ETV Bharat / business

'3, 4 ఏళ్లు ధరలు పైకే.. తీవ్ర ఆర్థిక సమస్యలకు దగ్గరగా వెళ్తున్నాం'

author img

By

Published : Jun 19, 2022, 4:11 AM IST

Updated : Jun 19, 2022, 6:40 AM IST

Jim Rogers on Inflation: ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పెట్టుబడిదార్లకు బంగారం, వెండి వంటి కమొడిటీలే భద్రమైనవని సింగపూర్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, ఆర్థిక నిపుణులు జిమ్‌ రోగర్స్‌ అంటున్నారు. 'ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైనప్పటి నుంచీ చాలా వరకు కమొడిటీల ధరలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మార్కెట్లు, షేర్ల విలువలు క్షీణించాయి. కమొడిటీల్లో వ్యవసాయ.. వ్యవసాయేతర విభాగాలు రెండూ రాణించాయి. వచ్చే మూడు నాలుగేళ్ల వరకు అధిక ద్రవ్యోల్బణ సమస్య కొనసాగొచ్చు. బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూనే ఉండొచ్చ'ని వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్‌'కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ..

Interview with Singaporean Investor Jim Rogers on Inflation
Interview with Singaporean Investor Jim Rogers on Inflation

Jim Rogers on Inflation: భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. సింగపూర్​కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, ఆర్థిక నిపుణులు జిమ్​ రోగర్స్​ కీలక వ్యాఖ్యలు చేశారు. 1970ల్లో మాదిరే వడ్డీ రేట్లు పెరగొచ్చని అంటున్నారు. బంగారం, వెండి వంటి కమొడిటీలే పెట్టుబడులకు శ్రేయస్కరమని ఆయన చెప్పారు. మరో 3-4 సంవత్సరాలు ద్రవ్యోల్బణ సమస్య తీవ్రంగానే ఉండొచ్చని జిమ్​ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం.

కమొడిటీలపై ఇంకా బులిష్‌గానే ఉన్నారా..?
బాండ్ల ధర మరీ ఎక్కువగా ఉంది. అందుకే కమొడిటీలనే కొంటున్నా. దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌తో పాటు భారత్‌, ఇతర దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరాస్తిలో బుడగలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా పేలవచ్చు. ఇది స్టాక్‌ మార్కెట్లోనూ కనిపించొచ్చు. మొత్తం కాకపోయినా.. కొన్ని షేర్లలో కనిపించవచ్చు. కమొడిటీలే ఇప్పటిదాకా చవగ్గా ఉన్నాయి. వెండి తన ఆల్‌టైం గరిష్ఠాల నుంచి 60% తగ్గింది. చాలా వరకు కమొడిటీలు వాటి ఆల్‌టైం గరిష్ఠాలకు చాలా దిగువన ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఎంత మేర ఉండొచ్చంటారు.?
అమెరికాకు ఆర్థిక సమస్య వచ్చి 13 ఏళ్లయింది. అమెరికా చరిత్రలో ఇది చాలా ఎక్కువ సమయం. ప్రపంచం మొత్తం కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యలు లేకుండా ఎక్కువ కాలం గడిపింది. మనకు మళ్లీ ఆర్థిక సమస్య రాకపోవచ్చు అని అంటున్నారు కానీ నాకు కొన్ని అనుమానాలున్నాయి. మనం తీవ్ర ఆర్థిక సమస్యలకు చాలా దగ్గరగా వెళుతున్నామనిపిస్తోంది.

కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లడంపై మీ అభిప్రాయం.
కేంద్ర బ్యాంకుల నిర్వాహకులు మరీ తెలివైనవారేమీ కాదన్నది నా ఉద్దేశం. భారత రిజర్వ్‌ బ్యాంకుకు కొన్నేళ్ల కిందట తెలివైన గవర్నర్‌ ఉండేవారు. ఇపుడాయన అమెరికాలో ఉన్నారు. కేంద్ర బ్యాంకుల చరిత్రలో చాలా కొద్ది మంది మాత్రమే తెలివైన గవర్నర్లున్నారు. ద్రవ్యోల్బణం లేకపోయినా.. డబ్బులు అచ్చు వేస్తున్నామని వారు(కేంద్ర బ్యాంకర్లు) అంటున్నారు. అంటే ద్రవ్యోల్బణం, నగదు ముద్రణ నియంత్రణలో లేదు. యుద్ధం ముగిసేలోపు వడ్డీ రేట్లు భారీగా పెరగొచ్చు. ఎందుకంటే వారేం చేస్తున్నారో వారికి తెలియడం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు ఎప్పటికి గరిష్ఠ స్థాయిలకు చేరొచ్చంటారు.
2024-25 నాటికి చేరొచ్చు. అప్పటికి పరిస్థితులు చేయి దాటిపోయి ఉండొచ్చు. ఆ సమయానికి ప్రపంచ చరిత్రలోనే అత్యధిక అప్పులు అమెరికా కేంద్ర బ్యాంకుకు ఉండొచ్చు. జపాన్‌ ఇప్పటికే అపరిమితంగా డబ్బులు ముద్రిస్తోంది. ద్రవ్యోల్బణం మరో 2-3-4 ఏళ్ల పాటు తీవ్రంగానే ఉండొచ్చు. ద్రవ్యోల్బణంతో పోరాటంలో భాగంగా కేంద్ర బ్యాంకులు 1970ల్లో మాదిరే వడ్డీ రేట్లను పెంచొచ్చు.

పసిడి భవిష్యత్‌ ఏమిటి.. ముడి చమురు ధరలు ఎప్పటికి తగ్గొచ్చు.
నా వద్ద పసిడి, వెండి ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండింటినీ కొనడం లేదు. ఎంత దాకా ఇవి దిద్దుబాటుకు గురవుతాయో తెలియదు. అయితే మరింత పసిడి, వెండి కొనాలని మాత్రం అనుకుంటున్నాను. అన్నీ సద్దుమణిగే నాటికి ప్రజలకు పేపరు నగదు, ప్రభుత్వాలపై విశ్వాసం పోవచ్చు. కాబట్టి పసిడి, వెండి ధరలు మరింత పెరుగుతాయి. అదనపు కొనుగోళ్లు చేసే సమయం కోసం వేచిచూస్తున్నాను. భారతీయులే కాదు.. ప్రపంచమంతా బంగారం, వెండిపై దృష్టి సారిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ముగిస్తే చమురు ధరలు దిగిరావొచ్చు.

భారత్‌ చమురుపై ఆధారపడకుండా ఏం చేయాలంటారు..?
భారత్‌ చాలా బొగ్గు వినియోగిస్తుంది. నేనైతే ఆ దేశం స్థానంలో ఉంటే.. బొగ్గు అభివృద్ధిని కొనసాగిస్తా. యురేనియం, అణు శక్తిని పెంపొందించడం కొనసాగిస్తా. అణు శక్తి అనేది చౌకైన, శుభ్రమైన ఇంధనం. అయితే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అది విధ్వంసానికి దారితీయవచ్చు.

విద్యుత్‌ వాహనాల వల్ల కమొడిటీ ధరలపై ప్రభావం పడుతుందా..?
ప్రపంచమంతా విద్యుత్‌ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. దీని వల్ల చాలా వరకు కమొడిటీల ధరలు పెరగొచ్చు. రాగి, లెడ్‌, లిథియంలను విద్యుత్‌ వాహనాలు వినియోగిస్తుండడంతో ఇవి ప్రియం కావొచ్చు. చమురు, బొగ్గు నుంచి ఇవి మనల్ని రక్షిస్తాయి. కానీ చాలా వరకు ధరలను పెంచుతాయి కూడా.

ఇవీ చూడండి: 'అగ్నిపథ్​' నిరసనలతో ఆగిన ట్రైన్​​​.. వ్యక్తి మృతి.. రైలులోనే మహిళ ప్రసవం

Last Updated :Jun 19, 2022, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.