట్లే. విలువపరంగా 1.50 కోట్లను దక్కించుకున్న రాజ్‌వర్థన్‌ తుది జట్టులో స్థానం సంపాదిస్తే మాత్రం ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో ఆడే అరుదైన అవకాశం వస్తుంది. అండర్‌ 19 ప్రపంచకప్‌లో టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండర్‌గా నిలకడైన ప్రదర్శన చేయడమే కలిసొచ్చిన అంశం.
  6. ప్రశాంత్ సోలంకీ : గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీలో ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో ప్రశాంత్ సోలంకీ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. ఈ క్రమంలో 21 ఏళ్ల సోలంకీని సీఎస్‌కే రూ. 1.20 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. లెగ్‌ స్పిన్‌ సంధించడంలో దిట్ట.
  7. తుషార్‌ దేశ్‌పాండే : మీడియం పేసర్‌ అయిన దేశ్‌పాండేను సీఎస్‌కే కనీస ధర రూ. 20 లక్షలకే కొనుగోలు చేసింది. దేశవాళీలో రాణించిన బౌలర్‌ కోసం అన్వేషించగా 26 ఏళ్ల దేశ్‌పాండేను తక్కువ మొత్తానికే సీఎస్‌కే దక్కించుకుంది.
  8. హరి నిషాంత్‌ : తమిళనాడుకే చెందిన హరి నిషాంత్‌ను సీఎస్‌కే రూ. 20 లక్షలకే సొంతం చేసుకుంది. బ్యాటర్‌ అయిన హరి నిషాంత్.. లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్ చేయగల సమర్థుడు. 25 ఏళ్ల హరి నిషాంత్ దేశవాళీలో ప్రదర్శన ఆధారంగా సీఎస్‌కే యాజమాన్యం దృష్టిలో పడ్డాడు.
  9. మహీశ్‌ తీక్షణ (ఓవర్సీస్‌) : శ్రీలంకకు చెందిన 21 ఏళ్ల క్రికెటర్‌ మహీశ్‌ తీక్షణ. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన తీక్షణను సీఎస్‌కే రూ. 70 లక్షలకు సొంతం చేసుకుంది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తీక్షణ ఇప్పటి వరకు నాలుగు వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో ఆరు వికెట్లు, టీ20ల్లో తొమ్మిది వికెట్లను పడగొట్టాడు.
  10. కేఎం ఆసిఫ్‌ : నాలుగేళ్లుగా ఐపీఎల్‌ ఆడుతున్నా పెద్దగా అవకాశాలు రాలేదు. మీడియం పేసర్‌ అయిన కేఎం ఆసిఫ్ వయస్సు 28 ఏళ్లు. ఈసారైనా అవకాశాలు వస్తే నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. మెగా వేలంలో ఆసిఫ్‌ను రూ. 20 లక్షలకే సీఎస్‌కే దక్కించుకుంది.
  11. సిమర్‌జీత్‌ సింగ్‌ : 24 ఏళ్ల సిమర్‌జీత్‌ గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టులో సభ్యుడు. అయితే ముంబయి తరఫున ఒక్క మ్యాచూ ఆడలేకపోయాడు. దేశవాళీలో దిల్లీ తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మెగా వేలంలో కనీస ధర రూ. 20 లక్షలనే అందుకున్నాడు.
  12. శుభ్రాన్ష్‌ సేనాపతి : దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డొమిస్టిక్‌ టీ20ల్లో 26 మ్యాచుల్లో 122.3 స్ట్రైక్‌ రేట్‌తో 637 పరుగులు చేశాడు. దీంతో సీఎస్‌కే దృష్టి పాతికేళ్ల కుర్రాడిపై పడింది. అయితే బేసిక్‌ ప్రైస్‌ రూ. 20 లక్షలకే కొనుగోలు చేసుకుంది.
  13. భగత్‌ వర్మ : ఆంధ్రా క్రికెటర్ అయిన కనుమూరి భగత్‌ వర్మను సీఎస్‌కే రూ. 20 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల యువ క్రికెటర్ ఆల్‌రౌండర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఆఫ్ స్పిన్‌ వేసే భగత్‌ వర్మకు తుది జట్టులో స్థానం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
  14. ముకేశ్ చౌదరి : లెఫ్ట్ఆర్మ్‌ మీడియం పేసర్‌ అయిన ముకేశ్ మహారాష్ట్రకు చెందిన ఆటగాడు. దేశవాళీ టీ20ల్లో పదునైన బంతులన సంధించి సీఎస్‌కే యాజమాన్యం దృష్టిని ఆకర్షించాడు. 25 ఏళ్ల ముకేశ్‌ను సీఎస్‌కే రూ. 20 లక్షలకే సొంతం చేసుకుంది.
  15. నారాయణ్‌ జగదీశన్ : ఇప్పటికే సీఎస్‌కేలో స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. ఒకవేళ ధోనీ గైర్హాజరీలో అంబటి రాయుడు కీపింగ్ చేయగలడు. అయినా మరో యువ కీపర్‌ను సీఎస్‌కే ఎంపిక చేసుకుంది. తమిళనాడుకే చెందిన నారాయణ్‌ జగదీశన్‌ను రూ. 20 లక్షలకు సీఎస్‌కే దక్కించుకుంది. జగదీశన్ వయస్సు 26 ఏళ్లు.

ఇదీ చూడండి: IPL 2022: ఈసారి బరిలో నిలిచే తుది జట్లు ఇవేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.