ETV Bharat / business

స్టార్టప్​లకు మైక్రోసాఫ్ట్‌ సహకారం.. కృత్రిమ మేధ అభివృద్ధి చేసుకునేలా

author img

By

Published : Apr 21, 2022, 5:47 AM IST

Microsoft Startup Program: అంకురాలకు సహకారం అందించేలా టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 'సాస్‌ ఇన్‌సైడర్‌' ద్వారా సహకారం అందించే ఈ కార్యక్రమాన్ని అంకురాలు వాటి కార్యకలాపాలను పెంచుకునేందుకు, వినూత్నత దిశగా అడుగులు వేసేందుకు, పరిశ్రమ అనుభవాన్ని సాధించేందుకు ఉపయోగపడేలా రూపొందించారు.

microsoft
మైక్రోసాఫ్ట్

Microsoft Startup Program: కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి, ఆయా సంస్థల అభివృద్ధికి సహకారం అందించేందుకు రెండు కొత్త కార్యక్రమాలతో మైక్రోసాఫ్ట్‌ ఇండియా ముందుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఇన్నోవేటివ్‌ రెండో సీజను కింద సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) అంకురాల (స్టార్టప్‌లు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అంకురాల ప్రధాన అప్లికేషన్లు, సేవలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక ఆధారంగా అభివృద్ధి చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. 'సాస్‌ ఇన్‌సైడర్‌' ద్వారా సహకారం అందించే ఈ కార్యక్రమాన్ని అంకురాలు వాటి కార్యకలాపాలను పెంచుకునేందుకు, వినూత్నత దిశగా అడుగులు వేసేందుకు, పరిశ్రమ అనుభవాన్ని సాధించేందుకు ఉపయోగపడేలా రూపొందించారు. 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కీలక ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఇంజినీరింగ్‌, ప్రోడక్ట్‌ బృందంతో అంకురాలు కలిసి పనిచేస్తాయని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ లాంటి సాంకేతికతలపై నైపుణ్యాన్ని సాధించేందుకు మైక్రోసాఫ్ట్‌ పరిశ్రమ, పరిశోధన, ఇంజినీరింగ్‌ నిపుణుల మార్గనిర్దేశం లభిస్తుందని పేర్కొంది.

టెక్‌జిగ్‌తో కలిసి అంకుర సంస్థల కోసం హాకథాన్‌లను మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తోంది. ఇందులో అంకురాలు ఒక ఆలోచనతో ముందుకొస్తే వాటిని మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ ద్వారా నమూనాలుగా (ప్రోటోటైప్‌) అభివృద్ధి చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. సర్వర్‌లెస్‌, కుబేర్‌నెటెస్‌, డేటా ఫండమెంటల్స్‌, జావా, గితుబ్‌, అజూర్‌ ఎఐ, ఎంఎల్‌ లాంటి కీలక సాంకేతికలను అజూర్‌ మాస్టర్‌క్లాసెస్‌, శిక్షణా కార్యక్రమాల ద్వారా నేర్చుకునే అవకాశం ఈ హాక్‌థాన్‌లో పాల్గొనే అంకుర సంస్థలకు లభిస్తుందని పేర్కొంది. తుది జాబితాకు అర్హత పొందిన ఉత్తమ 100 అంకుర సంస్థలకు 300 డాలర్ల విలువైన అజూర్‌ క్రెడిట్స్‌ లభిస్తాయి. ప్రోటోటైప్‌ల అభివృద్ధికి వీటిని ఉపయోగించుకోవచ్చు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన సంస్థలకు నగదు బహుమతి ఉంటుంది. అత్యుత్తమ 25 సంస్థలు మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టార్టప్స్‌ ఫౌండర్స్‌ హబ్‌ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అర్హత సాధిస్తాయి.

ఇదీ చూడండి : మళ్లీ పెరగనున్న సిమెంట్​ ధరలు.. కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.