ETV Bharat / entertainment

'కాంతార' ఓటీటీ సంగతేంటి? అప్పటివరకు వచ్చే ఛాన్స్​ లేదా?

author img

By

Published : Nov 12, 2022, 5:40 PM IST

Kantara OTT
Kantara OTT

Kantara OTT: ప్రస్తుతం అందరినీ తొలిచేస్తున్న ప్రశ్నలు.. 'కాంతార' ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? కనీసం తేదీ అయినా ప్రకటిస్తారా?.. వీటిపై సినీ ఇండస్ట్రీ నిపుణులు ఏమంటున్నారంటే?

Kantara OTT: 'కాంతార' ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఇండస్ట్రీ టాక్‌ ఏంటి? 'కాంతార'.. భాషతో సంబంధం లేకుండా భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న చిత్రం. సినిమా ప్రచారం కోసం హీరోలు, దర్శకులు ఆపసోపాలు పడుతున్న నేటి తరుణంలో ఒక కన్నడ సినిమాగా విడుదలై కేవలం మౌత్‌ టాక్‌తోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం అందరినీ తొలిచేస్తున్న ఏకైక ప్రశ్న 'కాంతార' ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? కనీసం తేదీ అయినా ప్రకటిస్తారా? ఇటీవల కాలంలో థియేటర్‌లో విడుదలైన వారం పది రోజులకే ఓటీటీకి వచ్చిన సినిమాలెన్నో. ఇందులో అగ్ర కథానాయకుల సినిమాలు ఉన్నాయి. మరి 'కాంతారా' ఎందుకు ఆలస్యమవుతోందంటే..? అందుకు కారణాలేంటి?

  • ఈ ఏడాది సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన 'కాంతార' అతి తక్కువ సమయంలోనే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తెలుగు, హిందీ భాషల్లో చకచకా డబ్బింగ్‌ పనులు పూర్తి చేసి విడుదల చేశారు. తర్వాత మలయాళ, తమిళంలోనూ తీసుకొచ్చారు. ఇతర భాషల్లోనూ మొదటిరోజు నుంచే మంచి టాక్‌తో దూసుకుపోతోంది.
  • అక్టోబరు 15న తెలుగులో 'కాంతార' విడుదలైంది. దాదాపు నెల రోజులు కావొస్తున్నా, ఇప్పటికీ థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తెలుగులోనే కాదు, హిందీలోనూ ఇదే పరిస్థితి.
  • గత మూడు వారాలుగా ఇటు తెలుగు, అటు హిందీలో విడుదలైన సినిమాలేవీ బాక్సాఫీస్‌ వద్ద నిలబడలేకపోయాయి. దీంతో ప్రేక్షకులకు 'కాంతార' ఏకైక ఆప్షన్‌గా నిలిచింది. క్లైమాక్స్‌, రిషబ్‌శెట్టి నటనను చూసేందుకు చాలా మంది రెండోసారి థియేటర్‌కు వస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రేక్షకులు థియేటర్‌కు రెండోసారి రప్పించిన సినిమా ఏదైనా ఉందంటే అది 'కాంతార'.
  • ఇక కలెక్షన్ల విషయానికొస్తే, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.350కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీలో రూ.70కోట్లు, తెలుగులో రూ.50 కోట్లు దాటేసింది.
  • ఇప్పటివరకూ ఒక్క కర్ణాటకలోనే కోటికిపైగా 'కాంతార' మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం బెంగళూరులోనే 17,700 షోలను ప్రదర్శించారు. కేజీయఫ్‌2 రికార్డు (16,800)ను 'కాంతార' బద్దలు కొట్టింది.
  • ఇటీవల కాలంలో హిందీలో సింగిల్‌ డే (24వ రోజు) అత్యధికంగా రూ.4.50కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో రికార్డు వసూళ్లు సాధించగా, అమెరికాలో 2 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

ప్రస్తుతం 'కాంతార' బద్దలు కొట్టిన, కొడుతున్న రికార్డులివి. ఇంత మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న 'కాంతార'ను ప్రస్తుతం ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చేయటం లేదట చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ప్రైమ్‌ వీడియో కొనుగోలు చేసింది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 4న స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తేవాలి. ఆ తర్వాత నవంబరు 18న విడుదల చేస్తారని టాక్‌ నడిచింది.

సినిమా విడుదలైన తర్వాత నిర్ణయించుకున్న తేదీకి ఓటీటీలో చేసే అవకాశం ఉన్నా, వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇంకాస్త ఆగి, విడుదల చేస్తే, సినిమాకు ఇంకాస్త మంచి క్రేజ్‌ వస్తుందని సదరు ఫ్లాట్‌ఫాం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా రాబోయే రోజుల్లో 'హోంబలే ఫిల్మ్స్‌' నుంచి క్రేజీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌ కూడా 'కాంతార'ను ఓటీటీకి తెచ్చే విషయంలో తొందరపడటం లేదు. అన్నీ కుదిరితే ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లు వసూలు చేసిన తర్వాత 'కాంతార'ను ఓటీటీలో విడుదల చేస్తారని టాక్‌. ఆ మార్కును దాటడం అంత కష్టమేమీ కాదు. అప్పటివరకూ 'కాంతార' ఓటీటీకి తీసుకురాకపోవచ్చని ఇండస్ట్రీ టాక్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.