ETV Bharat / city

SEA SAND Selling : 'సముద్ర ఇసుకను అమ్మేస్తున్నారు'... తమిళనాడు సీఎంకు నెల్లూరు గ్రీన్ సొసైటీ లేఖ

author img

By

Published : Jan 24, 2022, 8:51 AM IST

SEA SAND Selling
సముద్ర ఇసుకను.. నది ఇసుకగా అమ్మేస్తున్నారు

SEA SAND Selling : ‘‘నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో లభించే సిలికా శాండ్‌ (సముద్రపు ఇసుక)ను నది ఇసుకగా చూపించి చెన్నైలో నిర్మాణదారులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. వీటిని అడ్డుకోండి’’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రికి నెల్లూరు జిల్లాకు చెందిన గ్రీన్‌ సొసైటీ ఈ నెల 20న లేఖరాసింది.

SEA SAND Selling : ‘‘నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో లభించే సిలికా శాండ్‌ (సముద్రపు ఇసుక)ను నది ఇసుకగా చూపించి చెన్నైలో నిర్మాణదారులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. వీటిని అడ్డుకోండి’’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రికి నెల్లూరు జిల్లాకు చెందిన గ్రీన్‌ సొసైటీ ఈ నెల 20న లేఖరాసింది. చిల్లకూరు, కోట మండలాల్లో సిలికా శాండ్‌ లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలపై అదే ప్రాంతానికి చెందిన కొందరు గ్రీన్‌ సొసైటీగా ఏర్పడి పోరాడుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధి ఒకరు ఇప్పటికే ఓ లీజులో ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు కూడా వేశారు. ఇసుక కాంట్రాక్టర్‌, తితిదే పాలకమండలి మాజీ సభ్యులు శేఖర్‌రెడ్డి మేనల్లుడు మోహన్‌కార్తీక్‌కు చెందిన వామన ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా కొంత కాలంగా పెద్ద ఎత్తున సిలికా శాండ్‌ చెన్నైకి తరలించి విక్రయాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఉన్న 13 లారీలు, ఏపీ రిజిస్ట్రేషన్‌ ఉన్న 5 లారీలు కలిపి మొత్తం 18 లారీల్లో నిరంతరం నెల్లూరు జిల్లా నుంచి చెన్నైకి సిలికాశాండ్‌ తరలిస్తున్నట్లు వివరించారు. ఆరంబాక్కం వద్ద ఓ పెట్రోల్‌ బంకు వెనుక వైపు ఈ ఇసుకను నిల్వచేసి, అక్కడి నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇసుకతో నిర్మాణాలు చేపడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతుందన్నారు. ఈ ఇసుక అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

నిబంధనలు బేఖాతరు..

చిల్లకూరు, కోట మండలాల్లోని పలు లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ గ్రీన్‌ సొసైటీ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు డీజీకి ఫిర్యాదు చేసింది. తమ్మినపట్నంలోని ఏపీఎండీసీకి చెందిన రెండు లీజుల్లో అదనపు తవ్వకాలు చేస్తోందని ఆరోపించారు. బల్లవోలు, మోమిడి, కొత్తపట్నంలోని ముగ్గురు లీజుదారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : విదేశీ సాయానికి కేంద్రం మెలిక.. ప్రాజెక్టులపై నీలినీడలు

అంతా ఓ డీలరు కనుసన్నల్లో..

ఆ ప్రాంతంలో కొంతకాలం కిందట లైసెన్స్‌ పొందిన ఓ డీలరు చక్రం తిప్పుతున్నారు. ఏ లీజుదారైనా తమకే సిలికా శాండ్‌ ఇవ్వాలని, ఇందుకు టన్నుకు రూ.100 ఇస్తామని చెప్పి తన ఆధీనంలోకి తీసుకుంది. ఖనిజమంతా తీసుకొని.. ఇతర డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.

ఫిర్యాదు వచ్చింది.. పరిశీలిస్తాం..

నెల్లూరు గనులశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఆ ఫిర్యాదు తమకు కూడా వచ్చిందని, లీజులను పరిశీలిస్తామన్నారు. శేఖర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎంతో మంది బంధువులు ఉంటారని, వాళ్లు చేసే వ్యాపారాలతో తనకు సంబంధం లేదని, వాటి గురించి తెలియదని పేర్కొన్నారు. వామన ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని మోహన్‌కార్తీక్‌ను సంప్రదించగా.. తాము కేవలం డీలర్‌ మాత్రమే అన్నారు. తమ వద్ద సిలికాశాండ్‌ కొనుగోలు చేసినవాళ్లు ఎక్కడికి తరలిస్తారో, దానితో సంబంధం ఉండదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.