ETV Bharat / city

Obulapuram mining ఓబుళాపురంలో 6 మైనింగ్‌ లీజుల్లో అక్రమాలు, సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ

author img

By

Published : Aug 23, 2022, 8:17 AM IST

Obulapuram mining
ఓబుళాపురం మైనింగ్‌

irregularities in Obulapuram mining permits ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీతోపాటు మరో 5 సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర సాధికార సంస్థ గతంలో ఇచ్చిన నివేదిక దృష్ట్యానే తవ్వకాల అనుమతులపై తదుపరి ఉత్తర్వులు జారీ చేయాలని అమికస్‌ క్యూరీ సిద్దార్థ్‌ చౌధురి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థలు సర్వే ఆఫ్‌ ఇండియా నాటిన స్తంభాలను తరలించడంతో పాటు.. అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపాయని పేర్కొన్నారు. లీజు ప్రాంతంలో తవ్వినదానికి, తరలించినదానికి పొంతనే లేకుండా ఉందని కేంద్ర సాధికార సంస్థ ఇదివరకే చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని కోర్టును కోరారు.

ఓబుళాపురం మైనింగ్‌

irregularities in Obulapuram mining permits ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకాల్లో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీతోపాటు మరో అయిదు సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర సాధికార సంస్థ గతంలో ఇచ్చిన నివేదికను దృష్టిలో ఉంచుకొనే అక్కడ మైనింగ్‌ తవ్వకాల అనుమతులపై తదుపరి ఉత్తర్వులు జారీ చేయాలని అమికస్‌ క్యూరీ సిద్ధార్థ చౌధురి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇనుప ఖనిజం తవ్వకానికి అభ్యంతరం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ వేసిన నేపథ్యంలో అమికస్‌ క్యూరీ ఈ నెల 20న దాఖలు చేసిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ సంస్థలు సర్వే ఆఫ్‌ ఇండియా నాటిన స్తంభాలను తరలించడంతోపాటు, అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపాయని, లీజు ప్రాంతంలో తవ్వినదానికి, తరలించినదానికి పొంతన లేకుండా ఉందని కేంద్ర సాధికార సంస్థ ఇదివరకే చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

‘2010 నవంబరు 19న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి కేంద్ర సాధికార సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. అక్కడ సంబంధిత రికార్డులు పరిశీలించి, పార్టీల వాదనలు విన్న తర్వాత 2011 జనవరి 7న సమగ్ర నివేదిక దాఖలు చేసింది. అందులో తీవ్రమైన ఉల్లంఘనలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు చెప్పారు.

* ఆ నివేదిక ప్రకారం జారీ చేసిన ఆరు మైనింగ్‌ లీజులకు క్షేత్రస్థాయిలో ఎక్కడా పర్మనెంట్‌ కంట్రోల్‌ పాయింట్స్‌ ఖరారు చేయలేదు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సమ్మిరెడ్డి కమిటీ 2009 నవంబరు 20న, కాంపోజిట్‌ సర్వే కమిటీ 2010 జూన్‌ 9న ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నాయి. పర్మనెంట్‌ కంట్రోల్‌ పాయింట్స్‌ లేకుంటే లీజులను క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చూపించొచ్చు.

* అటవీ సంరక్షణ చట్టం 1980 కింద అనుమతులు మంజూరు చేసేటప్పుడు.. లీజు దాటి బయట అటవీ ప్రాంతంలో ఖనిజ తవ్వకాలు జరపకుండా, మైనింగ్‌ ప్రాంతం సరిహద్దు చుట్టూ 20 మీటర్లకొకటి చొప్పున శాశ్వత సరిహద్దు స్తంభాలు పాతాలి. ఈ ఆరు మైనింగ్‌ ప్రాంతాల్లో ఎక్కడా దాన్ని అమలు చేయలేదు. అయినా అధికారులు ఖనిజ తవ్వకానికి అనుమతివ్వడం విస్మయం కలిగిస్తోంది.

* కాంపోజిట్‌ సర్వే కమిటీ, సమ్మిరెడ్డి కమిటీ నివేదికల్లో పేర్కొన్నట్లుగా సిద్దాపురం, ఓబుళాపురం గ్రామాల సరిహద్దుల ప్రకారం బళ్లారి ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్ల సరిహద్దులను నిర్ధారించడం సాధ్యం కాదు. బళ్లారి రిజర్వ్‌ ఫారెస్ట్‌ మ్యాప్‌లో ఈ రెండు గ్రామాల అంతర్‌ సరిహద్దులను చూపకపోవడమే అందుకు కారణం.

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 25.98హెక్టార్లు

ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం లీజు గడువు ముగిసిన తర్వాత రోజు నుంచి రెన్యువల్‌ చేయాలి. అంతే తప్ప రెన్యువల్‌ ఆర్డర్‌ పాస్‌ చేసిన లేదా మైనింగ్‌ కార్యకలాపాలు మొదలుపెట్టిన రోజు నుంచి కాదు. ఈ కేసులో 2004 డిసెంబరు 13న తొలి రెన్యువల్‌ గడువు ముగిసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మైనింగ్‌ లీజు గడువు 2017 ఏప్రిల్‌ 25 వరకు ఉన్నట్లు పరిగణనలోకి తీసుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధం. పునరుద్ధరించిన లీజు ఒప్పందం 1997 ఏప్రిల్‌ 25న కుదుర్చుకున్నందున లీజు రెన్యువల్‌ను ఆ రోజు నుంచే పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా లీజు లేకున్నా 1997 నుంచి 2004 వరకు ఖనిజ తవ్వకాలు నిర్వహించారు. అది పూర్తి చట్టవిరుద్ధం. దాన్ని కొత్తగా లీజు మంజూరు చేసినట్లు భావించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

1980 అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘన

అటవీ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు చేపట్టాలంటే 1980 అటవీ సంరక్షణ చట్టం కింద అనుమతి తప్పనిసరి. అవి లేకుండానే 1997 నుంచి 2004 వరకు ఖనిజ తవ్వకాలకు అనుమతిచ్చారు. అందువల్ల ఆ కాలంలో చేసిన ఖనిజ ఉత్పత్తినంతా చట్టవిరుద్ధమైందిగా పరిగణించాలి. తర్వాత 2005 జులై 18న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అటవీ అనుమతులు మంజూరు చేసింది. ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకొని అంతకు ముందు ఇచ్చిన అనుమతుల్లో మార్పులు చేసి, 2017 ఏప్రిల్‌ 25 వరకు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాకపోయినా ఆ పని చేయడం గమనించదగ్గ అంశం.

అనంతపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 6.50హెక్టార్లు

ఈ గని లీజు తొలి రెన్యువల్‌ గడువు 1986 నవంబరు 26న ముగిసినా ఖనిజ తవ్వకాలు కొనసాగించడానికి అనుమతిచ్చారు. 1990 జనవరి 29న హైకోర్టు వాటిని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో రెన్యువల్‌ కోసం 1985 ఫిబ్రవరి 22న దరఖాస్తు పెట్టుకున్నారు. 1986 జనవరి 26 నుంచి అది అమల్లోకి రావాలి. కానీ 2003 ఆగస్టు 19 నుంచి 20 ఏళ్ల కాలానికి రెన్యువల్‌ అనుమతులివ్వడం చట్టవిరుద్ధం. 2008-09 నుంచి 2009 అక్టోబరు వరకు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఇక్కడి నుంచి తరలించారు. ఇక్కడ కొత్తగా మైనింగ్‌ కార్యకలాపాలు జరిగినట్లు కనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో ఖనిజాన్ని తరలించడంపై గనుల శాఖ దర్యాప్తు చేయాల్సి ఉంది.

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ 68.52 హెక్టార్లు

ఇక్కడ స్టేషన్‌ 8, 10లో సర్వే ఆఫ్‌ ఇండియా పాతిన శాశ్వత స్తంభాలను వేరేచోటకు తరలించారు. ఎలాంటి అధికారం లేకపోయినా ఇక్కడి స్టేషన్‌ నంబర్‌ 8లోని పిల్లర్‌ను కర్ణాటక సరిహద్దుకు పశ్చిమవైపు 40 మీటర్ల మేర తరలించారు. లీజు ప్రాంతాన్ని పెంచుకొని రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి చొరబడటానికి ఈ పని చేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడ చట్టవిరుద్ధంగా రహదారులు కూడా నిర్మించారు. స్టేషన్‌ నంబర్‌ 1 సమీపంలో లీజు ప్రాంతం నుంచి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి 2.95 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించారు. ఇందుకు అటవీ సంరక్షణ చట్టం నుంచి అనుమతులూ తీసుకోలేదు. స్టేషన్‌ నం.8 వద్ద రోడ్డు నిర్మాణానికి అనుమతివ్వగా దాన్ని స్టేషన్‌ నంబర్‌ 7 వద్దకు మార్చేశారు. కర్ణాటక వైపు అక్రమంగా తవ్విన ఖనిజ రవాణాకు ఆ రాష్ట్ర సరిహద్దు వెంట ఉన్న ఇతర లీజు ప్రాంతాలను కలుపుతూ స్టేషన్‌ నంబర్‌ 10 వద్ద మరో రహదారి నిర్మించేశారు. అక్కడి నుంచి భారీగా ఖనిజాన్ని తరలించారు. ఈ మైనింగ్‌ ప్రాంతం నుంచి 29.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజం తవ్వి తరలించినట్లు నమోదు చేశారు. ఇక్కడ పరిసరాలను చూస్తే తరలించిన దానిలో 40% కూడా ఇక్కడ తవ్వినట్లు లేదు. మిగతా ఖనిజాన్ని లీజు వెలుపల ఉన్న అటవీ ప్రాంతం, ఇతర మైనింగ్‌ ప్రాంతం నుంచి తవ్వినట్లు కనిపిస్తోంది. మైనింగ్‌ శాఖ ఖనిజ తరలింపునకు అనుమతి ఇచ్చే ముందు అక్కడ ఎంత ఖనిజాన్ని తవ్వారన్నది పరిశీలించలేదు.

వై.మహాబలేశ్వరప్ప అండ్‌ సన్స్‌ 20.24హెక్టార్లు

వ్యర్థాలు, ఇతర పనికిరాని వస్తువులను పశ్చిమం వైపు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 1.55 హెక్టార్లలో పారబోసినట్లు కమిటీ పరిశీలనలో తేలింది. ఇందుకు అటవీ సంరక్షణ చట్టం 1980 నుంచి అనుమతుల్లేవు.

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ 39.50 హెక్టార్లు

అటవీ సంరక్షణ చట్టానికి విరుద్ధంగా లీజు ప్రాంతం బయట హెక్టార్‌ అటవీ భూమిలో మొత్తం వ్యర్థాలను పారబోశారు.

బళ్లారి ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 27.12హెక్టార్లు

ఇక్కడ అటవీ అనుమతులు ఏమీ లేకుండానే 1.8 హెక్టార్ల అటవీ భూమిలో వ్యర్థాలు పడేశారు. ఈ మైనింగ్‌ కంపెనీ 2009-10 మధ్యకాలంలో 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించింది. మైనింగ్‌ ప్రాంతంలో తవ్వకాల ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఈ ఖనిజం మొత్తాన్ని అటవీ ప్రాంతం నుంచే తవ్వినట్లు కనిపిస్తోంది. గనుల శాఖ ఈ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి.. అని కేంద్ర సాధికార సంస్థ నివేదిక స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

* ఈ లీజుల రెన్యువల్‌ చట్టబద్ధత గురించి, ప్రస్తుతం ఆ 6 గనుల పరిస్థితి గురించి కేంద్ర గనుల శాఖ నుంచి స్పష్టమైన అభిప్రాయం తీసుకోవాలి.

* కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అభిప్రాయం తీసుకోవాలి.

* ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తుపై సీబీఐ నుంచి తాజా నివేదిక కోరాలి. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు జరిపి, బాధ్యులపై ఛార్జిషీటు దాఖలు చేసేలా కోర్టు సీబీఐని ఆదేశించాలి. తాజా నివేదికను సమర్పించేలా కేంద్ర సాధికార సంస్థనూ ఆదేశించాలి’ అని అమికస్‌ క్యూరీ నివేదికలో పేర్కొన్నారు.

ఓబుళాపురం మైనింగ్‌ కేసు మరో ధర్మాసనానికి బదిలీ

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో మైనింగ్‌ కొనసాగింపు అంశంపై ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. అక్రమాల నేపథ్యంలో గనుల్లో తవ్వకాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2010లో నిలిపివేసింది. దీనిపై మైనింగ్‌ కంపెనీ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.