ETV Bharat / city

రిజర్వాయర్ల నిర్వహణపై కమిటీ సమావేశాన్ని వాయిదా వేయండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

author img

By

Published : May 20, 2022, 7:39 AM IST

Krishna Board: జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన సహా వరదనీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ తొలి సమావేశం కానుంది. అయితే తాము ప్రీ మాన్సూన్ తనిఖీల్లో ఉన్నందున ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్​కు లేఖ రాసిన ఆయన.. జూన్ 15వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కోరారు.

Krishna Board: కృష్ణా బేసిన్‌లో రిజర్వాయర్ల నిర్వహణపై చర్చించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. వివిధ అంశాలపై చర్చించేందుకు నిర్ణీత గడువులు పెట్టుకున్నందున ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే జరుగుతుందని స్పష్టం చేసింది. ఇటీవల కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశంలో చర్చించిన మేరకు మూడు అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) ఏర్పాటైంది. బోర్డు సభ్యుడు రవికుమార్‌ పిళ్లై కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మరో సభ్యుడు (విద్యుత్తు) ముతుంగ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, నారాయణరెడ్డి, తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరాజం, ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ సుజయ్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల తదితర ప్రాజెక్టుల్లో విద్యుత్కేంద్రాల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన రూల్‌కర్వ్‌, మిగులు జలాల లెక్కింపు అంశాలపై ఈ నెల 20న సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది.

కానీ రుతపవనాలకు ముందు ప్రాజెక్టులను పరిశీలించాల్సి ఉన్నందున ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌తో సహా అందరూ తీరిక లేకుండా ఉన్నారని, జూన్‌ 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ గురువారం బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పవర్‌హౌస్‌ల నిర్వహణ విధివిధానాలను 15 రోజుల్లో ఖరారు చేయాలని, రూల్‌కర్వ్‌, మిగులు జలాల వినియోగంపై 30 రోజుల్లోగా నివేదిక సిద్ధం చేయాలని, అందువల్ల వాయిదా వేయడం వీలు కాదని బోర్డు తెలంగాణకు బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశానికి తెలంగాణ హాజరవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.