ETV Bharat / city

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే తమ లక్ష్యమన్న పవన్‌

author img

By

Published : Aug 22, 2022, 7:47 PM IST

Updated : Aug 23, 2022, 6:33 AM IST

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే తమ లక్ష్యమన్న పవన్‌
వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే తమ లక్ష్యమన్న పవన్‌

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ అన్నారు. రాజకీయాల్లో ఒక కులాన్ని పట్టుకుని ముందుకెళ్లలేమని, అన్ని కులాల సహకారంతోనే ముందుకెళ్తున్నామని చెప్పారు.

‘అధికారం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి కులాలు, మైనారిటీలు, ఇతర వర్గాల్లోని అభ్యుదయ వాదులతో కలిసి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇదే జనసేన లక్ష్యం. వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని మా పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన విషయానికి కట్టుబడి ఉన్నా. తెలుగుదేశం-మేము కలిసి పోటీ చేస్తాం, మేము-భాజపా కలిసి వెళతాం, మేము-తెదేపా, భాజపా కలిసి పోటీ చేస్తాం.. ఈ మూడింట్లో ఏం జరుగుతుందనేది నేను ఈ రోజు చెప్పలేను. ఎందుకంటే రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అది ఏ వ్యూహమైనా కానివ్వండి వైకాపా విముక్త ఆంధ్రప్రదేశే జనసేన లక్ష్యం’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ ఈ మేరకు తీర్మానం ఆమోదించినట్లు తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన సమావేశం అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేనలో ఒక కులానికే ప్రాధాన్యం ఇవ్వబోమని, అసలు కులస్వామ్యమే ఉండబోదన్నారు. పవన్‌కల్యాణ్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే తమ లక్ష్యమన్న పవన్‌

మోదీ-చంద్రబాబు కలుస్తారని ఎవరైనా అనుకున్నారా?

‘మోదీ, చంద్రబాబు ఇక కలబోవరని చాలామంది అనుకున్నారు. మొన్న వారిద్దరూ కలిసి మాట్లాడుకోలేదా? వారేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. తెలంగాణ ఏర్పాటు నాటికి తెరాసను కాంగ్రెస్‌లో కలిపేస్తానని కేసీఆర్‌ చెబుతూ వచ్చారు. కుటుంబంతో సహా సోనియాగాంధీని కలిసేందుకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ, ఆయన విడిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

రాయలసీమ నుంచే చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఆ ప్రాంతంలో రూ.వేల కోట్ల మైనింగ్‌ జరుగుతోంది. అక్కడ యువతకు మాత్రం ఉపాధి లేదు. అక్కడి సెటిల్‌మెంట్‌ కల్చర్‌ కారణంగానే ప్రాజెక్టులు రావడం లేదు. సీమ నాయకులు ఎవరైనా కోస్తాలో పెట్టుబడులు పెడతారు. అదే సమయంలో కోస్తా, ఇతర ప్రాంతాల నుంచి రాయలసీమ వెళ్లి ఎవరూ పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే... ఆ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకున్న నాయకులకు కప్పం కట్టాలి. రాయలసీమ కొద్ది మంది నాయకుల చేతుల్లోనే ఉండటంతో (ఒక కులం అని చెప్పడం లేదు. ఒక పార్టీ అని చెప్పడం లేదు) ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకే సీమ నుంచి రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. తిరుపతిలో నిర్వహించిన మా జనవాణికి కాశ్మీర్‌లో పనిచేసే ప్రసాద్‌ అనే సైనికుడు వచ్చి... తన రెండెకరాల భూమిని చిత్తూరు జిల్లాలో కబ్జా చేశారని ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం.

మొదట మా పార్టీలో లోపాలను సరిదిద్దుతా

రాష్ట్రంలో అక్టోబరు నుంచి నేను యాత్ర చేపట్టనున్నా. దానికి ముందు జనసేనలోని లోపాలను సరిదిద్దుతా. పక్క నుంచి వెన్నుపోటు పొడవద్దని పార్టీ వారికి స్పష్టంగా చెబుతున్నా. ప్రజారాజ్యంలో టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలియదు. జనసేన నాయకులపై అలాంటి ఆరోపణలు వస్తే ఎలాంటి వారినైనా సస్పెండ్‌ చేస్తా. ఇందుకోసం నా అధ్యక్షతన క్రమశిక్షణ సంఘం ఏర్పాటు చేయబోతున్నా. పెద్దపెద్ద నాయకులు లేకున్నా కిందటి ఎన్నికల్లో 7% ఓట్లు సాధించాం. ఎన్నికల్లో జీరో బడ్జెట్‌ అని నేను అనలేదు. డబ్బులు పెట్టి ఓట్లు కొనబోం అని మాత్రమే చెప్పా. రాజకీయాల్లో ఎక్కువ మంది ఆటగాళ్లు, నాయకులు ఉండాలి. ఇద్దరే ఉంటే ఒకరితో ఒకరు కుమ్మక్కయ్యే ప్రమాదముంది’ అని వివరించారు. అంతకుముందు పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ... రాజకీయ వ్యవహారాల కమిటీలో నాలుగు తీర్మానాలు ఆమోదించామన్నారు. వాటిలో.. దివ్యాంగులసంక్షేమం జనసేన బాధ్యత, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, మైనారిటీ వర్గానికి అండగా ఉండటం, అధికారానికి దూరంగా ఉన్న కులాలకు రాజకీయ అధికారం కల్పించాలనే తీర్మానాలు ఉన్నాయన్నారు.

"ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అలంకార పదవులు దక్కుతున్నాయి. అధికారం చూడని కులాలకు మా పార్టీలో ప్రాధాన్యం ఇస్తాం. వక్ఫ్‌ బోర్డు ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయి. దివ్యాంగుల సంక్షేమానికి మా మ్యానిఫెస్టోలో ప్రత్యేక స్థానం. జనవాణి, కౌలురైతుల భరోసా ద్వారా కొత్త సమస్యలు తెలిశాయి. సమసమాజాన్ని, మానవత్వాన్ని మేం కోరుకుంటున్నాం. ఉపాధి కల్పించాలని రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. రాయలసీమలో పరిశ్రమ పెట్టాలంటే స్థానిక నేతలకు కప్పం కట్టాలి. కప్పం కట్టకుంటే ఏమవుతుందో కియా పరిశ్రమ అనుభవం చూశాం." - పవన్, జనసేన అధినేత

అమరావతి అందరిది: అమరావతి అన్ని కులాల వారిదని పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన కార్యాలయానికి వచ్చిన రాజధాని రైతులు.. రెండోవిడత పాదయాత్రకు పవన్​ను ఆహ్వానించారు. ఉన్న సమస్య పరిష్కరించకుండా 3 రాజధానుల సమస్య తెచ్చారని ప్రభుత్వంపై జనసేనాని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని.., అది అమరావతే కావాలన్నారు. రాజధాని రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని వెల్లడించారు. టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

.
.

ఇవీ చూడండి

Last Updated :Aug 23, 2022, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.