ETV Bharat / international

చైనాలో 'డెల్టా' విజృంభణ- ఎక్కడికక్కడ లాక్​డౌన్​!

author img

By

Published : Aug 5, 2021, 11:20 AM IST

చైనాను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది జిన్​పింగ్​ ప్రభుత్వం. లాక్​డౌన్ కారణంగా లక్షల మంది చైనీయులు ఇళ్లకే పరిమితమయ్యారు. పర్యటకులు రాకుండా కఠిన ఆంక్షలు విధించగా.. విమాన సర్వీసులను రద్దు చేశారు.

China virus cases
చైనాలో డెల్టా వేరియంట్​ విజృంభణ

కరోనా మహమ్మారి మరోసారి చైనాను వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు నగరాలకు ఈ డెల్టా రకం వ్యాపించిన క్రమంలో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త కేసుల్లో, ఇప్పటికే వ్యాక్సిన్​ తీసుకున్నవారు సైతం ఉండటం కలవరపెడుతోంది.

వ్యాక్సిన్​ పంపిణీ వేగవంతం చేయటం, వైరస్​ భారిన పడిన వారిని త్వరగా గుర్తించి చికిత్స అందించటం వంటి చర్యలతో కమ్యూనిటీల వారిగా వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. మరోవైపు.. పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధిస్తే.. ప్రజలు ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందన్నారు.

గత నెల జులై 10న నాంజింగ్​ ప్రాంతంలో రష్యాకు చెందిన విమానాన్ని శుభ్రం చేసిన సిబ్బందిలో ఎక్కువ మందికి వైరస్​ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నాంజింగ్​ నుంచి హునాన్​ రాష్ట్రంలోని జాంగ్జీయాజీకి పలువురు పర్యటకులు వెళ్లారని, దాంతో ఆ నగరం వైరస్​ హాట్​స్పాట్​గా మారినట్లు తెలిపారు. అక్కడి నుంచి బీజింగ్​తో పాటు మరో 10 రాష్ట్రాలకు వైరస్​ పాకినట్లు చెప్పారు. జాంగ్జియాజీ నగరం నుంచి ఎవరూ బయటకి వెళ్లేందుకు వీలు లేదని ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. వుహాన్​లో విధించిన ఆంక్షలను అమలు చేయనున్నట్లు తెలిపింది.

ఆంక్షలు..

వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది జిన్​పింగ్​ ప్రభుత్వం. ఇతర ప్రాంతాల నుంచి బీజింగ్‌లోకి పర్యటకులు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. విమాన సర్వీసులను రద్దు చేశారు. బీజింగ్‌ సహా ప్రముఖ నగరాల్లో అధికారులు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించారు. దాంతో లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్​డౌన్​ కారణంగా తయారీ, సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడింది. ఆ ప్రభావం.. అంతర్జాతీయ మార్కెట్లుకూ తాకింది.

గతేడాది సంక్షోభం సమయంలో చైనా ప్రభుత్వం తమ వ్యూహంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగింది. కాని, లాక్‌డౌన్‌ కఠిన నిబంధనల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం సంభవించింది. ప్రస్తుతం మళ్లీ చైనాలో లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుండటం వల్ల.. గతేడాది నష్టాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.

జులై రెండో అర్ధభాగం నుంచి ఇప్పటి వరకు 1142 కేసులు నమోదయ్యాయి. అందులో అధికంగా నంజింగ్​ ప్రాంతానికి సంబంధం ఉన్నవే కావటం గమనార్హం. చైనాలో మొత్తం 93,000 కేసులు నమోదు కాగా.. 4.636 మరణాలు నమోదైనట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: 'వారం రోజుల్లో 40 లక్షల కొత్త కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.